‘చౌకీదార్ చోర్ హై’ నినాదం కొనసాగుతుంది..: రాహుల్


న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఉద్ధేశించి తాను చేస్తున్న ‘చౌకీదార్ చోర్ హై’ (కాపలాదారే దొంగ) నినాదం ఇకముందు కూడా కొనసాగుతుందని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఆ నినాదం వాస్తవమే అయినందున దానికి తాను కట్టుబడి ఉంటానని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీలో ఇవాళ జరిగిన ఓ మీడియా సమావేశంలో రాహుల్ మాట్లాడుతూ.. ‘‘సుప్రీంకోర్టుకు ఆపాదిస్తూ నేను వ్యాఖ్యలు చేసినందున కోర్టును క్షమాపణ చెప్పాను. ఆ వ్యవహారం సుప్రీంకోర్టులో నడుస్తోంది. అయితే నేను బీజేపీకి గానీ, ప్రధానికి గానీ క్షమాపణ చెప్పలేదు. ‘చౌకీదార్ చోర్ హై’ అన్న మా నినాదం కొనసాగుతుంది…’’ అని పేర్కొన్నారు.
 
నిరుద్యోగం, రైతు సంక్షోభంపైనా రాహుల్ ప్రధానమంత్రిని నిలదీశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని తేలిపోయిందనీ.. దీంతో బెదిరిపోయిన ఆ పార్టీ ఇప్పుడు సైన్యం, సర్జికల్ దాడులంటూ ప్రచారానికి పూనుకుందన్నారు. ‘‘సగానిపైగా ఎన్నికలు అయిపోయాయి. మోదీ ఓడిపోతున్నారని స్పష్టంగా తెలిసిపోతోంది. బీజేపీ ఈ ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమని మాకు స్పష్టమైన అంచనాలు ఉన్నాయి. మోదీ ముఖంలో ఓటమి భయం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా నిరుద్యోగం, రైతు సంక్షోభంతో అల్లాడుతున్నా ప్రధానమంత్రి మాత్రం వీటి గురించి ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. మాట్లాడడానికి ఆయన దగ్గర సమాధానం ఉంటేగా…’’ అని ఎద్దేవా చేశారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *