చందాలు పోగుచేసి ఇచ్చిన డబ్బుతో వైసీపీ అభ్యర్థి చేసిందేంటి?


ఆయన రాయలసీమ ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న ఓ జిల్లాలో పోటీచేసిన అసెంబ్లీ అభ్యర్థి. హైకమాండ్ నుంచి అందిన డబ్బులతోపాటు ఆ నగరంలో ఉన్న సానుభూతిపరులు కూడా చందాలు పోగుచేసి ఆయనకు ఇచ్చారు. అంతేకాదు- ఎంపీ అభ్యర్థి కూడా భారీగానే ఆయనకు సొమ్ములు ముట్టచెప్పారు. పోలింగ్ ముగిసిన తర్వాత ఆ అభ్యర్థి చెన్నైలో ఓ ఇల్లు కొనుగోలు చేయడం ఇప్పుడు ఆ పార్టీ నేతల్లో కలవరానికి దారితీసింది. దీనిపై ఆరాతీసిన నేతలు తాము ఇచ్చిన డబ్బులను సదరు అభ్యర్థి ఖర్చుచేయలేదన్న నిర్ణయానికి వచ్చారు. మే 23వ తేదీ ఫలితాల్లో తేడా జరిగితే మాత్రం తొక్కేస్తామని హైకమాండ్ స్పష్టంచేసినట్టు తెలిసింది. ఇంత గందరగోళానికి దారితీసిన ఆ అభ్యర్థి ఎవరో తెలుసుకోవాలని ఉందా..? అయితే ఈ కథనంలోకి వెళ్లాల్సిందే!
 
   ఈసారి ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నెన్నో విచిత్రాలు చోటుచేసుకున్నాయి. నిజాలు నిదానంగా బయటకి వస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఎవరి హడావుడిలో వాళ్లుంటారు. ఇదే సమయంలో.. “మా అభ్యర్థులందరూ ఇచ్చిన డబ్బును పథకం ప్రకారం ఖర్చుపెట్టారు..” అని ఆయా పార్టీల నేతలు అంతర్గతంగా చెబుతుంటారు. ఈ దఫా సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కీ, కౌంటింగ్‌కీ మధ్య 43 రోజుల గ్యాప్‌ ఉంది. దీంతో అనేక నియోజకవర్గాల్లో అసలేం ఏం జరిగిందో వాస్తవాలు బయటికొస్తున్నాయి. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసిన ఓ అసెంబ్లీ అభ్యర్థికి ఆ నియోజకవర్గంలో మంచి పేరుంది. చివరి నిముషంలో అక్కడ తెలుగుదేశం పార్టీ తమ అభ్యర్థిని మార్చినప్పటికీ నువ్వా- నేనా అన్నట్టుగా మారింది పోటీ. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి ఇంటింటికీ తిరిగి వినయపూర్వకంగా ఓట్లను అభ్యర్థించడం ఇక్కడ కొసమెరుపు.
 
   అంతకు ముందు నామినేషన్ల పర్వం కొనసాగుతున్న సమయంలోనే హైకమాండ్‌ నుంచి వైసీసీ అభ్యర్థికి ఫండ్‌ అందింది. దీనికి తోడు ఎంపీ అభ్యర్థి కూడా తన వంతు సొమ్ములు అందజేశారు. ఇవి కాకుండా శ్రేయోభిలాషులు, బంధువులు, మిత్రులు, పార్టీ అభిమానులు కూడా చందాలు వేసుకుని భారీగానే ఆయనకు సొమ్ములు ముట్టచెప్పారు. ఈ నేపథ్యంలో పోలింగ్‌కి ముందు ఆ అభ్యర్థి ఇబ్బడిముబ్బడిగా డబ్బులు పంచుతారని విస్తృతంగా ప్రచారం జరిగింది. పోలింగ్‌కు అయిదు రోజుల ముందు మాత్రమే ఆయన డబ్బులు పంచారు. అది కూడా అరకొరగా పంచి.. చేతులు దులుపుకున్నారన్నది వైసీపీ వర్గాల కథనం. దీంతో పార్టీ హైకమాండ్‌ సదరు అభ్యర్థిని ప్రశ్నించింది. పోలింగ్‌ ముందు రోజు సాయంత్రానికి డబ్బుల పంపిణీ పూర్తిచేస్తానని పార్టీ పెద్దలకు ఆయన బుదులిచ్చారు. ఆ అభ్యర్థి మాటలను వారు కూడా నమ్మారు.
 
   పోలింగ్‌ ముగిసిన తర్వాత వైసీపీ హైకమాండ్‌ ఆ నియోజకవర్గంలోని పరిస్థితులపై ఆరా తీసింది. క్షేత్రస్థాయి నుంచి అందిన నివేదికలను పరిశీలించింది. అప్పుడు తెలిసింది అసలు విషయం. ఆ అభ్యర్థి డబ్బులు పూర్తిస్థాయిలో ఓటర్లకు పంపిణీ చేయలేదని తేలింది. పోలింగ్ రోజున గ్రామస్థాయిలో పార్టీ నేతలకు ఖర్చులకు కూడా డబ్బులు ఇవ్వలేదనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
 
   ఇదిలా ఉంటే.. పోలింగ్ పూర్తయిన వారం రోజులకు ఆ వైసీపీ అభ్యర్థి చెన్నైలో ఓ భారీ భవన సముదాయాన్ని కొనుగోలు చేశారంటూ ప్రచారం జరిగింది. వైసీపీ హైకమాండ్ వాకబుచేస్తే ఈ ప్రచారంలో నిజముందని తేలింది. ఈ తరుణంలో వైసీపీకి చెందిన నలుగురు ముఖ్యనేతలు ఆ అభ్యర్థిని నిలదీశారట. ఎన్నికల్లో అందిన ఫండ్‌ని తాను నియోజకవర్గంలో అందరికీ పంపిణీ చేశానని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారట. దాదాపు 10 వేల ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నానని కూడా విశ్వాసం వ్యక్తంచేశారట. మరి.. చెన్నైలో ఆ గృహసముదాయం సంగతేమిటని ప్రశ్నిస్తే.. తాను ఎన్నికలకు ముందే ఆ ఇల్లు కొనుగోలు చేశానని స్పష్టంచేశారట. విషయం తెలుసుకున్న వైసీపీ పెద్దలు కక్కాలేక-మింగాలేక అన్నట్టుగా మిన్నకుండిపోయారట.
 
   ఏదిఏమైనా ఈ వ్యవహారం వైసీపీలో వేడివేడి చర్చలకు దారితీస్తోంది. సదరు నియోజకవర్గ వైసీపీ నేతలు పార్టీ హైకమాండ్‌ను సంప్రదించినప్పుడు వారికి ఒక విషయం స్పష్టంచేసిందట. ఎన్నికల ఫలితాల్లో ఆ నియోజకవర్గంలో ఏమాత్రం తేడా వచ్చినా ఆ అభ్యర్థికి చుక్కలు చూపిస్తామని పార్టీ పెద్దలు గట్టిగా చెప్పారట. అందువల్ల రిజల్ట్స్‌ వచ్చేవరకూ ఓపిక పట్టమని నచ్చచెప్పారట. దీంతో ఆ నియోజకవర్గ వైసీపీ నేతలు ప్రస్తుతానికి మౌనాన్ని ఆశ్రయించారన్నది పార్టీ వర్గాలలో తాజా టాక్‌!

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *