జేసీ దివాకర్ వ్యాఖ్యలపై ఏపీలో ఎలాంటి మంట రేగింది?


ఆయన ఓ సీనియర్ నేత. సంచలనాలకి కేరాఫ్‌ అడ్రస్‌. నాలుగు దశాబ్దాలుగా ఆ నాయకుడు రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. అలాంటి నేత ఇటీవల తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ద్వారా కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు. ఇంతకీ ఇటీవల ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్య ఏంటి? ఆ వ్యాఖ్య ఎలాంటి పరిణామాలకు దారితీసింది? ఆసక్తికర కథనం మీకోసం!
 
   అనంతపురం జిల్లాలో పోలింగ్‌ ముగిశాక రాజకీయ వాతావరణం కొంత చల్లబడింది. అన్ని రాజకీయ పార్టీల నేతలు తాము చేసిన ఖర్చులు, తమకొచ్చే ఓట్ల గురించి లెక్కలు వేసుకుంటున్నారు. ఎన్నికల సమయంలో ఇతర ప్రాంతాల నుంచి ప్రచారం కోసం అనంతకు వచ్చిన కొందరు నాయకులు తట్టాబుట్టా సర్ధుకున్నారు. మరికొందరు ఎండవేడిమి తాళలేక శీతల ప్రాంతాలకు విహారయాత్రల కోసం వెళ్లారు. ఈ సందర్భంగా ఏ నాయకుడిని పలుకరించినా ఏదైనా మాట్లాడాలంటే ఎన్నికల ఫలితాలు వెలువడ్డాకే అని స్పష్టంగా చెప్పేస్తున్నారు.
 
   ఇదిలా ఉంటే, పోలింగ్‌ ముగిసిన వెంటనే అనంతపురం పార్లమెంట్ సభ్యుడు జేసీ దివాకర్‌రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఈ ఎన్నికల్లో మన పార్టీ గెలవబోతోంది అని చెప్పారు. అంతటితో ఆగకుండా.. తాను ఎన్నికల్లో చాలా డబ్బు ఖర్చుపెట్టాల్చి వచ్చిందని మీడియా ముందు చెప్పడం ద్వారా కొత్త వివాదంల్లో చిక్కుకున్నారు. అప్పటివరకు మిన్నకుండిపోయిన ప్రతిపక్ష పార్టీలు వెంటనే అప్రమత్తం అయ్యాయి. జేసీ తాజా వ్యాఖ్యలపై ఎలక్షన్‌ కమిషన్‌కు ఫిర్యాదు చేశాయి. సీపీఐ నేత రామకృష్ణ అయతే ఏకంగా పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలే రద్దుచేయాలంటూ ఎన్నికల సంఘానికి విజ్ఞప్తిచేశారు. దీంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాల్లో మంటలు రాజుకున్నాయి.
 
   నిజానికి ఈ ఎన్నికల్లో జేసీ పోటీచేయలేదు. ఆయన కుమారుడు పవన్‌కుమార్‌రెడ్డి మాత్రమే బరిలో నిలిచారు. ఈ తరుణంలో నష్టనివారణ కోసం జేసీ దివాకర్‌రెడ్డి అప్రమత్తమయ్యారు. తన కుమారుడు పవన్‌కుమార్‌రెడ్డిని రంగంలోకి దించారు. అనంతపురంలోని తన నివాసంలో పవన్‌కుమార్‌రెడ్డి ఇటీవల మీడియా సమావేశాన్ని ఏర్పాటుచేశారు. తన తండ్రి చేసిన వ్యాఖ్యలతో తనకు ఏ సంబంధం లేదని స్పష్టంచేశారు. ఎన్నికల నియమావళిని తాను ఎక్కడా ఉల్లంఘించలేదన్నారు. ఎన్నికల ఖర్చు తగ్గించేలా ఉద్యమం చేయాలంటున్న తన తండ్రి జేసీకి మద్దతు ప్రకటించారు. వచ్చే అయిదేళ్లలో ఖర్చులేకుండా ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోవచ్చుననే అంశంపై అవగాహన కార్యక్రమాలను చేపడతామన్నారు. తొలుత రాష్ట్రస్థాయిలో, ఆ తర్వాత దేశస్థాయిలో ఈ ఉద్యమాన్ని విస్తరిస్తామనీ పవన్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు.
 
   ఇదిలా ఉంటే.. ఎలక్షన్‌ కమిషన్‌ మాత్రం తనదైన పంథాలో స్పందించింది. జేసీ దివాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకుని దీనిపై వివరణ ఇవ్వాలంటూ జిల్లా కలెక్టర్‌ను కోరింది. దీంతో జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ తాడిపత్రి అసెంబ్లీ, అనంతపురం పార్లమెంట్ ఎన్నికల అధికారులను “ఈ విషయంపై పూర్తి వివరాలు సేకరించి తనకు పంపాలని” ఆదేశించారు. ఈ విచారణలో జేసీ దివాకర్‌రెడ్డి ఏమి చెబుతారోననే అంశాన్ని పక్కన పెడితే.. ప్రస్తుతానికి ఆయన సైలెంట్‌ అయిన మాట వాస్తవం.
 
   గత కొన్ని రోజులుగా జేసీ దివాకర్‌రెడ్డి మాటలను గమనిస్తున్న ఆయన అనుచరులు అయోమయానికి గురవుతున్నారు. ఇటీవల పోలీసులపై జేసీ దివాకర్‌రెడ్డి అన్‌ పార్లమెంటరీ పద ప్రయోగం చేశారు. ఆ అంశం కూడా రభసకి దారితీసింది. ఇప్పుడు ఎన్నికల్లో ఏకంగా యాభై కోట్లు ఖర్చుచేశానని మాట్లాడటం ద్వారా తనకు తానే చిక్కులు కొనితెచ్చుకున్నారు. దీంతో అడుసు తొక్కనేల- కాలు కడగనేల అన్న చందంగా తయారైంది ఆయన పరిస్థితి అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. చూద్దాం ఈ సమస్య నుంచి ఆయన ఎలా గట్టెక్కుతారో!

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *