జస్టిస్‌ చలమేశ్వర్‌ నో కామెంట్‌!


న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 20: సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల గురించి స్పందించేందుకు ఆయన మాజీ సహచరులు జస్టిస్‌ చలమేశ్వర్‌, జస్టిస్‌ మదన్‌ బి.లోకూర్‌ నిరాకరించారు. మరో మాజీ సహచరుడు జస్టిస్‌ కురియన్‌ జోసెఫ్‌ ఇంట్లో అందుబాటులో లేరు. గత ఏడాది జనవరి 12న ఈ నలుగురూ అసాధారణంగా విలేకరుల సమావేశం పెట్టి అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా మీద తిరుగుబాటు చేశారు. నలుగురిలో ఒకరైన రంజన్‌ గొగోయ్‌ మీద ఆరోపణలు వచ్చినపుడు మిగతా మిత్రులు స్పందించేందుకు నిరాకరించారు. ‘‘నేనెందుకు స్పందించాలి? నేను కామెంట్‌ చేయడానికి ఏమీ లేదు. ఇప్పటికి చాలా మంది అడిగారు. అందరికీ ఇదే సమాధానం’’ అని జస్టిస్‌ చలమేశ్వర్‌ చెప్పారు. ‘‘నేను ఢిల్లీకి దూరంగా బాంబేలో ఉన్నా. ఇప్పటికిప్పుడు ఏమీ తెలియకుండా మాట్లాడలేను’’ అని మదన్‌ బి.లోకూర్‌ అశక్తత వ్యక్తం చేశారు.

సీజేపై తప్పుడు ఆరోపణ
ప్రధాన న్యాయమూర్తి మీద వండి వార్చిన తప్పుడు ఆరోపణ చేశారు. వ్యవస్థను భ్రష్టు పట్టించే చర్యలను గట్టిగా ఖండించాలి. వీటిని ఏ మాత్రం ప్రోత్సహించకూడదు. బార్‌ మొత్తం చీఫ్‌ జస్టిస్‌ వెంటే ఉంది.
– మనన్‌ కుమార్‌ మిశ్రా, బీసీఐ చైర్మన్‌

‘‘సీజేకు మద్దతుగా నిలబడతాం.’’
రాకేశ్‌ ఖన్నా, సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు
సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తితో అంతర్గత విచారణ జరిపించాలి. విచారణకు నిర్దిష్ట గడువు విధించాలి. – వికాస్‌ సింగ్‌, సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు. లైంగిక వేధింపుల కేసు విచారణ జరుగుతుండగా అటార్నీ జనరల్‌ వేణుగోపాల్‌ రావాల్సిన అవసరం ఏమిటి? ఉద్వాసనకు గురైన మహిళ చీఫ్‌ జస్టిస్‌ మీద ఆరోపణ చేస్తే అక్కడ ప్రభుత్వ ప్రతినిధి చేయడానికి ఏం ఉంటుంది? గొగోయ్‌ కూడా ప్రభుత్వానికి సంబంధించిన ఏ కేసునూ తను విచారించకూడదు. ప్రభుత్వం గొగోయ్‌ను అంత గట్టిగా సమర్థిస్తుంటే ఆయనకు ప్రభుత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంటుంది కదా? చీఫ్‌ జస్టిస్‌ వేధించారా? లేదా? అన్నది నువ్వో నేనో తేల్చేది కాదు. ఎంత చిన్న వాళ్లయినా న్యాయ ప్రక్రియ కొనసాగాల్సిందే.
– ఇందిరా జైసింగ్‌, ప్రముఖ న్యాయవాది
న్యాయమూర్తి కోణం నుంచే కాకుండా మహిళ కోణం నుంచి కూడా దర్యాప్తు జరగాలి. న్యాయం జరగాలి.
– రాజీవ్‌ గౌడ, మాజీ ఎంపీ, పనాజీ.
‘‘అసాధారణం, చట్టవిరుద్ధం. సీజే తాను నిందితుడిగా ఉన్న కేసులో బెంచ్‌కు తానే ఎలా నేతృత్వం వహిస్తారు? దానికి తోడు మీడియాకు పరోక్ష హెచ్చరికలు చేశారు. ఏ హక్కుతో చేశారు? జడ్జి మీడియా ముందుకు వెళ్లలేరు. అందుకని తన వాదన చెప్పుకొనేందుకు ధర్మాసనాన్ని వాడుకున్నారు. ఏదో నాలుగు వెబ్‌సైట్లు వార్త రాస్తే న్యాయవ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తికి ముప్పు వచ్చిందనడంలో అర్థం లేదు.
– రాకేశ్‌ ద్వివేదీ, సీనియర్‌ న్యాయవాది
మహిళ బెయిలుపై 24న విచారణ
‘‘సుప్రీంకోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసిన మాజీ ఉద్యోగినికి ఇచ్చిన బెయిలును ఉపసంహరించాలని కోరుతూ ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ మీద 24న నిర్ణయం తీసుకుంటాం’’
– ఢిల్లీ స్థానిక కోర్టు

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *