డీఎంకేతో సంబంధాలు లేవు: టీటీవీ దినకరన్‌


చెన్నై: మాజీ ముఖ్యమంత్రులు ఎంజీఆర్‌, జయలలితల హయాం నుంచే డీఎంకేను వ్యతిరేకిస్తున్నామని, అవినీతిని ప్రోత్సహిస్తున్న ఆ పార్టీతో తమకు ఎలాంటి సంబంధాలు లేవని అమ్మా మక్కల్‌ మున్నేట్ర కళగం(ఏఎంఎంకే) ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ స్పష్టం చేశారు. సూలూరు శాసనసభ నియోజకవర్గానికి రానున్న 19వ తేదీన ఉప ఎన్నిక జరగనున్న సందర్భంగా టీటీవీ దినకరన్‌ ఆ నియోజకవర్గాంలో ఏఎంఎంకే అభ్యర్థికి మద్దతుగా బుధవారం ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన ఓటర్లను ఉద్దేశించి మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రభుత్వ ఫలాలు అందాలంటే లంచం పుచ్చుకోవడాన్ని మొట్టమొదట పరిచయం చేసింది డీఎంకే అని, ఆ పార్టీ అధికారంలో ఉన్నన్నాళ్లు రాష్ట్రాన్ని దోచుకుందని, అందువల్లే ఎంజీఆర్‌ అన్నాడీఎంకేను స్థాపించి పేదలకు అండగా నిలిచారన్నారు.
 
ప్రతిఫలం ఆశించకుండా జయలలిత కూడా ఎంజీఆర్‌ లాగే పేదల సంక్షేమాన్ని కాంక్షించారని, ఆ మహనీయులు వున్నంత వరకు డీఎంకేను బద్దశత్రువుగానే చూశారని, వారి ఆశీస్సులతో రాజకీయాల్లో ఎదిగామని, వారికి వెన్నుపోటుపొడిచి ఎన్నడూ డీఎంకేతో చేతులు కలుపబోమని అన్నారు. జయలలిత మరణం అనంతరం ఎడప్పాడి పళనిస్వామిని సీఎం పీఠం ఎక్కించింది శశికళేనని, అయితే ఆమె జైలుకు వెళ్లాక అన్నాడీఎంకేను ఎడప్పాడి పళనిస్వామి బీజేపీకి తాకట్టుపెట్టారని విమర్శించారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *