గొంతెండుతోంది!


 • జిల్లాలో తాగునీటికి కటకట
 • ఎండిన బావులు, చెరువులు
 • అడుగంటిన భూగర్భ జలాలు
 • బ్యారేజీ వద్ద తగ్గిన నీటి మట్టం
 • భవిష్యత్తుపై సర్వత్రా ఆందోళన
వేసవి ప్రభావం, వర్షాభావ పరిస్థితుల కారణంగా జిల్లాలో తాగునీటి సమస్య తీవ్రరూపం దాలుస్తోంది. మండుతున్న ఎండలతో పగటి ఉష్ణోగ్రతలు పెరగడంతో వడగాల్పుల తీవ్రత అధికమైంది. అదే స్థాయిలో నీటి వినియోగమూ పెరిగింది. వర్షాభావ పరిస్థితుల కారణంగా జిల్లాలోని చెరువులు, కాల్వలూ ఎండిపోయాయి. కృష్ణా నదిలోనూ నీటిమట్టం 5.5 అడుగులకు పడిపోయింది. ఉన్న కొద్దిపాటి నీరు ఆవిరైపోతుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లాలో ప్రస్తుతం నీటివనరులేవీ లేకపోవడంతో ప్రజలంతా భూగర్భ జలాలపైనే ఆధారపడ్డారు. బోర్లు, మోటార్లతో ఎడాపెడా తోడేస్తుండటంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఫలితంగా పుడమి తల్లి గర్భశోకంతో తల్లడిల్లిపోతోంది.
 
విజయవాడ ఆంధ్రజ్యోతి: విజయవాడతోపాటు జిల్లాలోని మెట ్టప్రాంత మండలాల్లోని కొన్ని గ్రామాల్లో ఇప్పటికే బోర్ల నుంచి చుక్కనీరు రాని పరిస్థితులు నెలకొన్నాయి. పల్లెల్లో తాగునీటి పథకాల బోర్లకు నీరందక మొరాయిస్తున్నాయి. కొత్తగా బోర్లు వేస్తున్నా నీటిజాడ కనిపించడం లేదు. ఒకప్పుడు 40-50 అడుగుల లోతులో బోర్లు వేస్తే నీళ్లు వచ్చేవి. ఇప్పుడు 150 అడుగుల లోతుకు తవ్వినా చుక్కనీరు పైకి రాని పరిస్థితి నెలకొంది. మే నెలంతా, జూన్‌లో వర్షాలు పడేవరకు ఈ నీటి కష్టాలు తప్పవు. ప్రజలు ఇప్పుడే తాగునీటికి కటకటలాడుతుండగా.. వచ్చే రోజుల్లో వేసవి తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఆ పరిస్థితి ఊహించుకుంటేనే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రతి వేసవిలోనూ నీటి కష్టాలు సాధారణమేగానీ.. గతంలో కంటే ఈ ఏడాది నీటిఎద్దడి పరిస్థితులు దడ పుట్టిస్తున్నాయి. గతేడాది మే నెలతో పోల్చి చూస్తే.. జిల్లాలోని తొమ్మిది మండలాల్లో ప్రస్తుతం భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయికి పడిపోయినట్లు భూగర్భజల శాఖ అధికారులు అంగీకరిస్తున్నారు.
 
వర్షాలు లేక..
జిల్లాలో సాధారణ వర్షపాతం 977.3 మిల్లీమీటర్లు కాగా.. ఇంతవరకు 806.3 మిల్లీ మీటర్ల వర్షం మాత్రమే కురిసింది. 17.5 మిలీమీటర్ల మేర వర్షపాతం లోటు ఉంది. జిల్లా మొత్తంగా చూసుకుంటే భూగర్భ జలాలు మెరుగ్గానే కనిపిస్తున్నా.. మెట్టప్రాంత మండలాల్లో భూగర్భ జలాలు బాగా తరిగిపోవడం ఆందోళన కల్గిస్తోంది. జిల్లా భూగర్భ జలాల సగటు 10.88 మీటర్లు కాగా.. గతేడాది మే 2వ తేదీ నాటికి జిల్లాలో భూగర్భ జలమట్టం 12.76 మీటర్లు నమోదైంది. ఈ ఏడాది అదే సమయానికి 11.27 మీటర్లు నమోదైంది. అంటే సాధారణ స్థితికి అంచున మాత్రమే భూగర్భ జలాలు ఉన్నాయి. ఇక జిల్లాలోని మండలాల వారీగా భూగర్భ జలాలను పరిశీలిస్తే.. విజయవాడతో పాటు మెట్టప్రాంత మండలాలైన చాట్రాయి, జి.కొండూరు, తిరువూరు, చందర్లపాడు, బాపులపాడు, గంపలగూడెం, ముసునూరు, రెడ్డిగూడెం, నందిగామ, విస్సన్నపేట, మైలవరం, కైకలూరు, కంచికచర్ల, నూజివీడు, పెనుగంచిప్రోలు, గుడ్లవల్లేరు, మోపిదేవి, పెడన, పెనమలూరు, వత్సవాయి, ఉయ్యూరు తదితర మండలాల్లో భూగర్భ జల తగ్గిపోయింది. ఆ ప్రాంతాల వాసులు నీటి కోసం నానా పాట్లు పడుతున్నారు. వేసవి నేపథ్యంలో జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోలు, గ్రామీణ నీటిసరఫరా, పంచాయతీరాజ్‌ అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లు.. ఇతర శాఖల అధికారులకు కలెక్టర్‌ ఇంతియాజ్‌ ఆదేశాలిచ్చారు.
 
 • విజయవాడ సరిహద్దు పెనమలూరు మండలం యనమలకుదురులో రెండు నెలలుగా తాగునీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చింది. బోర్లు మొరాయించడంతో అధికారులు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. అవీ సరిపోక ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు. 
 • గన్నవరం మండలంలోని పలు గ్రామాల్లో కుళాయిల నుంచి సక్రమంగా నీళ్లు రాకపోవడంతో ప్రజలు నానా పాట్లు పడుతున్నారు.
 • కంచికచర్ల, వీరులపాడు మండలాల్లోనూ ఈ వేసవిలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ఈ రెండు మండలాలకు చెవిటికల్లు నుంచి కృష్ణా జలాలు సరఫరా అవుతాయి. ప్రస్తుతం కృష్ణా నదిలో నీరు అడుగంటిపోవడంతో.. నదీ గర్భంలోని ఇసుకలో తీసిన కాల్వ ద్వారా అరకొరగా వస్తున్న నీటినే ప్రజలకు సరఫరా చేస్తున్నారు. కంచికచర్ల పట్టణంలో పది రోజులకు ఒకసారి కూడా తాగునీరు సరఫరా చేయలేని పరిస్థితి నెలకొంది.
 • పెడన మండలంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. మెగా వాటర్‌ స్కీమ్‌ నుంచి ఉప్పలకలవగుంట ద్వారా 12 గ్రామాలకు నీటిని సరఫరా చేస్తున్నారు. వాటిని వినియోగించడానికి ప్రజలు ఇష్టపడటం లేదు. పశువులకు మాత్రమే వాడుతున్నారు.
 • జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో పురపాలక సంఘ అధికారులు రోజు విడిచి రోజు తాగునీటి సరఫరా చేస్తున్నారు. మచిలీపట్నం మండలంలో ఆకుమరు, మంగినపూడి నీటి పథకాల ద్వారా 110 గ్రామాలకు తారకటూరు సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకు నుంచి తాగునీటిని సరఫరా చేయాల్సి ఉండగా.. ఇక్కడ ఫిల్టర్‌బెడ్స్‌ పని చేయకపోవడంతో నాలుగు రోజులకు ఒకసారి నీటిని సరఫరా చేస్తున్నారు. సముద్ర తీరప్రాంతాల్లోని ప్రజలకు ఉప్పునీరే గతవుతోంది.
 • బంటుమిల్లి మండలంలోని పది గ్రామాల్లో తాగునీటి సమస్య నెలకొంది.
 • కైకలూరు మండలంలోని 16 గ్రామాల్లో రోజు విడిచి రోజు మంచినీటిని సరఫరా చేస్తున్నారు. ఆటపాక, గోనెపాడు, రామవరంం, గోపవరం, వేమవరపాడు గ్రామాల్లో చెరువులు అడుగంటిపోయాయాయి. మరో పది రోజులకు మించి ఆ గ్రామాలకు నీటి సరఫరా ఉండదు.
 • వత్సవాయి, నందివాడ, నూజివీడు, ముదినేపల్లి మండలాల్లోని గ్రామాల్లోని ప్రజలు నీటి కోసం పడుతున్న కష్టాలు అన్నీ, ఇన్నీ కావు. ఎండలు మండిపోతుండటంతో గొంతెండిపోతున్న ప్రజలకు తాగునీటిని కొనుక్కుందామన్నా దొరకని పరిస్థితి నెలకొందంటే అతిశయోక్తి కాదు.
ప్రజల్లో అవగాహన రావాలి
వేసవిలో వర్షాలు పడవు. వర్షాలు లేనప్పుడు భూగర్భ జలాలూ ఉండవు. ఇప్పుడే ప్రజలకు నీటి వాడకం ఎక్కువ. ఉన్న భూగర్భ జలాలను ఎక్కువగా తోడేస్తుండటంతో ఉన్న భూగర్భ జలాలు తరిగిపోవడం సహజం. వేసవిలో నీటి ఎద్దడి వచ్చినప్పుడే జలసంరక్షణపై అందరం మాట్లాడుతుంటాం. దాహం వేసినప్పుడే బావి తవ్వడం సరికాదు. వర్షాకాలంలో వానలు బాగా కురుస్తున్నప్పుడే దూరదృష్టితో ఆలోచించాలి. వృథాగా పోతున్న వర్షం నీటిని జాగ్రత్తగా ఒడిసిపట్టుకుని భూమిలోకి ఇంకించడం ద్వారా విలువైన జలాలను సంరక్షించుకోవాలన్న అవగాహన మనందరిలోనూ రావాలి. ప్రతి ఒక్కరూ వాననీటి సంరక్షణకు తమ ఇళ్లలో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచైనా నీటిని పొదుపుగా వాడుకుంటూ.. జలసంరక్షణకు నడుం బిగించాలి.
 
– ఎ.వరప్రసాదరావు, జాయింట్‌ డైరెక్టర్‌, భూగర్భ జల వనరుల శాఖ
 

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *