జవాన్లకే ట్రాప్‌


  • మందుపాతర పేల్చిన మావోయిస్టులు
  • కూంబింగ్‌కు వస్తుండగా మెరుపుదాడి
సీలేరు(విశాఖపట్నం జిల్లా), మే 11: ఆంధ్ర-ఒడిసా సరిహద్దు ప్రాంతం(ఏవోబీ)లో కూంబింగ్‌ పార్టీ పోలీసులు లక్ష్యంగా శనివారం మావోయిస్టులు మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో ముగ్గురు స్పెషల్‌ ఆపరేషన్‌ గ్రూపు(ఎస్‌వోజీ) జవాన్లు గాయపడ్డారు. వారిని హెలికాప్టర్‌లో విశాఖపట్నం ఆస్పత్రికి తరలించారు. ఒడిసాలోని మల్కన్‌గిరి జిల్లా మత్తిలి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గల బోడఫోదర్‌ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సమావేశం ఏర్పాటు చేశారనే సమాచారం పోలీసులకు అందింది. వెంటనే ఎస్‌వోజీ పోలీసులు ఒడిసా, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు ప్రాంతం నుంచి కూంబింగ్‌ ప్రారంభించారు. బోడఫోదర్‌ అటవీ ప్రాంతం మీదుగా మత్తిలి వెళ్తుండగా మావోయిస్టులు శక్తివంతమైన మందుపాతరను పేల్చారు. వెంటనే తేరుకున్న ఎస్‌వోజీ దళాలు కాల్పులు జరిపాయి. నక్సల్స్‌ కూడా కాల్పులు జరుపుతూ అటవీ ప్రాంతంలోకి పారిపోయారు. మందుపాతర పేలుడులో పంకజ్‌ దండసేన, పంకజ్‌ నాయక్‌తోపాటు మరో జవాను గాయపడ్డారు. కాగా, కొంతకాలంగా ఏవోబీలో జరుగుతున్న ఎదురుకాల్పుల్లో మావోయిస్టులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో కూంబింగ్‌ బలగాలను దెబ్బకొట్టాలని వ్యూహ రచన చేశారు. ఇందులో భాగంగానే మావోయిస్టులు సమావేశం ఏర్పాటుచేశారనే సమాచారాన్ని పోలీసులకు చేరేలా చేశారు. మావోయిస్టులు ఉనికిని కాపాడుకోవడానికే దాడులకు పాల్పడుతున్నారని మల్కన్‌గిరి జిల్లాఎస్పీ జగ్‌మోహన్‌ మీనా ఆరోపించారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *