గాడితప్పిన భూపరిపాలన


  • 30 పోస్టులకు 36 మందికి ప్రమోషన్లు
  • డైరెక్ట్‌ రిక్రూటీ పోస్టులకు పదోన్నతి
  • తెరవెనుక సహకరించిన అధికారి
  • విషయం తెలిసినా ఉన్నతాధికారుల మౌనం
  • వేతనాలు నిలిపివేసిన ట్రెజరీస్‌
అమరావతి, మే 12(ఆంధ్రజ్యోతి): రెవెన్యూశాఖకు కేంద్ర బిందువైన భూపరిపాలనా ప్రధాన కమిషనరేట్‌లో పదోన్నతుల వ్యవహారం ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు తీసుకొస్తోంది. గతంలో తహశీల్దార్‌లకు అడ్డగోలుగా డిప్యూటీ కలెక్టర్‌ పదోన్నతులు ఇచ్చినట్లుగానే ఇప్పుడు భూ పరిపాలనలో మరో అంకానికి తెరలేపారు. సీనియర్‌ అసిస్టెంట్‌లకు పరిమితికి మించి సూపరింటెండెంట్‌లుగా పదోన్నతులు ఇచ్చారు. ఇవి తహశీల్దార్‌ కేడర్‌తో సమానమైనవి. సహజంగానే భారీ డిమాండ్‌ ఏర్పడటంతో అందుబాటులో ఉన్న ఖాళీలు, పదోన్నతుల నిష్పత్తిని పరిగణనలోకి తీసుకోకుండానే పనికానిచ్చేశారు. అభ్యంతరాలను బుట్టదాఖలు చేసిన ఓ అధికారి ఈ మొత్తం వ్యవహారాన్ని తెరవెనుక ఉండి నడిపించారు. అడ్డగోలు పదోన్నతులకు రెవెన్యూబా్‌సలు పచ్చజెండా ఊపినా ట్రెజరీ మాత్రం అభ్యంతరాలు చెప్పింది. జీతాలు చెల్లించలేమంటూ చేతులెత్తేసినట్లు తెలిసింది. ఈ మొత్తం వ్యవహారంలో ఓ మాజీ సీసీఎఎల్‌ఏ పాత్ర కూడా ఉన్నట్లు తెలిసింది. దీంతో ఉన్నతాధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించారని సమాచారం.
 
సీసీఎల్‌ఏలో ఇటీవల భారీగా ప్రమోషన్లు ఇచ్చారు. 36మంది సీనియర్‌ అసిస్టెంట్‌లకు సూపరింటెండెంట్‌లుగా పదోన్నతులు కల్పించారు. వాస్తవానికి 30 ఖాళీలే ఉంటే, 36 మందికి సూపరింటెండెంట్‌ పదోన్నతులు ఇచ్చారు. దీనిపై తొలుత అభ్యంతరాలు వచ్చాయి. పరిమితికి మించి ప్రమోషన్లు ఎలా ఇస్తారన్న ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే ఓ అధికారి ఈ అభ్యంతరాలను బుట్టదాఖలు చేసి ఎలాంటి ఆటంకాలూ లేకుండా పదోన్నతులు ఇచ్చేశారు. దీన్ని ఇన్‌చార్జి సీసీఎల్‌ఏ కూడా ఆమోదించారు.
 
ఇంత వరకూ బాగానే ఉంది! అయితే, పదోన్నతులు పొందిన వారికి వేతనాలు చెల్లించే విషయంలో ట్రెజరీస్‌ బ్రేకులు వేసింది. 30 పోస్టులుంటే 36 మందికి పదోన్నతులు ఇచ్చారని, ఇది నిబంధనలకు విరుద్ధంగా ఉన్నందున అదనపు పదోన్నతులకు వేతనాలు చెల్లించలేమని తేల్చిచెప్పినట్లు తెలిసింది. దీంతో అధికారులు తర్జనభర్జనలు పడుతున్నారు. రెవెన్యూశాఖలోనే ఉన్నతస్థాయి అధికారులతోనే ఈ వ్యవహారాన్ని పరిష్కరింపచేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలావుంటే, తాజాగా ఇచ్చిన పదోన్నతుల్లోనే ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయాల్సిన డైరెక్ట్‌ రిక్రూటీ పోస్టులు ఉన్నట్లు తెలిసింది. దీంతో ఇది మరో వివాదంగా మారుతోంది. భవిష్యత్‌లో ఈ పోస్టులను ఇలాగే కొనసాగిస్తే సీనియర్‌ అసిస్టెంట్‌ కేటగిరీలో ఖాళీలను నోటిఫై చేసే అవకాశం ఉండదని అధికారవర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.
 
భూపరిపాలన ఖాళీ
సీసీఎల్‌ఏ కార్యాలయంలో జూనియర్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ కేడర్‌ పోస్టులు భారీగా ఖాళీ అయ్యాయి. ఈ రెండు కేటగిరీల్లో కలిపి దాదాపు 140 పోస్టులు ఉన్నాయి. కానీ పనిచేస్తున్నవారు 20 మందే! దీనికితోడు ఇటీవల 36 మందికి సూపరింటెండెంట్‌లుగా పదోన్నతులు ఇవ్వడంతో ఆ కేడర్‌లోనూ భారీగా ఖాళీలు ఏర్పడ్డాయి. ఫలితంగా… ఇప్పుడు పని అంతా సూపరింటెండెంట్‌లు, ఆపై స్థాయి అంటే ఏఏఎ్‌సలపైనే కొనసాగుతోంది. ఉద్యోగ ఖాళీలను నోటిఫై చేసి పదోన్నతుల ద్వారా కొన్ని, ఏపీపీఎస్సీ ద్వారా మరి కొన్ని భర్తీచేయాలి. గత కొన్నేళ్లుగా పదోన్నతి పోస్టులనే చకచకా భర్తీచేస్తున్నారు. డైరెక్ట్‌ రిక్రూటీ కోటా పోస్టులను ఏపీపీఎస్సీకి నివేదించడం లేదు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *