గుర్తింపు ఎన్నికలపైనే గురి


  • దక్షిణ మధ్య రైల్వే గుర్తింపు సంఘ ఎన్నికలపై ఉత్కంఠ
  • నూతన దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ నేపథ్యంలో సందిగ్ధమే..
  • వచ్చే సంవత్సరం జరిగే అవకాశం
  • ఎన్నికల విధానంలో మార్పు రావాలంటున్న కార్మికులు
దక్షిణ మధ్య రైల్వేలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలపై ప్రతిష్టంభన ఏర్పడింది. నూతన దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ నేపథ్యంలో ప్రస్తుత దక్షిణ మధ్య రైల్వే విభజన జరగాల్సి రావడం.. దక్షిణ మధ్య రైల్వేలో కీలకమైన విజయవాడ, గుంటూరు, గుంతకల్‌ డివిజన్లు నూతన దక్షిణ కోస్తా జోన్‌ పరిధిలోకి తేవడం.. ఈ నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేయాలన్న అంశం తెరపైకి వస్తోంది. అలాగే, కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరే వరకు ఎన్నికలు జరగవన్న వాదన కూడా వినిపిస్తోంది. దీంతో గుర్తింపు సంఘ ఎన్నికలు 2020 సంవత్సరంలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
 
ఆంధ్రజ్యోతి, విజయవాడ : లక్షమంది ఉద్యోగుల గొంతుకకు ప్రతిరూపం దక్షిణ మధ్య రైల్వే గుర్తింపు సంఘం. ఈ స్థాయిలో రైల్వే ఉన్నతాధికారులు రైల్వేబోర్డుతో వివిధ సమస్యలపై చర్చించే అధికారం ఉంటుంది. బోర్డు నిర్ణయాలను, ఉన్నతాధికారుల నిర్ణయాలను ప్రభావితం చేయగలుగుతుంది. ఉద్యోగ, కార్మికుల తరఫున ప్రాతినిధ్యం వహించి, వారికి సానుకూలమైన నిర్ణయాలను వెలువడేలా చేస్తుంది. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే గుర్తింపు సంఘం పదవీ కాలం పూర్తికావటంతో లక్షమంది రైల్వే ఉద్యోగుల్లో దీనిపైనే చర్చ నడుస్తోంది. సాధారణంగా రైల్వేలో గుర్తింపు ఎన్నికలు ప్రతి ఆరేళ్లకోసారి జరుగుతాయి. ఏప్రిల్‌ చివరి వారంలో గుర్తింపు కార్మిక సంఘం పదవీ కాలం పూర్తయింది. దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్‌ పరిధిలో తలపడిన దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్‌ యూనియన్‌ (ఎస్‌సీఆర్‌ఎంయూ), దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్‌ సంఘ్‌ (ఎస్‌సీఆర్‌ఎంఎస్‌) రెండూ గుర్తింపు హోదాను సాధించాయి. ఈ రెండు సంఘాలు కార్మికుల తరఫున ప్రాతినిధ్యం వహించేవే.
 

ఓటింగ్‌ శాతంపై ఆది నుంచి విమర్శలే..
రైల్వేలో గుర్తింపు కార్మిక సంఘంగా ఎంపిక కావటానికి విధించిన ఎన్నికల నిబంధనలు చిత్రంగా ఉంటాయి. ప్రతిసారీ ఎన్నికల్లో ఇవి వివాదాస్పదమవుతుంటాయి. డివిజన్‌ పరిధిలోని ఉద్యోగుల్లో 30 శాతం ఓట్లు తెచ్చుకుంటే గుర్తింపు సాధించినట్టే. దీంతో బరిలో ఉన్న కార్మిక సంఘాలు 30 శాతం పైగా ఓట్లు సాధించుకునేందుకు ప్రయత్నిస్తారు. ఒక రకంగా కార్మిక సంఘాలన్నీ గుర్తింపు అర్హత పొందుతున్నాయి. ఈ విధానాన్ని గతంలో యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెడితే ఎన్‌డీఏ కూడా అదే విధానాన్ని కొనసాగిస్తోంది. బీజేపీకి అనుబంధ సంఘమైన భారతీయ రైల్వే మజ్దూర్‌ సంఘ్‌ (బీఆర్‌ఎంఎస్‌)కు కూడా గుర్తింపు కల్పించటానికి వీలుగా కేంద్రం కుట్ర పన్నిందన్న విమర్శలు కూడా ఉన్నాయి.
 

50 శాతం ఓట్ల సాధన విధించాలంటున్న ఎస్‌సీఆర్‌ఎంయూ
గుర్తింపు ఎన్నికల విధానంపై న్యాయపోరాటం చేద్దామంటే సుప్రీంకోర్టు ప్రతికూల సంకేతాలను ఇస్తుందేమోనన్న భయం కార్మిక సంఘాల్లో ఉంది. కేంద్ర కార్మిక చట్టాల్లో గుర్తింపు ఎన్నికలకు సంబంధించి స్పష్టత లేకపోవటంతో, న్యాయస్థానాలు కాదంటే గుర్తింపు హక్కును కోల్పోతామన్న అభిప్రాయంలో కార్మిక సంఘాలు ఉన్నాయి. దీంతో తమ అభిప్రాయాలను రైల్వే బోర్డు దృష్టికి మాత్రమే తీసుకొస్తుంటాయి. ఎస్‌సీఆర్‌ఎంయూ మాత్రం 30 శాతం ఓట్ల సాధన ఎత్తివేయాలని, దానిస్థానంలో 50 శాతం ఓట్ల సాధన తీసుకురావాలని రైల్వే బోర్డును డిమాండ్‌ చేస్తూ వస్తోంది. దీనివల్ల ఒకే కార్మిక సంఘం గుర్తింపు సాధిస్తుందని, ఉద్యోగ, కార్మికుల సమస్యల పట్ల దృఢంగా పనిచేయటానికి అవకాశం ఉంటుందని ఎస్‌సీఆర్‌ఎంయూ వాదన.
 
బహుళ గుర్తింపు కార్మిక సంఘాలతో రైల్వే యాజమాన్య పెత్తనం
రైల్వేలో బహుళ గుర్తింపు కార్మిక సంఘాల వల్ల క్రమేపీ రైల్వే యాజమాన్యాలు కార్మిక సంఘాలను ఖాతరు చేయట్లేదు. ముఖ్యమైన విధానపర నిర్ణయాల విషయంలో కూడా ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా, చర్చించకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. రైల్వేలో కార్మిక సంఘాలను పరోక్షంగా బలహీన పరచటానికి బహుళ గుర్తింపు సంఘాల అంశాన్ని రైల్వే యాజమాన్యాలు ఉపయోగించుకుంటున్నాయి. ఒక సంఘం కాకపోతే మరో సంఘం తమ చెప్పు చేతల్లో ఉంటుందన్న భయాన్ని కలిగిస్తున్నాయి. దీంతో రైల్వే కార్మిక సంఘాలు గుర్తింపు సాధించినా కూడా మనశ్శాంతిగా ఉండలేని పరిస్థితి ఏర్పడింది. రైల్వేలో ఏదైనా విజయం సాఽధిస్తే, తమ ఘనతంటే తమదంటూ కార్మిక సంఘాలన్నీ చెప్పుకొంటున్నాయి. దీంతో ఎవరు న్యాయబద్దంగా సమస్యపై పోరాడారో అర్థంకాని పరిస్థితి.
 
ఈ ఎన్నికలు వాయిదా కోరే అవకాశం
దక్షిణ కోస్తా నూతన రైల్వే జోన్‌ ఆవిర్భావం నేపథ్యంలో ప్రస్తుత దక్షిణ మధ్య రైల్వే విభజన జరగాల్సి ఉంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోనే ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే, తర్వాత దక్షిణ కోస్తా జోన్‌లో విజయవాడ డివిజన్‌ విలీనమైతే సమస్యలు వస్తాయని ఎస్‌సీఆర్‌ఎంయూ భావిస్తోంది. మళ్లీ ఎన్నికలు నిర్వహించటం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి దక్షిణ మధ్య రైల్వేకు మాత్రం ఎన్నికల నుంచి మినహాయింపు ఇవ్వాల్సిందిగా కోరాలని ఆ సంఘం భావిస్తోంది. దీనిపై జోన్‌ అగ్రనేత శంకరరావుతో చర్చించిన తరువాత రైల్వే బోర్డు దృష్టికి తీసుకెళ్లాలన్న ఆలోచనలో డివిజన్‌ స్థాయి నేతలున్నారు.
 
ఎన్నికల విధానాన్ని మార్చాలి
ఎన్నికల విధానం పట్ల మాకు సంతృప్తిగా లేదు. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో గుర్తింపు సంఘ ఎన్నికలకు సంబంధించి స్పష్టమైన విధానం లేదు. ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌సీఐ)లో అనుసరిస్తున్న విధానాన్ని రైల్వే బోర్డు అమలు చేస్తోంది. ఈ విధానంలో 30 శాతం ఓట్లు సాధిస్తే గుర్తింపు హోదా కల్పిస్తున్నారు. దీనివల్ల రెండు, మూడు కార్మిక సంఘాలు గుర్తింపు సాధిస్తున్నాయి. దీంతో రైల్వేలో కార్మిక సంఘాల పాత్ర నానాటికీ తీసికట్టుగా మారుతోంది. ఈ విధానంపై వ్యతిరేకతను అగ్రనాయకత్వంతో చర్చించి బోర్డు దృష్టికి తీసుకెళ్లాలన్న ఆలోచన ఉంది. దక్షిణ కోస్తా జోన్‌ ఆవిర్భావం నేపథ్యంలో, దక్షిణ మధ్య రైల్వేకు ఎన్నికలు నిర్వహిస్తే ఇబ్బందిగా ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని నూతన జోన్‌ ఏర్పడే వరకు మినహాయింపు ఇవ్వాలని అడుగుతాం. ఇస్తారన్న గ్యారెంటీ లేకపోయినా ప్రయత్నిస్తాం.
 
– జీఎన్‌ శ్రీనివాసరావు, ఎస్‌సీఆర్‌ఎంయూ
విజయవాడ డివిజన్‌ ప్రధాన కార్యదర్శి
 

ప్రభుత్వం కొలువు తీరాకే ఎన్నికలు
గుర్తింపు ఎన్నికల పదవీ కాలం పూర్తయింది. ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇప్పట్లో జరిగే అవకాశం లేదని మేం భావిస్తున్నాం. కేంద్రంలో నూతన ప్రభుత్వం కొలువు తీరాల్సి ఉంది. ఆ తర్వాత మంత్రివర్గం ఏర్పడాలి. ఈలోపు దక్షిణ కోస్తా విభజనకు సంబంధించి చట్టబద్ధమైన ప్రక్రియ పూర్తికావాలి. ఇవన్నీ అయ్యాకే గుర్తింపు ఎన్నికలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తుందన్న భావనలో ఉన్నాం. గుర్తింపు ఎన్నికలు 2020 నాటికి జరుగుతాయన్నది మా అంచనా. ఎన్నికలను ఆపాలని మజ్దూర్‌ సంఘ్‌ తరఫున రైల్వే బోర్డుకు మేము ఎలాంటి లేఖలు రాయలేదు.
– ఆమంచి వెంకటేశ్వరరావు, ఎస్‌సీఆర్‌ఎంఎస్‌
విజయవాడ డివిజనల్‌ ప్రధాన కార్యదర్శి
 

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *