గొంతెండుతోంది


  • అడుగంటిన తాగునీటి చెరువులు
  • 15 వరకే చెరువుల్లో నిల్వలు సరిపోతాయంటున్న ఆర్‌డబ్ల్యూఎస్‌
  • అల్లాడుతున్న పశువులు
  • సమ్మర్‌ స్టోరేజీలో రంగుమారిన నీరు
  • కాల్వలకు నీటిని విడుదల చేసి ఆదుకోవాలని వినతి
ఆంధ్రజ్యోతి – మచిలీపట్నం: కృష్ణా డెల్టా ప్రాంతంలో తాగునీటి చెరువులు అడుగంటుతున్నాయి. జిల్లాలో మొత్తం 384 తాగునీటి చెరువులు ఉండగా డెల్టా ప్రాంతంలో 358 తాగునీటి చెరువులు న్నాయి. వాటిలో నీటి నిల్వ సామర్థ్యం 45రోజులు, 65 రోజులకు సరిపడా మాత్రమే నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంది. ఫోని తుపాను అనంతరం ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగడంతో అధికశాతం తాగునీటి చెరువుల్లోని నీరు అడుగంటాయి. తగినంత నీరు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందుల పాలవుతుతున్నారు. పశువులు నీరు లేక అల్లాడుతున్నాయి. కొన్ని చెరువుల్లో నీరు రంగు మారి తాగడానికి వీలుండటం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు మంచినీటి క్యాను రూ. 30 కొనుగోలు చేస్తున్నారు. బందరు పరిసర ప్రాంతాల్లో రోజు విడిచి రోజు నీరు సరఫరా చేస్తున్నారు. ఆ నీరు కూడా రంగు మారి వస్తోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం తక్కువగా ఉండటంతో చెరువుల్లోని నీరు ఈనెల 15వరకే సరిపోతుందని ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు చెబుతున్నారు.
 
అడుగంటిన తరకటూరు చెరువు
బందరు మండలం తుమ్మలచెరువు గ్రామంలోని తరకటూరు చెరువు అడుగంటిపోయింది. ప్రతి ఏడాది వేసవిలో ఈ చెరువు నీటితో నిండి ఉండేది. ఈ ఏడాది మే ప్రారంభంలోనే అడుగంటింది. రక్షిత మంచినీటి పథకాల ద్వారా వచ్చే నీటిని తాగునీటి అవసరాల కోసం వినియోగించుకున్నా, చెరువులోని నీటిని పశువులు తాగేందుకు, ఇంటి అవసరాలకు వాడుకునేవారు. బందరు మండటంలోని వాడపాలెం, పల్లెతుమ్మలపాలెం, పోలాటితిప్ప, తుమ్మలపాలెం, కోన, వాడగొయ్యి, వెంకటదుర్గాంబపురం, కేపీటీపాలెం, కమ్మవారిచెరువు, మాలకాయలంక తదితర తీరప్రాంత గ్రామాల్లో కూడా తుమ్మలచెరువు గ్రామం మాదిరిగానే చెరువులు ఎండిపోయాయి. ప్రజలు తాగునీటి కోసం చిన్నాపురం గ్రామానికి వచ్చి 20 లీటర్ల క్యాను రూ.30 లకు కొనుగోలు చేసి తీసుకుపోతున్నారు.
 
సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకులో ..
సముద్ర తీరం వెంబడి ఉన్న మచిలీపట్నం, పెడన పురసాలక సంఘాలకు, గూడూరు, మచిలీపట్నం మండలాలకు తాగునీటి అవసరాలు తీర్చేందుకు తరకటూరు సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకును 180 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. ఈ చెరువులో నీటి సామర్థ్యం 5.18 మీటరు.్ల ప్రస్తుతం రెండు మీటర్లు మాత్రమే నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. నీటి నిల్వలు తగ్గిపోవడంతో నాలుగు రోజులుగా కుళాయిల ద్వారా వచ్చే నీరు రంగుమారి పచ్చగా ఉంటున్నాయి. ఈ నీటిని తాగితే తమకు ఎలాంటి వ్యాధులు వస్తాయోమోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 13న కాలువల శుద్ధి కార్యక్రమంలో భాగంగా తరకటూరు సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకును కలెక్టర్‌ పరిశీలన చేస్తే వాస్తవం అవగతమవుతుందని ప్రజలు భావిస్తున్నారు.
  • బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల్లో 17 గ్రామాలకు తాగుటిని సరఫరా చేసే మల్లేశ్వరం మంచినీటి చెరువులో నీరు అడుగంటాయి. అక్కడ తాగునీటి ఇబ్బందులు అధికమయ్యాయి.
తీరప్రాంత ప్రజల మంచినీటి కొరత తీర్చండి
విజయవాడ : కృత్తివెన్ను, బంటుమిల్లి, పెడన, అవనిగడ్డ, బందరు రూరల్‌ మండలాల్లో మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని నివారణ చర్యలు చేపట్టాలని అమరావతి కాపునాడు జిల్లా అధ్యక్షుడు అంజిబాబు, కలెక్టర్‌ ఇంతియాజ్‌కు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో అమరావతి కాపునాడు ప్రతినిధి బృందం ఆయన్ని కలిసి వినతిపత్రం అందజేశారు.
 
ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేస్తాం
డెల్టా ప్రాంతంలో తాగునీటి చెరువుల సామర్థ్యం తక్కువగా ఉండటంతో ఈనెల 15 నాటికే కొన్ని చెరువుల్లో తాగునీటి నిల్వలు తగ్గే అవకాశం ఉంది. పెడన నాగాయలంక మండలాల్లో తాగునీటి ఇబ్బందులను తొలగించేందుకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నాం. ఏదైనా ప్రాంతంలో తాగునీటి చెరువుల్లో నీరు అందుబాటులో లేక సమస్య తలెత్తితే తహసీల్దార్‌, ఎంపీడీవో, ఈవోపీఆర్‌డీ నిర్ణయం తీసుకుని ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేయాలని చెప్పాం పశ్చిమ కృష్ణాలో తాగునీటి సమస్య ఉంటే రైతులవద్ద బోరు పాయింట్‌లు, విద్యుత్‌ను అద్దెకు తీసుకుని 54 ప్రాంతాలకు తాగునీటిని సరఫరా చేస్తున్నాం.
 సాయినాథ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ
 
కాల్వలకు నీటిని విడుదల చేయాలి
ప్రకాశం బ్యారేజీ వద్ద 11 అడుగుల నీటిమట్టం ఉంటే కాలువలకు తాగునీటి అవసరాలు తీర్చేందుకు నీటిని విడుదల చేయాల్సిందిగా తీరప్రాంత ప్రజలు కోరుతున్నారు.. మరో వైపు ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు జిల్లాలోని 374 తాగునీటి చెరువుల్లోని నీరు ఈ నెల 15వరకు మాత్రమే సరిపోతుందని చెబుతున్నారు. ఎలాగూ ప్రకాశం బ్యారేజీకి పులిచింతల నీటిని విడుదల చేస్తున్నందున తాగునీటి అవసరాలు తీర్చేందుకు నీటిని దిగువకు విడుదల చేయాలని తీరప్రాంత గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *