గోదారీ… నీరేదీ?


కూనవరం: అఖండ గోదావరిని చూశారా! ఇదిగో ఇక్కడ కూనవరం వద్ద చిక్కి శల్యమై పిల్ల కాల్వలా కనిపిస్తుందే.. ఇదే ఆ మహా గోదావరి. ఇసుక దిబ్బలతో ఇప్పుడది ఎడారిని తలపిస్తోంది. మార్చి నెల తర్వాత నదిలోకి నీరు తగ్గిపోవడం సాధారణమే అయినా.. ఎన్నడూలేని స్థాయిలో ఈసారి నీటి ఉరవడే లేదు. దీంతో గోదావరి ఇలా పిల్లకాల్వని తలపిస్తోంది. జూన్‌ నెల నుంచి సెప్టెంబరు వరకూ నిండు కుండలా ఉండే గోదావరి.. ఆ తర్వాత క్రమంగా తగ్గుతుంది. అయితే, సాగు, తాగు నీటి కోసం, జల విద్యుదుత్పత్తి కోసం ఎక్కడికక్కడ ఆనకట్టలు కట్టడంతో గోదావరికి నీరు రావడం లేదు. దీనికితోడు గోదావరికి ఉప నదులైన ఇంద్రావతి, ప్రాణహిత, కిన్నెరసాని, తాలిపేరు, సీలేరు, శబరి నదుల నుంచి నీరు కూడా రాకపోవడంతో ఈ నది కళ తప్పింది. వర్షాకాలంలో తప్ప ఉప నదుల నుంచి నీరు వచ్చే పరిస్థితి లేదు. నీరు తగ్గడంతో పరీవాహక ప్రాంతాల్లో భూగర్భ జలాలు కూడా తగ్గిపోతున్నాయి. దీంతో సమీప గ్రామాల్లో దాహార్తి కేకలు వినిపిస్తున్నాయి. మరోవైపు చేపల వేట లేక మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. ఒకప్పుడు వేసవిలోనూ పుష్కలంగా చేపలు దొరికేవని, ఇప్పుడు కిలో చేపలు కూడా పడడం లేదని వాపోతున్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *