‘చావు’ బేరాలు!


 • సింహపురిపై చర్యలకు సీఎస్‌ అడ్డంకి?
 • పేదోడి ప్రాణాలతో ఆస్పత్రి చెలగాటం
 • కిడ్నీ కోసం అవయవ దానం నాటకం
 • నిర్ధారించిన కలెక్టర్‌, డీఎంఅండ్‌హెచ్‌వో
 • దాని ఆధారంగానే రాష్ట్రస్థాయిలో చర్యలు
 • ఆ నివేదికను పట్టించుకోని సీఎస్‌ ఎల్వీ
 • కలెక్టర్‌కు ఏం తెలుసంటూ కామెంట్స్‌!
 • సొంతంగా డీఎంఈతో విచారణకు ఆదేశం
 • జిల్లా స్థాయిలోనే తెరదించేలా వ్యూహం
 • చక్రం తిప్పిన ఆస్పత్రి వర్గాలు
 • వివాదంపై సీఎస్‌, పూనం వాగ్వాదం!?
(నెల్లూరు/అమరావతి – ఆంధ్రజ్యోతి): కిడ్నీల కోసం అవయవదానం నాటకమాడిన నెల్లూరు సింహపురి ఆస్పత్రి వివాదం సచివాలయంలో ఉన్నతస్థాయిలో రచ్చకు దారి తీసింది. నిరుపేద రోగికి ఖరీదైన చికిత్స చేసి… బిల్లు కట్టాల్సిందే అని బెదిరించి… చివరికి బలవంతంగా కిడ్నీ ‘దానం’ చేయించిన వైనం కలకలం సృష్టించింది. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన ‘దానమా… దుర్మార్గమా’ కథనంతో ఆ జిల్లా కలెక్టరు విచారణ జరిపి… ఏప్రిల్‌ 29వ తేదీన వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్యకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యంకు నివేదిక సమర్పించారు. ఈ నివేదిక ఆధారంగా ఆరోగ్య శాఖ డైరెక్టర్‌ ఏప్రిల్‌ 30న ఆ ఆస్పత్రిపై చర్యలకు ఆదేశాలిచ్చారు. అదే రోజు ఉదయం పూనం మాలకొండయ్య సీఎ్‌సను మర్యాదపూర్వకంగా కలిసి.. సింహపురి ఘటన వివరించి, తాము తీసుకున్న చర్యలను వివరించారు.
 
ఆ సమయంలో మరికొందరు అధికారులు కూడా అక్కడే ఉన్నారు. సింహపురి ఆస్పత్రి మోసానికి పాల్పడిందని, చట్టాలు, జీవోలు ఉల్లంఘించిందని పూనం చెబుతుండగా…. అవన్నీ మీకెలా తెలుసని సీఎస్‌ ఆమెను ప్రశ్నించినట్లు తెలిసింది. కలెక్టర్‌ నివేదిక ఆధారంగా మాట్లాడుతున్నానని బదులివ్వగా… ‘కలెక్టర్‌కు ఏం తెలుసని ఆ నివేదిక ఇచ్చారు!’ అంటూ దానిని పక్కన పెట్టాలనే అర్థం వచ్చేలా సీఎస్‌ మాట్లాడినట్లు సమాచారం. అయితే, విచారణ కమిటీలో డీఎం అండ్‌ హెచ్‌వో కూడా ఉన్నారని చెప్పగా… డీఎంఅండ్‌హెచ్‌ఓకు మాత్రం ఏం తెలుసని సీఎస్‌ తీసిపారేసినట్లు తెలిసింది. ‘‘సింహపురి ఆస్పత్రి వాళ్లు నిన్న నన్ను కలిశారు.. ఈ ఘటనపై నేను వైద్య విద్య డైరెక్టర్‌ (డీఎంఈ)తో విచారణ జరిపించాలనుకుంటున్నాను. తక్షణమే డీఎంఈని నెల్లూరు పంపి విచారణ జరిపించండి’’ అని సీఎస్‌ ఆదేశించారు.
 
ఈ ప్రతిపాదనతో పూనం విభేదించారు. ఈ వివాదంపై ఆస్పత్రుల రిజిస్ర్టేషన్‌తో ఏ మాత్రం సంబంధంలేని డీఎంఈ విచారణ చేయడం తగదని, ఒకవేళ డీఎంఈ నివేదిక ఇచ్చినా చట్టపరంగా అది చెల్లుబాటు కాదని ఆమె వివరించే ప్రయత్నం చేశారు. సీఎస్‌ ఆ ప్రయత్నాన్ని అడ్డుకుని, సింహపురిపై చర్యలు తీసుకునేందుకు తొందరపడుతున్నారనే అభిప్రాయం వ్యక్తం చేశారు. తానేమీ తొందరపడడం లేదని.. కలెక్టర్‌ నివేదిక ఇచ్చిన తర్వాతే చట్టప్రకారం చర్యలు తీసుకుంటున్నానని పూనం సమాధానం చెప్పారు. ‘‘ఈ ఘటనలో బాధిత మహిళ ఒక నిరుపేద గిరిజనురాలు. యానాది సామాజిక వర్గానికి చెందిన మహిళ. కనీసం రేషన్‌ కార్డు కూడాలేదు. ఒక బ్యూరోక్రాట్‌గా ఆమెకు అండగా నిలవాలనుకుంటున్నాం’’ అని పూనం చెప్పినట్లు తెలిసింది. మరి నా ఆదేశాలు ఏం చేస్తారని సీఎస్‌ ప్రశ్నించినట్లు తెలిసింది. ‘మీ ఆదేశాలు రాతపూర్వకంగా నాకు వస్తే… దానిపై తీసుకున్న చర్యలను మీకు తెలియజేస్తాను’ అని పూనం బదులిచినట్లు సమాచారం. మొత్తానికి ఈ వివాదంపై ఇద్దరు అధికారుల మధ్య 15 నిమిషాలపాటు తీవ్ర వాగ్వాదం జరిగినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కలెక్టర్‌ ఇచ్చిన నివేదికను సీఎస్‌ తీసిపారేసేలా మాట్లాడడంపై ఐఏఎస్‌లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
 
జిల్లా స్థాయిలోనే ముగించేలా…
ఈ వాగ్వాదం జరిగిన రెండు రోజుల తర్వాత సింహపురి ఘటనపై విచారణకు తక్షణం డీఎంఈని నెల్లూరు పంపాలని ఆదేశిస్తూ పూనం మాలకొండయ్యకు సీఎస్‌ ఒక నోట్‌ పంపారు. ఆ నోట్‌తో పాటు 29వ తేదీన తనకు నెల్లూరు కలెక్టర్‌ పంపిన నివేదికను, 30వ తేదీన సింహపురి ఆస్పత్రి మెడికల్‌ డైరెక్టర్‌ వై. పవన్‌కుమార్‌ రెడ్డి ఇచ్చిన వినతి పత్రాన్ని జతచేశారు. కలెక్టర్‌ పంపిన నివేదికపై కనీసం సంతకం చేయని సీఎస్‌… పవన్‌ కుమార్‌ రెడ్డి ఇచ్చిన నివేదికను చదివి, దానిపై అభిప్రాయాలు రాసి, సంతకం చేసి పంపించారు. సింహపురి ఆస్పత్రి ఏవైనా నిబంధనలు ఉల్లంఘించిందని డీఎంఈ విచారణలో తేలితే ఆ నివేదికను నెల్లూరు జిల్లా కలెక్టర్‌కు, ఎస్పీకి అందజేయాలని సీఎస్‌ ఆ నోట్‌లో ఆదేశించారు. నిజానికి… డీఎంఈ రాష్ట్రస్థాయి అధికారి. ఆయన విచారణ చేసి నివేదికను రాష్ట్రస్థాయిలో సీఎ్‌సకు లేదా ఆ శాఖ సెక్రటరీకి, డైరెక్టర్‌కు ఇవ్వాల్సి ఉంటుంది. ఇవేవీ కాకుండా, నేరుగా జిల్లా ఎస్పీ, కలెక్టర్‌కి మాత్రమే నివేదిక ఇవ్వాలని ఆ నోట్‌లో సీఎస్‌ పేర్కొనడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రస్థాయి అధికారి జిల్లా స్థాయి అధికారులకు నివేదిక సమర్పించడం ఎక్కడైనా ఉంటుందా? ఈ ఘటనను జిల్లాస్థాయికే పరిమితం చేసి.. డీఎం అండ్‌ హెచ్‌వోపై ఒత్తిడి తేవడం ద్వారా ఆ ఆస్పత్రిని రక్షించేందుకే సీఎస్‌ ఇలాంటి నోట్‌ ఇచ్చారా? అని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
 
ఆస్పత్రి వర్గాల హల్‌చల్‌…
డీఎంఈని విచారణకు పంపాలంటూ సీఎస్‌ ఇచ్చిన నోట్‌ వైద్యఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కార్యాలయానికి గురువారం సాయంత్రం చేరింది. కానీ… సింహపురి ఆస్పత్రికి చెందిన వారు ఆ రోజు మధ్యాహ్నమే సీఎస్‌ నోట్‌ను డీఎంఈకి స్వయంగా అందించారు. ‘సీఎస్‌ ఆదేశాలిచ్చారు. మీరు నెల్లూరు వచ్చి విచారణ చేయాలి’ అని డీఎంఈపై ఒత్తిడి చేశారు. తమ సెక్రటరీ నుంచి ఆదేశాలు అందితేనే తాను విచారణకు వస్తానని డీఎంఈ వారికి సమాధానం చెప్పారు. ఆ తర్వాత సాయంత్రం పూనం ఆదేశాల మేరకు డీఎంఈ నెల్లూరు వెళ్లారు. శుక్రవారం సింహపురి ఘటనపై కలెక్టర్‌కు, ఎస్పీకి నివేదిక ఇచ్చారు. జిల్లా అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం… కలెక్టర్‌, డీఎంఈ నివేదికలు రెండూ ఒకేలా ఉన్నాయని తెలిసింది.
 
సింహపురి ఆస్పత్రి కిడ్నీల కోసం అవయవదానం నాటకం ఆడిందని డీఎంఈ ధ్రువీకరించినట్లు సమాచారం. సింహపురి ఆస్పత్రి రిజిస్ర్టేషన్‌ రద్దు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆ ఆస్పత్రికి డీఎం అండ్‌ హెచ్‌వో నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులపై ఆ ఆస్పత్రి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ వివరణ కూడా డీఎం అండ్‌ హెచ్‌వోకు ఇవ్వాలి. దాని ఆధారంగా ఆస్పత్రి రిజిస్ర్టేషన్‌ రద్దు చేయాలో.. కొనసాగించాలో ఆ అధికారి నిర్ణయిస్తారు. దీంతో ఆస్పత్రిని రక్షించేందుకు డీఎం అండ్‌ హెచ్‌వోపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు తీసుకొచ్చే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.
 
బాధిత గిరిజన మహిళకు దిక్కెవరు?
ఓ వైపు భర్త మృతి… మరోవైపు ఆ మరణం చుట్టూ ముసురుకుంటున్న వివాదాలతో రోడ్డున పడిన గిరిజన మహిళను ఎవరూ పట్టించుకోవడం లేదు. సంపాదించే భర్తను కోల్పోయిన ఆమెకు కనీసం రేషన్‌కార్డు కూడా లేదు. ప్రజాసాధికార సర్వేలోనూ ఆమె కుటుంబం నమోదు కాలేదు. మోసం చేసిన ఆస్పత్రిని కాపాడేందుకు అత్యుత్సాహం చూపుతున్న అధికారుల్లో బాధిత గిరిజన మహిళను ఆదుకోవాలన్న మానవత్వం ఏ కోశానా కనిపించడంలేదు.
 
పోలీసు అధికారి జోక్యం…
సింహపురి వివాదంలో ఒక పోలీసు ఉన్నతాధికారి కూడా వేలు పెట్టినట్లు తెలిసింది. ఆ అధికారి నేరుగా డీఎంఈకి ఫోన్‌ చేసి సింహపురి ఘటనపై విచారణ జరపాలని, దీనిపై సీఎస్‌ నుంచి ఆదేశాలు అందుతాయని చెప్పినట్టు తెలిసింది. అదే పోలీసు అధికారి నుంచి జిల్లా స్థాయి పోలీసులకు కూడా ఆదేశాలు చేరి ఉంటాయని, ఈ వ్యవహారం నుంచి సింహపురి ఆస్పత్రిని బయటపడేసేలా వారిపై ఒత్తిడి చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ వివాదంపై పూనంను ‘ఆంధ్రజ్యోతి’ సంప్రదించగా… ఆమె స్పందించేందుకు నిరాకరించారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *