డీఎస్సీ నియామకాలు ఆలస్యం


  • నియామకాలు ఆలస్యం
  • డీఎస్సీ అపాయింట్‌మెంట్స్‌కు అడ్డంకిగా కోడ్‌
  • 23న ఫలితాలొచ్చే వరకూ ఆగాల్సిందే
  • స్పెషల్‌ ఎడ్యుకేటర్స్‌ వయస్సుపై మెమో రావాలి
  • టీచర్ల ఎంపిక విధానంపైనా జీవో అవసరం
  • జటిలంగా ఇతర విభాగాల సర్టిఫికెట్ల పరిశీలన
అమరావతి, మే 3(ఆంధ్రజ్యోతి): జిల్లా సెలెక్షన్‌ కమిటీ(డీఎస్సీ)ల ద్వారా చేపట్టదలచిన ఉపాధ్యాయ నియామకాలు ఆలస్యం కానున్నాయి. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండటం, గతానికి భిన్నంగా పలు ఇతర ప్రభుత్వ విభాగాలు ప్రస్తుత డీఎస్సీ నోటిఫికేషన్‌లో కలిసి ఉండటం, స్పెషల్‌ ఎడ్యుకేటర్స్‌ వయోపరిమితి పెంపు తదితర అంశాలను పరిగణనలోనికి తీసుకోవాల్సి రావడమే ఇందుకు కారణమని పాఠశాల విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల కోడ్‌ ఈ నెల 23 వరకూ అమల్లో ఉందన్న అభిప్రాయంతో అప్పటి దాకా సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ చేపట్టేందుకు సంబంధిత విభాగాలు ముందుకు రావడం లేదని సమాచారం. గత డీఎస్సీలలో కేవలం పాఠశాల విద్యకు సంబంధించిన పోస్టులతోనే డీఎస్సీ నిర్వహించినందున వివిధ ప్రక్రియలు షెడ్యూల్‌ ప్రకారమే పూర్తయ్యేవి. కానీ ఈ సారి సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ గురుకుల విద్య తదితర విభాగాల నుంచి కూడా సమాచారం రావాల్సి ఉండటంతో ఆలస్యం అనివార్యంగా మారినట్లు తెలుస్తోంది.
 
స్పెషల్‌ డీఎస్సీకి సంబంధించి స్పెషల్‌ ఎడ్యుకేటర్స్‌ వయోపరిమితి పెంపు విషయమై ఇప్పటికే ఈసీ క్లియరెన్స్‌ కోసం లేఖ రాశారు. క్లియరెన్స్‌ రాగానే ప్రభుత్వం మెమో ఇవ్వాల్సి ఉంది. టీచర్ల సెలెక్షన్‌ ప్రాసెస్‌ ఎలా చేయాలి… అన్న దానిపైనా ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియలన్నీ పూర్తయ్యేందుకు మరింత సమయం పడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. డీఎస్సీ-2018 నియామకాలు మే 15 నాటికి పూర్తిచేయాలని పాఠశాల విద్యాధికారులు తొలుత కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకున్నారు. మొత్తం 8,504 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం డీఎస్సీ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఇందులో 7,902 పోస్టులు జనరల్‌ డీఎస్సీలో నోటిఫై చేసినవి కాగా, 602 పోస్టులు స్పెషల్‌ డీఎస్సీలో నోటిఫై చేసిన పోస్టులు ఉన్నాయి. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే లోగానే నియామకాలు, శిక్షణ కార్యక్రమం పూర్తి చేయాలని సంకల్పించారు. కొత్త టీచర్లకు మే 29 నుంచి జూన్‌ 9 వరకు శిక్షణ ఇవ్వాలని భావించారు. పాఠశాలలు పునఃప్రారంభమయ్యే జూన్‌ 12న కొత్త టీచర్లు విధుల్లో చేరేలా ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
 
జనరల్‌ డీఎస్సీ-2018లో నోటిఫై చేసిన 7902 టీచర్‌ పోస్టులకు మొత్తం 6,08,155 మంది దరఖాస్తుచేసుకున్నప్పటికీ వారిలో 5,05,547 మంది పరీక్ష రాశారు. మొత్తం 52 కేటగిరీల్లో టీచర్ల పోస్టులు ఉండగా .. జనరల్‌ మెరిట్‌ లిస్టులను విడుదల చేశారు. జనరల్‌ మెరిట్‌ లిస్టుల నుంచి జిల్లాలవారీగా రోస్టర్‌ కమ్‌ రిజర్వేషన్‌ పాయింట్లు, స్థానిక రిజర్వేషన్‌ తదితర అంశాలను పరిగణనలోనికి తీసుకుని మెరిట్‌ ప్రాతిపదికన తుది సెలెక్షన్లు చేపట్టాల్సి ఉంది. తాజా పరిస్థితులను బట్టి చూస్తే… పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికి డీఎస్సీ నియామకాలు పూర్తిచేయడం కష్టమే. ఈ నెల 23న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పాటు కావడానికి కొంత సమయం పడుతుంది. ఆ తర్వాత ప్రభుత్వ అభిమతం మేరకు పాఠశాల విద్యాధికారులు వ్యవహరించాల్సి ఉంటుంది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *