చుట్టుముడుతున్న వివాదాలు


  • వీవీ ప్యాట్‌ పని చేయకపోతే ఈవీఎం మార్చేస్తారా!
  • సూరాయపాలెం బూత్‌ నెంబర్‌ 262లో ఈవీఎం మార్పుపై వివాదం
  • ఎన్నికల నిబంధనల ప్రకారం ఏది సమస్య అయితే అదే మార్చాలి !
విజయవాడ, ఆంధ్రజ్యోతి: సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల మొరాయింపు, ఇబ్బందులు అనంతర పరిణామాల నేపథ్యంలో, రోజుకో విషయం వెలుగు చూస్తోంది. ఓవైపు ఈవీఎంల తరలింపుపై వివాదం అలముకోగా, మరోవైపు ముగిసిన పోలింగ్‌ నాటి చిత్రాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈవీఎం దాని అనుసంధాన వ్యవస్థలు మొరాయించిన సందర్భంలో వాటిని మార్చే విషయంలో ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలను పోలింగ్‌ అధికారులు కొందరు పాటించలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో, ఉపయోగించిన ఈవీఎంలతో పాటు తొలిసారిగా ప్రవేశపెట్టిన వీవీ ప్యాట్‌లు కూడా జిల్లాలో పలుచోట్ల ఈ సారి మొరాయించాయి. వీవీప్యాట్‌లలో స్లిప్పులు జనరేట్‌ కాకపోవడం, ఏడు సెకన్ల పాటు ఎవరికి ఓటు వేశారో డిస్‌ప్లే కాకపోవడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో పోలింగ్‌కు ఇబ్బందికరంగా మారిని సంఘటనలు అనేకం ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈవీఎంలు, వీవీప్యాట్‌లను మార్చి పలుచోట్ల ఎన్నికలు నిర్వహించడం ప్రస్తుతం వివాదాస్ప దమవుతోంది. ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం ఈవీఎం దాని అనుసంధానాల్లో ఏది మొరాయిస్తే దాన్నే మార్చాల్సి ఉంటుంది. దీనికి భిన్నంగా ఈవీఎంను పలుచోట్ల మార్చ డంపై అనుమానాలు నెలకొంటున్నాయి.
 
పలుచోట్ల ఇలాంటి సంఘటనలు
పోలింగ్‌ ఏజంట్లకు వీటికి సంబంధించిన మార్గదర్శకాలు తెలియకపోవడంతో అభ్యంతరం పెట్టలేదని తెలుస్తోంది. పోలింగ్‌ ఏజంట్ల వద్ద ఇలాంటి పుస్తకాలు ఉన్నా, వారికి అవగాహన ఉన్నా పరిస్థితి వేరేలా ఉండేది. ఏపీఓ, ఓపీఓలకు పూర్తిగా వీటి మీద అవగాహన లేకపోతే ప్రిసైడింగ్‌ అధికారి వంటి వారు ఇలాంటి వాటిపై ఆచితూచి స్పందించాలి. రిటర్నింగ్‌ అధికారి దృష్టికి తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఈ వ్యవహారంలో కిందిస్థాయి సిబ్బంది, ప్రిసైడింగ్‌ అధికారికి సరైన సమాచారం ఇచ్చారా ? లేదా ? సరైన సమాచారం ఇచ్చినా ప్రిసైడింగ్‌ అధికారి పట్టించుకోలేదా ? అన్నది వెలుగు చూడాల్సి ఉంది. ఇలాంటి వ్యవహారం ఒక్క సూరాయపాలెంలోనే కాకుండా అనేకచోట్ల జరిగినట్టు తెలుస్తోంది. విజయవాడ నగరంలో కృష్ణలంక పరిధిలో, మొగల్రాజపురం ప్రాంతంలో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నట్టు సమాచారం. జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో పలుచోట్ల ఇలాంటి ఉదంతాలపై విమర్శలు వస్తున్నాయి. జిల్లా ఎన్నికల యంత్రాంగం ఇలాంటి ఘటనలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
 
ఏది మొరాయిస్తే దాన్నే మార్చాలి..
పోలింగ్‌ సిబ్బందికి ఇచ్చిన ప్రత్యేకమైన పుస్తకంలో ఈవీఎంలను మార్చాల్సి వస్తే ఎలాంటి మార్గదర్శకాలను పాటించాలన్న దానిపై స్పష్టంగా పేర్కొన్నారు. ఈవీఎంలలో అంతర్భాగంగా బ్యాలెట్‌ యూనిట్‌, కంట్రోల్‌ యూనిట్‌ ఉంటుంది. ఈ రెండింటికి అనుసంధానంగా వీవీప్యాట్‌ ఉంటుంది. ఈ మూడింటిలో ఏది మొరాయిస్తే దాన్నే మార్చాలని ఎన్నికల కమిషన్‌ నిబంధనలు చెబుతున్నాయి. వీటికి విరుద్ధంగా మొత్తం మూడింటినీ మార్చడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో ప్రధానంగా వీవీప్యాట్లపై ఎక్కువ ఆరోపణలు వస్తున్నాయి. ఇవి పని చేయకపోతే పనిచేసే బ్యాలెట్‌ యూనిట్‌, కంట్రోల్‌ యూనిట్‌లను మార్చాల్సిన అవసరం ఏంటని వారి వాదనగా ఉంది. మైలవరం నియోజకవర్గం పరిధిలో సూరాయపాలెం పోలింగ్‌ బూత్‌ నెంబర్‌ 262లో వీవీప్యాట్‌ సమస్య వచ్చింది. ఉదయం పోలింగ్‌ ఏజంట్ల సమక్షంలో మాక్‌ పోలింగ్‌ను విజయవంతంగానే నిర్వహించారు. సాధారణ ప్రజలు ఓటు వేసే సమయంలో వీవీప్యాట్‌ పని చేయలేదు. సాధారణ ప్రజలను ఓటు వేయటానికి అనుమతించినపుడు తొలి పది మందికి వీవీప్యాట్‌లోని డిస్‌ప్లేలో తామెవరికీ ఓటు వేశారో కనిపించలేదు.
పదకొండో వ్యక్తి ఓటు వేయగా వీవీప్యాట్‌లో కనిపించడం లేదని చెప్పడంతో సమస్యను గుర్తించినట్టు తెలిసింది. ఈవీఎంలో కంట్రోల్‌ యూనిట్‌, బ్యాలెట్‌ యూనిట్‌లు బాగానే ఉన్నా, వీవీప్యాట్‌ పనిచేయలేదని గుర్తించినట్టు సమాచారం. అయితే దాన్ని ఒక్కదానినే మార్చి వేస్తే సరిపోతుంది. కానీ, మొత్తం ఈవీఎంనే మార్చడం గందరగోళంగా ఉంది. దీనిపై విమర్శలు, అనుమానాలు నెలకొంటున్నాయి.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *