జీవన యాత్ర


  • విహారం నుంచి వినూత్న ఉపాధి మార్గంలోకి
  • జ్యూట్‌ ఎంటర్‌ ప్రెన్యూర్‌గా ఎదిగిన అపర్ణ
విహారయాత్ర వినూత్న ఆలోచనను పుట్టించింది. అప్పటి వరకు కొనసాగుతున్న రంగాన్ని వదిలి కొత్త రంగాన్ని ఎంచుకోవడానికి అదే కారణమైంది. నార ఉత్పత్తుల తయారీ వైపు నడక మొదలుపెట్టిన ఆమె ఇప్పుడు ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌ అయ్యారు. ఆర్డర్లపై ఆ ఉత్పత్తులకు నయా రూపం ఇస్తున్నారు. వాయిస్‌ ఓవర్‌ ఆర్టిస్ట్‌గా ప్రయాణం ప్రారంభించి వ్యాపారవేత్తగా ఎదిగిన అపర్ణ ఈ వారం తరుణి. 
 
(ఆంధ్రజ్యోతి – విజయవాడ సిటీలైఫ్‌): ఉపాధి అంటే హైదరాబాద్‌ వైపు చూస్తున్న రోజులవి. ఏ రంగంలో నిలదొక్కుకోవాలన్నా, ఉపాధికి మొదటి అడుగు వేయాలన్నా అందుకు భాగ్యనగరమే కనిపించేది. అలా బెజవాడ నుంచి భాగ్యనగరం వెళ్లిన వారిలో ఒకరు దర్శి అపర్ణ. ఇక్కడ విద్యాభ్యాసం పూర్తిచేసిన తర్వాత కుటుంబంతో కలిసి హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. అక్కడ రెండు, మూడు రంగాల్లో పనిచేసేవారు. దానికి తగినట్టు షెడ్యూల్‌ను తయారు చేసుకునేవారు. అందులో అపర్ణ ఎంచుకున్న మరో రంగం మీడియా. ఓ ఎలకా్ట్రనిక్‌ మీడియాలో వాయిస్‌ ఓవర్‌ ఆర్టిస్టుగా పనిచేసేవారు. తర్వాత ఆమె భర్తకు బెజవాడ బదిలీ కావడంతో తిరిగి సొంతగడ్డపై పాదం మోపారు.
 

క్యాంపస్‌కు ఎంపికైనా వద్దనుకుని..
అపర్ణ విజయవాడలోని స్టెల్లా కళాశాలలో 2008వ సంవత్సరంలో ఎంబీఏ చేశారు. ఆ సమయంలో నిర్వహించిన క్యాంపస్‌ ఇంటర్వ్యూలకు ఎంపికయ్యారు. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న పాంజ్‌లాయిడ్‌లో మంచి ఉద్యోగం వచ్చింది. కుటుంబాన్ని వదిలి బెంగళూరులో ఒక్కరే ఉండడం ఆమెకు ఇష్టం లేదు. దీంతో క్యాంపస్‌లో ఎంపికైనా కొలువులో చేరడానికి కాలు కదపలేదు. ఆ తర్వాత వేసవిలో చేసిన విహారయాత్ర అపర్ణలో వినూత్న ఆలోచనను నింపింది. కుటుంబ సమేతంగా ఆమె మనాలి వెళ్లారు. అక్కడ ఏ వస్తువును కొనుగోలు చేసినా పేపర్లలో చుట్టి ఇస్తున్నారు. దీనిపై సందేహం వచ్చిందామెకు. వ్యాపారులను దీనిపై ప్రశ్నించారు. ‘ఇక్కడ అంతా ప్లాస్టిక్‌ ఫ్రీ. ప్లాస్టిక్‌ను ఉపయోగిస్తే జరిమానా తప్పదు.’ అని రాసి ఉన్న బోర్డులను చూపించారు వ్యాపారులు. ప్లాస్టిక్‌ రహిత ఉత్పత్తులను తయారు చేయాలన్న ఆలోచనలకు ఆమెలో బీజం పడింది అక్కడే. తర్వాత షిరిడీ వెళ్లారు.
 
అక్కడ నానో సంచులను చూసి వాటిని తయారు చేయాలనుకున్నారు. ఆ మెటిరీయల్‌ గురించి వాకబు చేయగా, అందులోనూ ప్లాస్టిక్‌ మూలకాలు ఉన్నాయని తెలుసుకున్నారు. ఇది కాకుండా పూర్తిగా పర్యావరణానికి మేలు చేసే ఉత్పత్తుల్నే తయారు చేయాలనుకున్న అపర్ణ జ్యూట్‌ను ఎంచుకున్నారు. దీని గురించి లోతులకు వెళ్లి ఆలోచించారు. చైనా నుంచి యంత్రాలను రప్పించుకుని పరిశ్రమ నెలకొల్పాలంటే రూ.2-3కోట్లు అవుతుందని, ఆ మొత్తాన్ని తట్టుకోలేమనుకుని వెనక్కి తగ్గారు. మెటీరియల్‌ను దిగుమతి చేసుకుని ఉత్పత్తులను తయారు చేస్తే రూ.20లక్షల వరకు వ్యయమవుతుందని తెలుసుకుని ఇదే మంచిదనుకున్నారు. రామవరప్పాడులో నార ఉత్పత్తులను తయారు చేసే పరిశ్రమను 2010లో ఏర్పాటు చేశారు. మొదట్లో కోల్‌కతా నుంచి ముడి సరుకుని దిగుమతి చేసుకున్న అపర్ణ తర్వాత పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు నుంచి రప్పించుకుంటున్నారు.
 
వాటితో చేతి సంచులు, సెల్‌ఫోన్‌ పౌచ్‌లు, డోర్‌మ్యాట్స్‌, ఫైల్స్‌, రిటర్న్‌ గిఫ్ట్స్‌ ప్యాకింగ్‌ కవర్లు తయారు చేస్తున్నారు. ఆర్డర్లు వచ్చిన దాన్ని బట్టి సరుకును మార్కెట్లోకి దింపుతున్నారు. అలా జ్యూట్‌ ఉత్పత్తుల తయారీలో ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదిగిన అపర్ణ ఆ మార్కెట్‌ను పెంచుకోవడానికి అవసరమైన నెట్‌వర్క్‌ను ఉపయోగించుకుని ముందుకు సాగుతున్నారు. బీఎన్‌ఐ (బిజినెస్‌ నెట్‌వర్క్‌ ఇంటర్నేషనల్‌), లయన్స్‌, రోటరీ వంటి సంస్థల్లో సభ్యత్వం తీసుకుని వ్యాపార సామ్రాజ్యాన్ని నలుదిక్కులా పెంచుకుంటున్నారు అపర్ణ.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *