చేపల ఎగుమతిపై.. చిన్నచూపు!


  • గుంటూరు జంక్షన్‌ చేపల ఎగుమతి కోటాలో కోత
  • సికింద్రాబాద్‌, విజయవాడలకు ఎక్కువ కేటాయింపు
  • రైల్వే వాణిజ్య విభాగం నిర్ణయంపై భగ్గుమంటున్న చేపల వర్తకులు
గుంటూరు (ఆంధ్రజ్యోతి): రైల్వే కమర్షియల్‌ విభాగం తీసుకొన్న నిర్ణయాలు గుంటూరు రైల్వే డివిజన్‌ పరిధిలోని చేపల వర్తకులకు అశనిపాతంగా మారాయి. ఏళ్ల తరబడి ఇక్కడినుంచి హౌరా వైపునకు చేపల రవాణ జరుగుతుండగా సరకు పంపించే రైళ్లలో గుంటూరు కోటాని తగ్గించేయడంతో ఎలా ఎగుమతి చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఇక్కడి కోటాని ఎత్తేసి రైలు సర్వీసులు పుష్కలంగా ఉన్న సికింద్రాబాద్‌, విజయవాడ జంక్షన్లకు కోటా పెంచడంపై వర్తకులు గగ్గోలు పెడుతు న్నారు. చీఫ్‌ కమర్షియల్‌ మేనేజర్‌ నిర్ణయం వలన వర్తకులతో పాటు చేపలను ఉత్పత్తి చేస్తోన్న రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. గుంటూరు జంక్షన్‌కు జరుగుతున్న అన్యాయాన్ని తాము దక్షిణ మధ్య రైల్వే జోన్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు వాపోతున్నారు.
 
గతంలో రోజుకు తొమ్మిది టన్నులు
నాగార్జునసాగర్‌, శ్రీశైలం, ఆల్మట్టి డ్యాంలలో పలు రకాల చేపల ఉత్పత్తి జరుగుతుంటుంది. పాస్‌దా, బిట్‌కీ, రౌకడ్ల రకాలు ఇక్కడి ప్రజలు భుజించరు. భువనేశ్వర్‌, కటక్‌, ఖరగ్‌పూర్‌, హౌరా తదితర ప్రాంతాల్లో వీటికి అధి కంగా డిమాండ్‌ ఉంది. ఆ ప్రాం తాలకు గుంటూరు మీదగా నిత్యం నడిచే ఏకైక రైలు నెంబరు. 12704 సికింద్రాబాద్‌ – హౌరా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌. 15 ఏళ్లగా ఈ రైలు ద్వారా నిత్యం తొమ్మిది టన్నుల చేపలను ఇక్కడి వర్తకులు ఎగుమతి చేస్తున్నారు. దానిని రెండేళ్ల క్రితం ఐదు టన్నులకు తగ్గించారు. తాజాగా ఆ కోటాలో మరింత కోత పెట్టి నాలుగు టన్నులకు కుదించారు. దీని వలన రైతులు తీసుకొచ్చిన చేపలను సకాలంలో వర్తకులు ఎగుమతి చేయలేకపోతున్నారు. నిజాంపట్నం, చీరాల, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు నుంచి కూడా గుంటూరు జంక్షన్‌కు చేపలు వస్తున్నాయి. అయినప్పటికీ ఇవేమి పరిగణనలోకి తీసుకోకుండా ఇక్కడ తగ్గించిన కోటాని విజయవాడ, సికింద్రాబాద్‌ జంక్షన్‌లకు కేటాయించారు. వాస్తవానికి ఆ రెండు జంక్షన్లు దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో చాలా పెద్దవి. వాటి మీదగా నిత్యం హౌరాకు మరిన్ని రైళ్లు వెళుతుంటాయి. అయినప్పటికీ గుంటూరు మీదగా నిత్యం నడిచే ఏకైక రైలు అయిన ఫలక్‌నుమాలో కోటా ఇవ్వడంపై ఇక్కడి వర్తకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వారంలో నాలుగు రోజులు గుంటూరు మీదగా నడిచే వాస్కోడిగామా – హౌరా అమరావతి ఎక్స్‌ప్రెస్‌లో రెండు టన్నుల కోటా ఇవ్వమని కోరుతుండగా కేవలం అర టన్ను ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. అలానే వారానికి ఒక రోజు గుంటూరు మీదగా నడిచే శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం – హౌరా ఎక్స్‌ప్రెస్‌లో అసలు కోటానే ఇవ్వలేదు.
 
నిబంధనలకు విరుద్దంగా..
ఇదిలావుంటే గుంటూరు నుంచి చెన్నై, బెంగళూరు, హుబ్లీ, ఎర్నాకుళం, త్రివేండ్రం, సేలం, కోయంబత్తూరు, గోవాకు కూడా చేపల ఎగుమతి జరుగుతుంటుంది. గతంలో హైదరాబాద్‌ – తిరువనంతపురం సెంట్రల్‌ శబరి ఎక్స్‌ప్రెస్‌లో ఐదు టన్నుల కోటా గుంటూరుకు ఉండేది. దానిని ఇటీవలే రెండు టన్నులకు తగ్గించేశారు. కేవలం ఒక నిమిషం మాత్రమే హాల్టింగ్‌ సౌకర్యం కలిగిన ఒంగోలుకు నిబంధనలకు విరుద్ధంగా సరుకు ఎగుమతి కోటాని కేటాయించారు. అలానే రేణిగుంటకి కూడా కోటా ఇచ్చారు. రైల్వే తీసుకొన్న ఈ అసంబద్ధ నిర్ణయాల వలన డివిజన్‌ నిత్యం రూ.50 వేలకు పైగా ఆదాయాన్ని కోల్పోతోంది.
 
పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు..
గతంలో విజయవాడ సీనియర్‌ డీసీఎంగా పనిచేసి ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే జోనల్‌ సీసీఎంగా విధులు నిర్వహిస్తున్న అధికారి పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. గుంటూరు డివిజన్‌పై చిన్నచూపు చూస్తున్నారు. దీని వలన చేపల ఎగుమతిపై ఆధారపడిన వర్తకులు, రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. శబరి ఎక్స్‌ప్రెస్‌లో గుంటూరులో ఎగుమతి చేసిన చేపల బాక్సులపై ఒంగోలు అక్కడి సరుకుని డంపింగ్‌ చేస్తున్నారు. దీని వలన సేలం, కోయంబత్తూరు, ఎర్నాకుళంలో ఇక్కడి బాక్సులను అన్‌లోడింగ్‌ చేసుకో లేకపోతున్నారు. కొన్ని సందర్భాల్లో బాక్సులు మిస్సింగ్‌ అవుతున్నాయి. త్వరలో జెడ్‌ఆర్‌యూసీసీ సభ్యులను కలిసి ఈ సమస్యలన్నింటిని వివరిస్తాం.
 
– సయ్యద్‌ ఫజలుర్‌ రెహ్మాన్‌, మర్చంట్‌
 

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *