టీటీడీ జమాఖర్చుల ఆడిటింగ్‌పై హైకోర్టు తీర్పు వాయిదా


  • బయటి వ్యక్తులతో చేయించాలన్న స్వామి
  • ఎఫ్‌ఏసీవో ఆధ్వర్యంలో ఆడిట్‌ జరుగుతోందన్న టీటీడీ
అమరావతి, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో మూడేళ్ల నుంచి జరిగిన జమాఖర్చులపై బయటి వ్యక్తులతో ఆడిటింగ్‌ నిర్వహించాలని, విచారణ కమిటీ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ జరిగేలా ఆదేశించాలని కోరు తూ బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు తన తీర్పును వాయిదావేసింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌, జస్టిస్‌ .సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ జరిపిం ది. ఈ సందర్భంగా స్వామి వాదనలు వినిపిస్తూ.. విరాళాల రూపంలో టీటీడీకి వస్తున్న ధనం అన్యాక్రాంతమవుతోందని, దీనిపై వివరణ ఇవ్వాలని కోరినా టీటీడీ నుంచి గానీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి గానీ స్పందన లేదని పేర్కొన్నారు. టీటీడీలో జవాబుదారీతనం కరువైందన్నారు. ఇటీవల టీటీడీకి చెందిన బంగారాన్ని ఓ వ్యానులో తరలిస్తుండగా తమిళనాడు పోలీసులకు పట్టుబడిందని, దీనిపై సీఎస్‌ విచారణకు కూడా ఆదేశించినట్లు మీడియా ద్వారా తెలుసుకున్నానని తెలిపారు. టీటీడీలో అక్రమాలు జరుగుతున్నాయనడానికి ఇదొక ఉదాహరణగా వ్యాఖ్యానించారు. గతంలో తమిళనాడు, కర్ణాటకలలోని ఆలయాలకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో.. ఆలయాల్లో సమస్యలు తలెత్తినప్పుడు, అక్రమాలు చోటుచేసుకున్నప్పుడు మాత్రమే వాటిని ప్రభుత్వాలు పరిమిత కాలంలో తమ అధీనంలో ఉంచుకుని ఆలనాపాలనా చూడవచ్చని స్పష్టంగా పే ర్కొందన్నారు.
 
ఆలయాల నిర్వహణ ప్రభుత్వాల పని కాదని సుప్రీంకోర్టు చెప్పినా ఏపీ ప్రభుత్వం 83 ఏళ్లుగా టీటీడీపై అజమాయిషీ చేస్తూ నిధుల దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. ఇది సుప్రీంకోర్టు ఆదేశాల ఉల్లంఘన కిందకే వస్తుందన్నారు. దీనికి అడ్వకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ బదులిస్తూ… జమాఖర్చులపై ఆడిట్‌ చేయించాలని అడుగుతున్న పిటిషనర్‌.. దాని గురించి పిటిషన్‌లో పేర్కొనలేదన్నారు. టీటీడీ వ్యవహారాలను పరిశీలించేందుకు ఒక ప్రత్యేక కమిటీ ఉందని, ఆ కమిటీతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని, దాని వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోదని పేర్కొన్నారు. తమ జమాఖర్చులను ఎఫ్‌ఏసీవో ఆధ్వర్యంలోని ఆడిటర్లు పరిశీలిస్తున్నారని టీటీడీ తరఫు న్యాయవాది తెలియజేశారు. అక్రమాలు జరగడానికి అవకాశమే లేదని తెలిపారు. స్వామి స్పందిస్తూ.. ఇప్పటి వరకూ ఒక్క ఆడిట్‌ రిపోర్టు కూడా ఇవ్వలేదని, ఆడిట్‌ రిపోర్టు ఉంటే దానిపై స్ర్కూటినీ ఏదని ప్రశ్నించారు. ప్రజాధనంపై జవాబుదారీతనం లేకుండాపోయిందని, అందువల్ల గత మూడేళ్ల నుంచి టీటీడీలో జరిగిన జమాఖర్చులపై బయటి వ్యక్తులతో ఆడిటింగ్‌ చేయించాలని.. హైకోర్టు నియమించే ప్రత్యేక కమిటీ ఆధ్వర్యంలో ఈ ఆడిటింగ్‌ జరిగేలా మధ్యంతర ఆదేశాలివ్వాలని అభ్యర్థించారు. అందరి వాదనలు విన్న ధర్మాసనం.. తీర్పును వాయిదావేసింది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *