దారికొచ్చారు


  • ఎస్వీఎస్‌ జంక్షన్‌ దారి లేకపోవడంపై స్పందించిన కలెక్టర్‌
  • రోడ్డు భద్రతకు విఘాతం కలిగే అవకాశముందన్న ఎన్‌హెచ్‌ పీడీ
  • దారి ఇవ్వాలని ఇంతియాజ్‌ నిర్ణయం 
  • హర్షం వ్యక్తం చేసిన ప్రజలు
ఎస్వీఎస్‌ జంక్షన్‌కు దారి కల్పించాలని కలెక్టర్‌ నిర్ణయించారు. ప్రజల ఇబ్బందులను అధికార యంత్రాంగమే పరిష్కరించాలన్న కార్యోక్తిని ఆయన చేసి చూపారు. పటమటలంక, యనమలకుదురు, రామలింగేశ్వరనగర్‌ ప్రజలు డిమాండ్‌ చేస్తున్నట్టుగానే ఎస్వీఎస్‌ జంక్షన్‌ దగ్గర అప్రోచ్‌ మార్గంలో దారి కల్పించాలని నిర్ణయించారు. ఈ దారి భారీ వాహనాలకు కాకుండా ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాల వినియోగానికే పరిమితం చేశారు. దీనికి స్థానికులూ అంగీకరించారు. భారీ వాహనాలకు ఏ1 , పీ2 పిల్లర్ల మధ్య వెళ్లేందుకు వీలుగా వెంట్‌ ఇవ్వాలని నిర్ణయించారు. ఎన్‌హెచ్‌ సంస్థ, పోలీసు శాఖ రోడ్డు భద్రతా అంశాలను తెరపైకి తెచ్చినా.. కలెక్టర్‌ ప్రజా పక్షమే వహించారు. పటమటలంక ప్రజలు ఎదుర్కొంటున్న ఎస్వీఎస్‌ జంక్షన్‌ దారికిఇబ్బందులపై ఆంధ్రజ్యోతి ప్రచురిస్తున్న వరుస కథనాలకు స్పందన లభించింది.
 
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) కలెక్టర్‌ ఇంతియాజ్‌ శనివారం సాయంత్రం బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌ను పరిశీలించారు. పటమటలంక ప్రజలూ పెద్ద సంఖ్యలో ఎస్వీఎస్‌ జంక్షన్‌కు చేరుకున్నారు. కలెక్టర్‌ సందర్శనకు జాతీయ రహదారుల సంస్థ, రవాణా, పోలీసు, రెవెన్యూ, కార్పొరేషన్‌ శాఖల అధికారులు హాజరయ్యారు. కలెక్టర్‌ ఎస్వీఎస్‌ జంక్షన్‌కు రాగానే పటమటలంక, యనమలకుదురు, రామలింగేశ్వరనగర్‌ ప్రజలు తమ ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకు వచ్చారు. పటమటలంక నుంచి ఎస్వీఎస్‌ జంక్షన్‌కు కలిసే దారిని పరిశీలించారు.
 
ఇక్కడ నివాసముంటే తెలుస్తుంది
వెంటనే అక్కడ ఉన్న ఎన్‌హెచ్‌ పీడీ విద్యాసాగర్‌ను ఉద్దేశించి నేను కానీ, మీరు కానీ ఇక్కడ నివసిస్తే.. ఇటుగా వెళ్లటానికి ఇబ్బంది ఎదురౌతుంది కదా అని ప్రశ్నించారు. తద్వారా దారి ఇవ్వడం సమంజసమేనన్న భావనను కలెక్టర్‌ వ్యక్తం చేశారు. దీనికి ఎన్‌హెచ్‌ పీడీ తన దగ్గర ఉన్న మ్యాప్‌ను చూపిస్తూ పటమలంక ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏ 1, పీ 2 పిల్లర్ల మధ్య 30 మీటర్ల విస్తీర్ణంలో దారి కల్పించామని, మంచి జంక్షన్‌ అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ మార్గంలో మెలికలు తిరిగి వెళ్లాలి, అది ప్రజలకు ఇబ్బందే కదా అని కలెక్టర్‌ ప్రశ్నించారు. దారి నేరుగా ఉండాలి కానీ, వంపులు తిరిగి ఉండకూడదని కలెక్టర్‌ స్పష్టం చేశారు.
 
భద్రతా సమస్యలకు ఆస్కారం..
ఇక్కడ వెంట్‌ ఇస్తే రోడ్డు భద్రతకు ఇబ్బందికరంగా ఉంటుందని ఎన్‌హెచ్‌ పీడీ విద్యాసాగర్‌ కలెక్టర్‌తో చెప్పారు. ఇదే సందర్భంలో ట్రాఫిక్‌ డీసీపీ వై రవిశంకర్‌ రెడ్డి ఎన్‌హెచ్‌ పీడీకి మద్దతుగా రోడ్డు భద్రతా సమస్యలు వస్తాయని చెప్పారు. ప్రమాదాలకు ఆస్కారంగా ఉంటుందని కలెక్టర్‌ దృష్టికి తీసుకు వచ్చారు. దీనిపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫ్లై ఓవర్‌ మీదుగా సగం ట్రాఫిక్‌ వెళ్లిపోతుందని, బందరు నుంచి వచ్చే వాహనాలు మాత్రమే కింద నుంచి వెళతాయి కాబట్టి ప్రమాదకరంగా ఉండదని స్థానికులు వాదించారు. కలెక్టర్‌ డీటీసీ ఈ మీరా ప్రసాద్‌తో మాట్లాడి ప్రమాదకరంగా ఉండే అవకాశాలు ఉన్నాయా అని ఆరా తీశారు. స్థానిక ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ద్విచక్రవాహనాలు, కార్ల వరకు దారి ఇస్తే సమస్య లేదని, ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ ఎలాగూ ఉన్నాయి కాబట్టి ఇబ్బంది ఉండదని డీటీసీ మీరా ప్రసాద్‌ చెప్పారు. సబ్‌ కలెక్టర్‌ మిషాసింగ్‌ ఎన్‌హెచ్‌ సూచించే మార్గంలో భారీ వాహనాలు, ఎస్వీఎస్‌ జంక్షన్‌ దగ్గర తేలికపాటి వాహనాలను అనుమతిస్తే ఇబ్బందులు ఉండవని కలెక్టర్‌కు చెప్పారు.
 
ఏ 1, పీ 2 పిల్లర్ల మధ్యలో ..
ఎన్‌హెచ్‌ పీడీ, ట్రాఫిక్‌ డీసీపీలిద్దరితో ప్రజల సమస్య కోణంలో ఆలోచించాలని, వారు కోరుతున్నట్టుగానే దారి కల్పిద్దామని కలెక్టర్‌ అన్నారు. ఎస్వీఎస్‌ జంక్షన్‌ దగ్గర ద్విచక్రవాహనాలు, నాలుగు చక్రాల వాహనాలకు దారి కల్పిద్దామని చెప్పారు. ఎన్‌హెచ్‌ అధికారులు చెప్పినట్టుగా ఏ1, పీ 2 పిల్లర్ల మధ్యన భారీ వాహనాలకు దారి కల్పిద్దామని నిర్ణయించారు. కలెక్టర్‌ దారి ఇవ్వాలని నిర్ణయించడంతో ఎన్‌హెచ్‌ పీడీ, ట్రాఫిక్‌ డీసీపీ మౌనం దాల్చారు.
 
రెండు నెలల పాటు సమీక్ష..
మిగిలిన విషయాలు ఉన్నతాధికారుల స్థాయిలో చర్చించుకుందామని నిర్ణయించారు. అధికారుల మధ్య భద్రత అంశం చర్చకు వచ్చింది. దారి కల్పిస్తే ఇక్కడ ప్రమాదాలకు ఆస్కారం ఉందా, లేదా అన్న దానిపై రెండు నెలల పాటు సమీక్ష చేద్దామని కలెక్టర్‌ చెప్పారు. ప్రమాదకరంగా ఉంటే మూసేద్దామని, లేకుంటే వదిలేద్దామని చెప్పారు. దారి కల్పించే అంశానికి సంబంధించిన ప్రజల నుంచి వస్తున్న అభ్యర్థనలను కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లాలని నిర్ణయించారు.
 
వెనకడుగుకు ఖర్చే కారణమా?
ఎస్వీఎస్‌ జంక్షన్‌ దగ్గర దారికి రూ.2 – 5 కోట్లు ఖర్చు అవుతుందని తెలుస్తోంది. ఎన్‌హెచ్‌ సంస్థ వెనకడుగు వేయటానికి ఇదే కారణమని తెలుస్తోంది. ఇది కేంద్ర ప్రాజెక్టు కావడంతో, ప్రాజెక్టు చివర దశలో కేంద్రం దీనికి అనుమతి ఇస్తుందా లేదా అన్నది అనుమానంగా ఉంది. కేంద్రానికి తెలియకుండా చేస్తే కాంట్రాక్టు సంస్థకు బిల్లులు వచ్చే పరిస్థితి ఉండదు. దీంతో ఎన్‌హెచ్‌ సంస్థ సేఫ్టీని చివరగా తెరమీదకు తీసుకు వచ్చింది. ఇప్పుడీ నిధులను ఎవరు ఇస్తారన్నది ప్రశ్నగా ఉంది. జిల్లా యంత్రాంగం ఈ మొత్తాన్ని భరించగలదా? రాష్ట్ర ప్రభుత్వం ద్వారా భర్తీ చేయిస్తారా? అన్నది చూడాల్సి ఉంది. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఉన్నతాధికారుల స్థాయిలో చర్చించుకుంటామని కలెక్టర్‌ ఆంధ్రజ్యోతితో చెప్పారు.
 
సమస్యకు తెరదించాం
ఆరు నెలలుగా ఈ దారికి సంబంధించి సమస్య తేలకపోవడంతో ఫ్లై ఓవర్‌ ను పూర్తి చేసే విషయంలోనూ జాప్యం జరుగుతోంది. 30 వేల మంది ప్రజల సమస్య ఇది. క్షేత్రస్థాయిలో సమస్యను గుర్తించాం. తేలికపాటి వాహనాలకు తిరగడానికి వీలుగా దారి కల్పించాలని నిర్ణయించాం. – ఎండీ ఇంతియాజ్‌, కలెక్టర్‌
 
అందుకే ఆందోళన చేశాం
పటమటలంక ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్ర సమస్య కావడంతోనే మేము ఆందోళన చేశాం. దారి మూసుకు పోతే అదనంగా ట్రాఫిక్‌ సమస్యలు ఏర్పడడానికి అవకాశం ఉంది. తేలికపాటి వాహనాలకు దారి కల్పించాలన్న కలెక్టర్‌ నిర్ణయం సంతోషకరం.
– వైవీ ఈశ్వరరావు, స్థానికుడు
 
ఆర్థిక అంశాలపై స్పష్టత అవసరం
కలెక్టర్‌ క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి పటమటలంక ప్రజలకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నాం. ప్రజాపక్షం వహించినందుకు సంతోషిస్తున్నాం. ఎన్‌హెచ్‌ సంస్థ ఆర్థిక అంశాలపైన ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. వాటిపైన స్పష్టత వస్తే మంచిది.
– చెన్నుపాటి గాంధీ, స్థానికుడు

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *