ఖరీఫ్‌కు సన్నాహాలు


  • క్షేత్రస్థాయి సిబ్బందికి శిక్షణలు
  • ఈ వారంలో మంత్రి సోమిరెడ్డి సమీక్ష
  • కార్యాచరణ ప్రణాళికకు కోడ్‌ అడ్డంకి
అమరావతి, ఏప్రిల్‌ 26(ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది ఖరీఫ్‌ సాగుకు రైతులను సన్నద్ధం చేసేందుకు వ్యవసాయశాఖ చర్యలు చేపట్టింది. ఆశాఖ అమలు చేస్తున్న పథకాలపై జిల్లాల వారీగా క్షేత్రస్థాయి సిబ్బందికి మరోసారి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ వర్క్‌షాప్ లు జరిగాయి. మిగిలిన జిల్లాల్లోనూ మే మొదటి వారంలోగా వీటిని నిర్వహించనున్నారు. ఖరీఫ్‌ సాగుకు భూమిని సిద్ధం చేసుకునే దగ్గర నుంచి పైరు వేసి, పంట కోత వరకు రైతులకు ఎలాంటి సాంకేతిక సహకారాన్ని అందించాలన్న అంశంపై ఏడీఏలు, ఏవోలు, ఏఈవోలు, ఎంపీఈవోలకు వర్క్‌షాపులు నిర్వహిస్తున్నారు. సాగులో అనుసరించాల్సిన చర్యలపై శాస్త్రవేత్తలతో సమన్వయంతో రైతులకు సకాలంలో సూచనలు, సలహాలు ఇవ్వడానికి క్షేత్రస్థాయి సిబ్బందిని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్‌, ప్రత్యేక కమిషనర్‌ మురళీధర్‌రెడ్డి సంసిద్ధం చేస్తున్నారు.
 
వర్షాధారిత పంటల సాగు, పెట్టుబడి లేని సేద్యవిధానాలు, భూసారం పెంపుదల, గ్రామ విత్తన పథకం, ఈ-పంట నమోదు, రైతుసేవ యాప్‌ వినియోగం, ఉపగ్రహ ఆధారిత పంటల అంచనా, తెగుళ్లు, పురుగుల నివారణకు సస్య రక్షణ చర్యలు, స్వయం సహాయక సంఘాలు, రైతు ఉత్పత్తి సంఘాలు, యాంత్రీకరణ, పంటల బీమా, మార్పిడిపై రైతులకు అవగాహన కల్పించనున్నారు.
 
ఖరీఫ్‌ సాగుకు వేసవిలో భూమిని సిద్ధం చేయడం, భూసార పరీక్షలను నిర్వహించడం, వాటి ఫలితాలను రైతులకు అందజేయడం, సీజన్‌ ప్రారంభంలో సూక్ష్మపోషకాలు, పచ్చిరొట్ట ఎరువులు, రాయితీ విత్తనాలు, వ్యవసాయ పరికరాల పంపిణీ విధానాలతో పాటు విత్తన సేకరణలో రైతులకు ఇవ్వాల్సిన సూచనలు, ఎరువులు, పురుగుమందుల వినియోగం, సస్య రక్షణ చర్యలపై ముఖ్యంగా పెట్టుబడి లేని వ్యవసాయం వైపు రైతులను మళ్లించే లక్ష్యంలో భాగంగా కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. వ్యవసాయశాఖ అమలు చేసే పథకాల అమలుపై మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఈవారంలో సమీక్షించనున్నట్టు ప్రకటించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, ఖరీఫ్‌ సాగుకు సన్నద్దంపై ఈ సమీక్ష ఉంటుందని భావిస్తున్నారు.
 
కోడ్‌ కారణంగా..
సాధారణంగా ఖరీఫ్‌ కార్యాచరణ ప్రణాళికను మే 10లోగానే సిద్ధం చేస్తుంటారు. అయితే, ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ అమలులో ఉండడం వల్ల రానున్న కాలంలో తీసుకునే చర్యలు, అమలు చేసే పథకాలను ఇప్పుడే ప్రస్తావించకూడదన్న ఉద్దేశంతో ఖరీఫ్‌ కార్యాచరణ ప్రణాళిక తయారు చేయడానికి అధికారులు ఇంకా చర్యలు చేపట్టలేదు. ఇటీవల ఎన్నికలు ముగిసినందున జూన్‌ తొలివారంలోగా కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఖరీఫ్‌ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని భావిస్తున్నారు.
 
అయితే, 13 జిల్లాల్లో గత ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో 42.78లక్షల హెక్టార్లలో పంటలు సాగు లక్ష్యంగా పెట్టుకోగా, 39.53 లక్షల హెక్టార్లలో(90%) పంటలు సాగయ్యాయి. రైతులకు దన్నుగా నిలిచేందుకు గత ఖరీఫ్ లో నూరుశాతం సబ్సిడ్సీతో సూక్ష్మపోషకాలు, రాయితీ విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ రుణాలు, కౌలు రైతులకు పంట రుణాలను ప్రభుత్వం ఇచ్చింది. అయితే, నైరుతి రుతు పవనాల ప్రభావంతో ఖరీఫ్ లో 556 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 456.6 మిల్లీమీటర్లు మాత్రమే నమోదయింది. దీంతో గత ఖరీఫ్‌ సీజన్‌లో సకాలంలో పంటలు వేయలేక, వేసిన పంటలకు వర్షం చాలక రైతులు ఇబ్బంది పడ్డారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఈసారి ఖరీఫ్‌ కార్యాచరణ ప్రణాళిక తయారు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *