తుఫాను పోయింది.. అనుమతి వచ్చింది


  • ఉత్తరాంధ్ర, తూర్పున కోడ్‌ సడలింపు
  • ఈ మినహాయింపునకు గడువు లేదు
  • రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి స్పష్టీకరణ
  • ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’పై కోడ్‌ ఉల్లంఘన
  • నివేదిక రాగానే కడప జేసీపై చర్యలు
  • సీఈసీ ద్వివేది వెల్లడి
అమరావతి/న్యూఢిల్లీ, మే 3 (ఆంధ్రజ్యోతి): గత నాలుగు రోజులుగా ఫణి తుఫాను నవ్యాంధ్రను వణికించింది. సహాయ, పునరావాస చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించేందుకు ఎన్నికల కోడ్‌ అడ్డంకిగా మారింది. తుఫాను నేపథ్యంలో ప్రభావిత జిల్లాల్లో సహాయ చర్యలు చేపట్టేందుకు నియమావళిని సడలించాలని ఆయన కేంద్ర ఎన్నికల కమిషన్‌(సీఈసీ)కి లేఖ రాశారు. రాష్ట్రంలో పోలింగ్‌ గత నెల 11నే ముగిసిపోయినా.. సీఎం, మంత్రుల సమీక్షలను అడ్డుకుంటున్న ఈసీ.. సీఎం వినతిని పట్టించుకోనేలేదు. ఇప్పుడు తుఫాను రాష్ట్రాన్ని దాటిపోయిందని తెలియగానే.. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో కోడ్‌ను సడలిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీచేయడం గమనార్హం.
 
సహాయ, పునరావాస చర్యలు ముమ్మరంగా చేపట్టేందుకు ఈసీ ఈ నిర్ణయం తీసుకుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) గోపాలకృష్ణ ద్వివేది సచివాలయంలో వెల్లడించారు. కోడ్‌ మినహాయింపునకు ఎలాంటి గడువు విధించలేదని స్పష్టం చేశారు. ఈ నెల 23వ తేదీన జరిగే కౌంటింగ్‌కు సంబంధించి 7వ తేదీన సచివాలయంలో రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు నిర్వహిస్తాన్నారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఈవీఎంలు దెబ్బతినకుండా ముందుగానే ఏర్పాట్లు చేశామని.. వర్షపు నీరు చొరబడకుండా టార్పాలిన్లు ఏర్పాటు చేశామని చెప్పారు. స్ట్రాంగ్‌ రూమ్‌లు సురక్షితంగా ఉన్నాయని.. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని, ఎలాంటి వదంతులనూ నమ్మవద్దని కోరారు.
 
ఆ థియేటర్ల లైసెన్సులు రద్దు
‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్ర ప్రదర్శన విషయంలో కడప జిల్లాలో కోడ్‌ ఉల్లంఘన జరిగిందని ద్వివేది తెలిపారు. సంబంధిత అధికారులు నిబంధనల అమలు విషయంలో బాధ్యతారహితంగా ప్రవర్తించారని.. సున్నితమైన ఈ అంశంపై ఏప్రిల్‌ 10వ తేదీనే సీఈసీ ఉత్తర్వులు విడుదల చేసినా.. వాటికి అనుగుణంగా అధికారులు నడుచుకోలేదని తప్పుబట్టారు. కడప జిల్లా జాయింట్‌ కలెక్టర్‌(జేసీ)పై చర్యలు తీసుకోవాలని సీఈసీకి సిఫారసు చేశామన్నారు. చిత్రాన్ని ప్రదర్శించిన థియేటర్ల యాజమాన్యాలపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయని, థియేటర్ల లైసెన్సులు రద్దు చేయాలని కూడా కలెక్టర్‌ను ఆదేశించామని చెప్పారు. ఈ చిత్ర ప్రదర్శనకు సంబంధించి నిర్మాతపై చర్యల గురించి పరిశీలించాల్సి ఉందన్నారు. అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యలపై ఆ జిల్లా అధికారులు విచారణ చేపట్టినట్లు తెలిసిందని, వారు ఇచ్చిన నివేదిక ఆధారంగా తాము చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *