జనసేన అభ్యర్థులతో ‘ప్రజారాజ్యం’ గురించి పవన్ ఆసక్తికర చర్చ


అమరావతి: జనసేన తరఫున ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేసిన నేతలతో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇవాళ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సమావేశంలో పలు విషయాలు చర్చకు వచ్చాయి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ‘ప్రజారాజ్యం’ గురించి ఆసక్తికర చర్చ జరిగినట్లు తెలుస్తోంది. భేటీ ముగిసిన అనంతరం జనసేన నేత మాదాసు గంగాధర్ మీడియాతో మాట్లాడి సమీక్ష వివరాలు వెల్లడించారు.
 
ప్రజారాజ్యంపైనే చర్చ..!
ప్రజారాజ్యం’ పార్టీపై ఉద్దేశ పూర్వకంగా కుట్రలు చేసిన వైనాన్ని నేటి నేతలకు పవన్ నిశితంగా వివరించారని మాదాసు గంగాధర్ తెలిపారు. అటువంటి ఎదురు దెబ్బల ద్వారా ఎన్నో పాఠాలు నేర్చుకున్నానని పవన్ నేతలకు వివరించారన్నారు. భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకుని ఆదర్శవంతమైన రాజకీయం చేయాలని ఈ సందర్భంగా నేతలకు పవన్ సూచించారని ఆయన తెలిపారు. కాగా అన్న ‘ప్రజారాజ్యం’ పార్టీలాగే తమ్ముడు ‘జనసేన’ను కూడా ఏదో పార్టీలో విలీనం చేస్తారని పుకార్లు, విమర్శలు వస్తున్న నేపథ్యంలో నేతలతో పవన్ ఇవాళ చర్చించినట్లు తెలుస్తోంది.
 
ఓట్ల లెక్కింపు రోజున..!
సమావేశంలో ఎన్నికలలో ఎటువంటి అనుభవాలు ఎదురయ్యాయో అడిగి తెలుసుకున్నారు. నేను, రామ్మోహన్, హరి ప్రసాద్‌లు పార్లమెంటు నియోజకవర్గాలలో తిరిగి అవగాహన సదస్సులు నిర్వహించాం. సమాజంలో మార్పు కోసమే జనసేన ఆవిర్భవించింది. ఈ ఎన్నికలలో ఆ మార్పు కొంతవరకు కనిపించింది. ఇప్పటికే రెండు సమావేశాలు పవన్ నిర్వహించారు. ఓట్ల లెక్కింపు రోజున వీవీ ప్యాట్‌ల లెక్కింపు, ఇతర అంశాలు జాగ్రత్తగా పరిశీలించాలని నేతలకు పవన్ సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నందున పార్టీ బలోపేతం ఫై దృష్టి సారించి, కార్యక్రమాలు నిర్వహిస్తాంఅని మాదాసు గంగాధర్ మీడియా వివరించారు.
 
కాగా.. ఈ సమావేశంలో ఎన్నికల ప్రచారంలో అభ్యర్థుల అనుభవాలు, ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలను పవన్ అడిగి తెలుసుకున్నారు. త్వరలో ఉత్తరాంధ్రలో పవన్ కళ్యాణ్ పర్యటించున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. పర్యటన, పార్టీ కార్యక్రమాలపై ఇవాళ సాయంత్రం లోపు షెడ్యూల్ ఖరారు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మే-23న ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న సంగతి తెలిసిందే.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *