గెలుపుపై ఆది విశ్లేషణ.. వైసీపీ నేతలను అదే భ్రమల్లో ఉండనివ్వండి


ఆయన కడప జిల్లాకు చెందిన మంత్రి. నిర్మొహమాటంగా మాట్లాడటం ఆయనకు అలవాటు. ముఖ్యమంత్రి మొదలు దిగువస్థాయి వరకు ఆయన ఎవరిని ఉద్దేశించిన మాట్లాడినా ప్రాసతో కూడిన భాషని వాడుతుంటారు. గతంలో సీఎం చంద్రబాబుతో కలిసి ఆయన కారులోనే ఓ అర్థగంట ప్రయాణించి పెన్షన్ల పెంపు ఆవశ్యకతని వివరించి ఒప్పించారు. పెన్షన్ల పెంపు అంశం ఈ ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా మారింది. పోలింగ్ సరళిపై ఆ మంత్రి తాజాగా చేసిన విశ్లేషణ చంద్రబాబుకి నచ్చింది. ఇంతకీ ఆ మంత్రి చేసిన విశ్లేషణ ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
 
   అసలే రాయలసీమ. ఆపైన కడప జిల్లా. 2014 ఎన్నికల్లో జమ్మలమడుగులో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆదినారాయణరెడ్డి. ఆ తర్వాత తెలుగుదేశంలో చేరారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. నిర్మొహమాటంగా మాట్లాడటం ఆయనకి అలవాటు. కడప మాండలికంతో కూడిన ఆయన భాష అందరినీ ఎంతో ఆకట్టుకుంటుంది.
 
    ఎన్నికలకు నాలుగు నెలల ముందు ఏపీలో ఓ సంఘటన చోటుచేసుకుంది. చివరి విడత జన్మభూమి కార్యక్రమానికి రెండ్రోజుల ముందు సీఎం చంద్రబాబు వద్దకి మంత్రి ఆదినారాయణరెడ్డి వెళ్లారు. 20 నిముషాల సేపు మాట్లాడేందుకు అవకాశమివ్వాలని కోరారు. బిజీబిజీ అని సీఎం చెప్పినప్పటికీ ఆది వదలిపెట్టలేదు. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కి చంద్రబాబు వెళుతున్న సమయంలో ఏంచక్కా ఆ కారెక్కేసి కూర్చొన్నారు. ఆ తర్వాత క్షణం కూడా వృధా చేయకుండా తన మనసులో ఉన్న విషయం చెప్పేశారు. ఏపీలో పెన్షన్లు వెయ్యి నుంచి 2 వేల రూపాయలకు పెంచితే బాగుంటుందని ఆది ప్రతిపాదించారు. అలా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో స్పష్టంగా వివరించారు. తనను గెలిపిస్తే పెన్షన్లను 2 వేలు చేస్తానంటూ జగన్‌ చెప్తున్నారని గుర్తుచేశారు. మనం కూడా వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు నిష్పత్తి ప్రకారం పెన్షన్లను పెంచితే ప్రభుత్వానికి సానుకూలత వస్తుందని నచ్చచెప్పారు. ఇలా చేస్తే, జగన్ కూడా డిఫెన్స్‌లో పడక తప్పదని అన్నారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ.. “ఆర్థిక పరిస్థితుల్ని చూసుకొని వర్కవుట్ చేద్దాం” అని అప్పటికి చెప్పారు. కానీ ఆది చెప్పిన విషయంపై బాబు యమ సీరియస్‌గా థింక్‌ చేశారు..
 
   చివరకు ఆది సూచనపై సీఎం చంద్రబాబు పాజిటివ్‌గా స్పందించారు. జన్మభూమి ముగింపు సభ సందర్భంగా నెల్లూరులో “పెన్షన్లు పెంచుతున్నట్టు” ప్రకటించారు. దీంతో పెన్షన్లు పొందేవారిలో హర్షాతిరేకాలు వెల్లువెత్తాయి. పసుపు-కుంకుమ పథకం కూడా ఇదే రీతిలో తెలుగుదేశం పట్ల ప్రజల్లో సానుకూల దృక్ఫథాన్ని పెంపొందించింది.
 
   ఈ నేపథ్యంలో ఏపీలో జరిగిన పోలింగ్‌ సరళిపై ఆదినారాయణరెడ్డి స్పష్టమైన అభిప్రాయానికి వచ్చారు. ఒంటిమిట్ట సీతారామ కల్యాణానికి వెళ్లిన ముఖ్యమంత్రి ఆ రోజు రాత్రి కడపలో బసచేశారు. కడప నేతలతో భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ ఏపీలో పోలింగ్ సరళిపై చంద్రబాబుకు తన విశ్లేషణ చెప్పారు. “పక్కా లెక్కల ఆధారంగా నేను మాట్లాడుతున్నాను. పల్లెల్లో, పట్టణాల్లో అత్యధికుల నుంచి సమాచారం సేకరించిన తర్వాతనే మీతో ఈ విషయం చెబుతున్నాను” అని సీఎం చంద్రబాబుకు ఆది స్పష్టంచేశారు. పట్టణాలు, నగరాల్లో డ్వాక్రా గ్రూపుల మహిళలు తెలుగుదేశానికి పూర్తిస్థాయిలో మద్ధతుగా నిలిచారని చెప్పారు. “పల్లెలలో గ్రూపులు, కులాలవారీగా మహిళలు చీలిపోయారు. అందువల్ల ఒక వర్గంవారే టీడీపీ వైపు మొగ్గు చూపించారు. గంపగుత్తగా మనకు వారు ఓట్లు వేయలేదు” అని ఆదినారాయణరెడ్డి వివరించారు. అదే సమయంలో పెన్షనర్లు మాత్రం పూర్తిస్థాయిలో టీడీపీకి మద్ధతుగా నిలిచారని విశ్లేషించారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పెన్షన్ల వల్ల కలిగిన లాభంతో వారు కూడా మిమ్ముల్ని చూసి ఓటేశారని చంద్రబాబుకి ఆది చెప్పుకొచ్చారు.
 
   గత ఎన్నికల్లో టీడీపీకి పడ్డ ముస్లిం ఓట్లు 20 శాతానికి పరిమితమైతే.. ఈసారి ఆ సంఖ్య 50 శాతానికి చేరిందన్నది ఆదినారాయణరెడ్డి తాజా లెక్క! నరేంద్రమోదీకి వ్యతిరేకంగా చంద్రబాబు జాతీయస్థాయిలో చేస్తున్న పోరాటం వల్లే ఈ ప్రయోజనం సిద్ధించిందన్నది ఆయన విశ్లేషణ. ఓవరాల్‌గా చెప్పాలంటే ఏపీలో పట్టణాలు, నగరాలు, సెమీ అర్బన్ ఏరియాల్లో ఉన్న ఓటర్లంతా టీడీపీకి అండగా నిలిచారని ఆదినారాయరెడ్డి లెక్కగట్టారు. పోలింగ్ బూత్‌లకు తాము వెళ్లిన సమయంలో ఓట్లర్లు నవ్వుతూ తమను పలకరించటం, విక్టరీ సింబల్ చూపించటమే తెలుగుదేశానికి లభించబోయే విజయానికి సంకేతమని ఆయన చెప్పారు. వైసీపీ చేస్తోన్న ప్రచారంపై కూడా ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యానించారు. 2014 ఎన్నికల తర్వాత కూడా ఇంతకంటే జోరుగా తాము అధికారంలోకి వస్తామని వైసీపీ నేతలు ప్రచారం చేశారనీ, ఎన్నికల ఫలితాలు వారి మనోభావాలకు విరుద్ధంగా వచ్చాయనీ ఆయన గుర్తుచేశారు. ఈసారి కూడా అదే జరగబోతున్నదని చెప్పారు. ఆదినారాయణరెడ్డి చేసిన ఈ విశ్లేషణపై చంద్రబాబు స్పందిస్తూ… “కౌంటింగ్‌ వరకూ వైసీపీ నేతలను అదే భ్రమల్లో ఉండనివ్వండి. ఆ రోజున గెలుపు మన సొంతమవుతుంది. మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం” అని స్పష్టంచేశారు. ఆదినారాయణరెడ్డి విశ్లేషణతో ఈ సమావేశంలో పాల్గొన్న మిగతా నేతలు కూడా ఏకీభవించడం కొసమెరుపు!

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *