చిన్నారి హృదయ వేదన


(విజయవాడ, ఆంధ్రజ్యోతి): విజయవాడకు చెందిన అంబిక, ప్రసాద్‌ దంపతులకు గత జనవరి 18వ తేదీన పండంటి పాప పుట్టింది. ఆరో నెలలోనే జన్మించిన ఆ నవజాత శిశువుకు పట్టుకతోనే గుండె జబ్బు ఉన్నట్లు ఆంఽధ్రా హాస్పిటల్స్‌ వైద్యులు గుర్తించారు. ఊపిరి తీసుకోలేక ఆయాసంతో బాధపడుతున్న ఆ చిన్నారిని హృదయ వేదనను చూసి చలించిపోయిన వైద్యులు వెంటనే ఆ శిశువును వెంటిలేటర్‌పై ఉంచారు. వైద్యపరీక్షలన్నీ నిర్వహించిన తర్వాత ఊపిరితిత్తుల ఎదుగుదల సరిగా లేకపోవడం వల్ల ఆ పసిపాప ‘పేటెంట్‌ డక్టస్‌ ఆర్టిరియోసెస్‌’ సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించారు. వెంటనే గుండె ఆపరేషన్‌ చేస్తే తప్ప ఆ చిన్నారి బతకదు. అందునా 25 వారాల్లోనే పుట్టి కేవలం 700 గ్రాముల బరువుతో వెంటిలేటర్‌పై ఉన్న ఆ శిశువుకు గుండె ఆపరేషన్‌ చేసి బతికించడం వైద్యులకు సవాల్‌గా మారింది.
 
ఇలాంటి పరిస్థితుల్లో చిన్నారికి ఆపరేషన్‌ చేయడం కూడా రిస్కేనని తెలిసినప్పటికీ.. ఆ చిన్నారి తల్లిదండ్రుల కోరిక మేరకు వైద్యులు.. నవజాత శిశువుల ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లోనే ఉంచి సంక్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి ఆ పసి పాపకు ప్రాణం పోశారు. మూడు నెలల వయసుకు వచ్చిన ఆ చిన్నారి ప్రస్తుతం 800 గ్రాముల బరువుతో సంపూర్ణ ఆరోగ్యంగా ఉంది. పాలు బాగానే తాగుతుండటంతో ఇక ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవని భావించిన డాక్టర్లు శనివారం ఆ చిన్నారిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు. ఈ చిన్నారికి వచ్చిన ‘పేటెంట్‌ డక్టస్‌ ఆర్టిరియోసెస్‌’ ఆరోగ్య సమస్య నూటికి ఒకరిద్దరికి మాత్రమే వస్తుందని వైద్యనిపుణులు చెబుతున్నారు.
 
పేటెంట్‌ డక్టస్‌ ఆర్టిరియోసెస్‌ అంటే..?
గుర్భస్థ శిశువుల్లో గుండె నుంచి ఊపిరితిత్తులకు చెడురక్తం తీసుకువెళ్లే నాళం (పల్మొనరీ ఆర్టెరి). శరీరానికి మంచి రక్తం సరఫరా చేసే నాళం (అయోర్టాల) మధ్య తాత్కాలిక దారి ఉంటుంది. పుట్టే వరకు శిశువు శ్వాసించదు కాబట్టి అంతవరకు ఈ దారిలో ప్లసెంటా నుంచి వచ్చే మంచి రక్తం అయోర్టాకు సరఫరా అవుతుంటుంది. ఈ అయోర్టా, పల్మొనరీ అర్టెరీలను కలుపుతూ ఉండే ప్రత్యేక నాళం (డక్టస్‌) బిడ్డ పుట్టగానే దానంతటదే మూసుకోదు. దారి అలాగే ఉంటుంది. శిశువు జన్మించిన కొన్ని గంటలు లేక రోజుల్లో అది మూసుకుపోతుంది. అలా మూసుకుపోకపోతే ఆ సమస్యనే ‘పేటెంట్‌ డక్టస్‌ ఆర్టిరియోసెస్‌’ అంటారు. నెలలు నిండకుండా పుట్టే పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఈ సమస్య వల్ల షంటు ద్వారా ఊపిరితిత్తులకు ఎక్కువ రక్తం పోతుంటుంది. ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు ఆపరేషన్‌ చేసి ఆ దారిని మూసేయవచ్చు. ఆలస్యం చేస్తే శిశువు ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదముంది. మేనరికపు వివాహాలు చేసుకునే దంపతులకు పుట్టే పిల్లలకు ఇలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువని వైద్యనిపుణులు చెబుతున్నారు.
 
పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు 12 రకాలు
గర్భంలో శిశువు గుండె నిర్మాణం సరిగా కాకపోయినా.. రక్తనాళాలు తేడాగా ఉంటే వచ్చే గుండె జబ్బుల్ని వైద్య పరిభాషలో కంజెనైటల్‌ డిసీజెస్‌ అంటారు. ప్రస్తుతం జననాల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే పుట్టిన ప్రతి వంద మంది పిల్లల్లో ఒకరు గుండె సంబంధిత జబ్బులతో పుడుతున్నారు. ఇలా పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు దాదాపు పన్నెండు రకాలుగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. తల్లిదండ్రులలోగాని, అన్న-అక్కలకుగాని గుండె జబ్బులు పుట్టుకతో వేస్తే.. వారికి పెళ్లిళ్లు అయిన తర్వాత వారికి పుట్టే పిల్లలకు 4 నుంచి 5 శాతం వరకు గుండె జబ్బులు వచ్చే అవకాశాలు అవకాశముంది.
 
నెలలు నిండకుండా పుట్టేవాళ్లలో 2 శాతం మందికి గుండె జబ్బులు పుట్టుకతోనే రావచ్చు. పుట్టుకతో వచ్చే కొన్ని రకాల గుండెజబ్బుల గురించి తల్లి గర్భంలో ఉన్నప్పుడే తెలుసుకోవచ్చని, సాధ్యమైనంత త్వరగా వాటిని సరిదిద్ది, సంపూర్ణ ఆరోగ్యంతో జీవించేలా చేయవచ్చని వైద్యనిపుణులు చెబుతున్నారు. పుట్టుకతోనే గుండె జబ్బులతో పుడుతున్నవారి సంఖ్య నానాటికీ పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుందన్న అంశం. పుట్టుకతోనే గుండె జబ్బులు రావడానికి కారణాలను మాత్రం వైద్యులు సైతం కచ్చితంగా చెప్పలేకపోతుండటం గమనార్హం.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *