గర్భిణులు సేద తీరేలా..


  • అంగన్‌వాడీ కేంద్రాలు, పీహెచ్‌సీల్లో ఎయిర్‌ కూలర్లు
  • కలెక్టర్‌ కోన శశిధర్‌ ఆదేశాలు
గుంటూరు (మెడికల్‌): నడి వేసవి ప్రవేశించింది. ఎండ చండ్రనిప్పులు చెరుగుతోంది.. దీనికి తోడు ఉక్కపోతతో చెమటలు దారాళంగా కారుతున్నాయి. వాతావరణంలో పగటి ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్‌కు చేరాయి. ఇలాంటి పరిస్థితుల్లో సాధారణ వ్యక్తులే నానా హైరానా పడుతుంటే.. ఇక గర్భిణుల, చిన్న పిల్లలు, వృద్ధుల పరిస్థితి ఎంత దయ నీయంగా ఉంటుంది? ముఖ్యంగా నెలలు నిండి ప్రసవానికి దగ్గరగా ఉన్న గర్భిణులకు బయట వేడిమితో కూడిన వాతావరణ పరిస్థితి తీవ్ర సమస్యలు సృష్టిస్తున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని జిల్లా యంత్రాంగం మానవతాఽధృక్పధంతో స్పందించింది. అంగన్‌వాడీ కేంద్రాల్లో భారీ కూలర్లు ఏర్పాటు చేసి నిరుపేద గర్భిణులను పిలిపించి వారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆశ్రయం కల్పించాలని కలెక్టర్‌ కోన శశిధర్‌ ఐసీడీఎస్‌ అధికారులను ఆదేశించారు. గర్భిణులకు ఆశ్రయం ఇచ్చే అంగన్‌వాడీ కేంద్రాల్లో తక్షణం అద్దె ప్రాతిపదికన ఎయిర్‌ కూలర్లు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ముఖ్యంగా 8, 9 నెలల గర్భిణులు.. పూరిళ్లు, రేకుల ఇంట్లో ఉంటూ తగిన వసతులు లేని నిరుపేదలను అంగన్‌వాడీ కేంద్రాల్లో సేదదీరేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
 
పీహెచ్‌సీల్లోనూ..
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే గర్భిణులు, పిల్లలు, వృద్ధులను దృష్టిలో ఉంచుకొని పీహెచ్‌సీల్లో కూడా ఎయిర్‌ కూలర్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌, ఆరోగ్య శాఖను ఆదేశించారు. ఆయా ఆరోగ్య కేంద్రాల్లోని అభివృద్ధి సంఘం నిధుల నుంచి తక్షణం కూలర్లు కొనాలని ఆయన, డీఎంహెచ్‌వో యాస్మిన్‌కు సూచించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు. వేసవిలో వడగాలులు, ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని బాటసారుల దాహార్తి తీర్చేందుకు కలెక్టర్‌ ఆదేశాలతో జిల్లావ్యాప్తంగా 1,200 ధర్మ చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా చలివేంద్రాల్లో మంచినీరుతో పాటు మజ్జిగను అంద జేస్తున్నారు. దీంతో పాటుగా ఆరోగ్య శాఖ సిబ్బంది, ఓఆర్‌ఎస్‌ ద్రావణాలను సిద్ధం చేసి అవసరమైన వారికి ఆ ద్రావణం పంపిణీ చేయాలని కలెక్టర్‌ శశిధర్‌ ఆదేశించారు. దీని ప్రకారం మహిళా ఆరోగ్య కార్యకర్తలు ప్రతి చలివేంద్రంలోనూ లీటర్‌ నీళ్లల్లో ఓఆర్‌ఎస్‌ పౌడర్‌ను కలిపి సిద్ధంగా ఉంచుతున్నారు. వడదెబ్బ బారి నుంచి రక్షణ పొందే పద్ధతులపై ప్రజల్లో అవగాహన కల్పించేం దుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే మూడు లక్షల కరపత్రాలను ముద్రించి పంపిణీ చేశారు. కలెక్టర్‌ ఆదేశాలతో మరో రెండు లక్షల కరపత్రాలను ముద్రించి ప్రజలకు పంపిణీ చేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చర్యలు చేపట్టారు.
 

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *