చిందుతున్న విద్యార్థి రక్తం!


  •  ఏడాదిలోనే పదివేల మంది రహదారులకు బలి
  • అంతా 18 సంవత్సరాలలోపు వారే
  • ‘ఆంధ్రజ్యోతి’కి ఐఆర్‌టీఈ అధ్యక్షుడు డాక్టర్‌ రోహిత్‌ బలుజా వెల్లడి
విశాఖపట్నం, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా పద్దెనిమిదేళ్లలోపు పది వేల మంది విద్యార్థులను గత ఏడాది రోడ్డు ప్రమాదాలు బలిగొన్నాయని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ రోడ్‌ ట్రాఫిక్‌ ఎడ్యుకేషన్‌ (ఐఆర్‌టీఈ) అధ్యక్షుడు, ట్రాఫిక్‌ మెనేజ్‌మెంట్‌ కళాశాల డైరెక్టర్‌ డాక్టర్‌ రోహిత్‌ బలుజా అన్నారు. ‘‘ప్రమాదాల్లో చనిపోయిన విద్యార్థుల్లో 18 ఏళ్లలోపువారే ఎక్కువగా ఉంటున్నారు. 18-35 వయస్సు మధ్య ఉన్నవారు గత ఏడాది 35వేల మంది మృత్యువాత పడ్డారు’’ అని వివరించారు. విశాఖ గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయంలోని నాలెడ్జ్‌ రిసోర్స్‌ సెంటర్‌లో నిర్వహించిన వర్క్‌షా్‌పనకు బలుజా హాజరై ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధితో మాట్లాడారు. అనేక దేశాల్లో రహదారి భద్రతపై అధ్యయనం చేసిన ఆయన, దేశంలోని పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కొంత మెరుగైన రవాణా పద్ధతులను అనుసరిస్తున్నారని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్‌ జాగ్రత్తల విషయంలో చైతన్యం పెంచడం కోసం ఈ నెల 29, 30 తేదీల్లో ఢిల్లీలో ఆసియా దేశాల సదస్సు నిర్వహిస్తున్నామని వెల్లడించారు.
 
ఏడాదికి మూడు లక్షల మరణాలు
విద్యా సంస్థల ప్రాంగణాల్లో వాహన చోదకులు ట్రాఫిక్‌ నిబంధనలు పాటించడం లేదని, అది విద్యార్థుల జీవితాలతో ఆటలాడటమే అవుతుందని బలుజా ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ప్రపంచంలో జరుగుతున్న అత్యధిక ప్రమాదాల్లో భారత్‌ అగ్రస్థానంలో ఉంది. డబ్ల్యూహెచ్‌వో లెక్కల ప్రకారం ఏటా దేశంలో మూడు లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. రహదారి భద్రతపై రూపొందించిన బిల్లు పార్లమెంటు నుంచి ఎగువ సభకు వెళ్లింది. అది అమలైతే ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది’’ అని ఆశాభావం వ్యక్తం చేశారు. కొరియాలో చేసిన కేస్‌ స్టడీలో అక్కడి ప్రధాని ఒక కమిటీని నియమించి పిల్లల మరణాలు 95 శాతం తగ్గించాలని నిర్ణయించారని తెలిపారు. ఫిబ్రవరిలో దీనిపై డిక్లరేషన్‌ రాబోతోందని చెప్పారు.
 
మోటార్‌ సై‘కిల్స్‌’ పెరిగాయి
ప్రజా రవాణా వ్యవస్థ సక్రమంగా లేక ప్రజలు వ్యక్తిగత వాహనాలపై ఆధారపడాల్సి వస్తోందని, అందులో 74 శాతం మంది ద్విచక్ర వాహనాలపైనే తిరుగుతున్నారని బలుజా చెప్పారు. ఈ సంఖ్య ఏటా పది నుంచి ఇరవై శాతం పెరుగుతోందన్నారు. రహదారుల్లో ఇంజనీరింగ్‌ వైఫల్యం వల్ల 25 శాతం ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ‘‘ట్రాఫిక్‌ ఇంజనీరింగ్‌ లోపం వల్ల జరుగుతున్న ప్రమాదాల్లో ఒక్క ఇంజనీర్‌పైనా కేసు దాఖలు చేసిన దాఖలాలు లేవు. ప్రతి అతిక్రమణకూ, బాధ్యులను గుర్తించి, శిక్షించడం తేలిక అవుతుంది’’ అని వివరించారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *