జగన్ అప్పుడే అక్కడి దాకా వెళ్లారట..!


వైసీపీ శ్రేణులు, నేతలు, నాయకులు ఊహల్లో మునిగితేలుతున్నారు. కౌంటింగ్‌కు ఇంకా నెల రోజులకు పైగానే సమయం ఉందన్న విషయం తెలిసి కూడా ఫలితాలు వచ్చేసినట్టు.. జగన్ సీఎం అయిపోయినట్టు కలలు కంటున్నారు. జగన్ ఏపీ ముఖ్యమంత్రి అంటూ నేమ్ ప్లేట్స్ చేయించుకుంటూ ఆ పార్టీ శ్రేణులు మురిసిపోతున్నారు. ఇదంతా చూస్తోన్న ఏపీ జనం.. ఇదేం అత్యుత్సాహం అంటూ విస్తుపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా ఇలాంటి ఓ ప్రచారమే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే…
 
అధికారంలోకి రావడం ఖాయమని భావిస్తోన్న ప్రతిపక్ష నేత జగన్ అప్పుడే మంత్రివర్గ ఏర్పాటుపై కసరత్తు మొదలుపెట్టారనే ప్రచారం జరుగుతోంది. ఆయా జిల్లాల నుంచి నివేదికలు తెప్పించుకుంటున్నారట. ఈ ప్రచారానికి శ్రీకారం చుట్టింది కూడా వైసీపీ శ్రేణులే కావడం కొసమెరుపు. ఈ ప్రచారంతో ఉలిక్కిపడ్డ కొందరు ఆశావహులు అప్పుడే జగన్‌ను కలిసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారట.
 
వైసీపీ ప్రభుత్వంలో తమకూ ఓ అవకాశం కల్పించాలని జగన్‌కు వినతులు పంపుతున్నారట. ఈ వినతులపై ప్రతిపక్ష నేత జగన్ కూడా ఆలోచనలో పడ్డారట. నియోజకవర్గాల నుంచి అభ్యర్థుల గెలుపోటములపై నివేదిక తెప్పించుకుంటున్నారట. జగన్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే కొందరు ఎమ్మెల్యే అభ్యర్థులు మాత్రం తమకు జగన్ అన్యాయం చేయడని నమ్ముతున్నారట. ఆయన కేబినెట్‌లో చోటు ఖాయమని ఫిక్స్ అయ్యారట. వైసీపీ హడావుడిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
 
వైసీపీ 2014 ఎన్నికల సమయంలో కూడా ఇలాంటి అతి విశ్వాసానికి పోయే భంగపాటుకు గురైందని.. మళ్లీ అదే సీన్ రిపీట్ అయితే వైసీపీ నేతల పరిస్థితి ఏంటోనన్న ఆందోళన ఆ పార్టీలోని కొందరు ఆలోచనాపరులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. టీడీపీ శ్రేణులు మాత్రం వైసీపీ హడావుడి మూణ్ణాళ్ల ముచ్చటగా మిగిలిపోక తప్పదని అంటున్నారు. ఈ ఎన్నికల్లో కూడా తమ పార్టీదే అధికారం అనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ప్రచారాన్ని గమనిస్తోన్న జనం మే 23లోపు ఇలాంటివి ఇంకెన్ని చూడాల్సొస్తుందోనని చర్చించుకుంటున్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *