జైలు గోడలెక్కి కిందికి దూకుతామంటూ ఖైదీల హల్‌చల్


తమిళనాడు: మదురై సెంట్రల్ జైలు ఖైదీలకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్‌లో వైరల్‌గా మారింది. జైలు గార్డ్స్‌పై ఖైదీలు రాళ్లు రువ్విన దృశ్యాలు వెలుగులోకొచ్చాయి. రోజూ అర్ధరాత్రి తనిఖీల పేరుతో వేధిస్తున్నారని ఖైదీలు జైలు సిబ్బందిపై ఆగ్రహించారు. సరైన భోజనం కూడా పెట్టడం లేదని ఖైదీలు ప్రధానంగా ఆరోపించారు. కొందరు బ్యారక్ గోడలెక్కి కిందికి దూకుతామని బెదిరించారు. రోడ్డు పక్కనే జైలు ఉండటంతో గోడలెక్కి గొడవకు దిగిన ఖైదీల ఉదంతాన్ని అటుగా వెళుతున్న వారు సెల్‌ఫోన్ కెమెరాల్లో బంధించారు. దీంతో ఈ విజువల్స్ వెలుగులోకొచ్చాయి.
 
ఇదిలా ఉంటే ఆందోళన పేరుతో రెచ్చిపోయిన కొందరు ఖైదీలు జైలు గార్డ్స్‌పై దాడులకు కూడా వెనుకాడటం లేదు. బ్యారక్ గోడలెక్కి రాళ్లు రువ్వుతున్న దృశ్యాలు ప్రస్తుతం నెట్‌లో వైరల్‌గా మారాయి. బ్యారక్‌ల నుంచి బయటికొచ్చి జైలు గోడలెక్కి ఖైదీలు హల్‌చల్ చేశారు. తమను వేధిస్తున్నారంటూ కొందరు జైలు అధికారులపై రాళ్ల దాడి చేశారు. ఈ రాళ్ల దాడిలో పలువురికి గాయాలయ్యాయి. 1865లో మదురై సెంట్రల్ జైలును నిర్మించారు. దాదాపు 31 ఎకరాల్లో ఈ జైలు విస్తరించి ఉంది. దాదాపు 1,200 మంది ఖైదీలు ఈ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *