దారి ఆక్రమణ!


  • పుట్‌పాత్‌లను మూసేస్తున్న బడా వ్యాపారులు
  • బందరు, ఏలూరు రోడ్లపై కానరాని సైడు కాల్వలు
  • వ్యాపార కేంద్రాలు, పార్కింగ్‌ జోన్లుగా ఫుట్‌పాత్‌లు
  • కాసుల కక్కుర్తిలో కార్పొరేషన్‌ అధికారులు
ఆంధ్రజ్యోతి, విజయవాడ: సైడు కాల్వలకు ర్యాంపులు కట్టేస్తున్నా.. వేల కళ్లున్న కార్పొరేషన్‌ గుడ్డిదైపోయింది. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించేస్తున్నా పోన్లే అని సరిపెట్టేస్తోంది. ఇంటి నిర్మాణాల్లో కూసింత డీవియేషన్‌ ఉన్నా.. తొలగింపులకు తెగపడే టౌన్‌ప్లానింగ్‌ అధికారులకు బంద రు, ఏలూరు రోడ్లపై బహిరంగంగా ఆక్రమించిన బడా బాబుల ఆగడాలు మాత్రం కనిపించడంలేదు.
 
కాల్వల్లో పూడిక తీతకు వీలుగా ఏర్పాటు చేసిన ఓపెన్‌ డ్రెయిన్ల ర్యాంపులు, మెట్లు నిర్మింపజేస్తున్న షాపింగ్‌ మాల్స్‌, బహుళ జాతి సంస్థలు, హోటళ్లు ఇలా ఒకటి రెండు కాదు.. నగరంలోని కొన్ని వందల వ్యాపార సంస్థలు అత్యాశకు ఫుట్‌పాత్‌లు బలవుతు న్నాయి. బీద బిక్కి నిర్మించే బడ్డీ కొట్లపై తప్ప కన్నెర్ర చేయలేని అధికారులపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అదేంటని అడిగే అధికారులను నోట్లతో కప్పి పుచ్చే వ్యాపారులున్నంత వరకు ఈ కాల్వల ఆక్రమణ నానాటికీ నగరాన్ని మింగేస్తూనే ఉంటుందని నగర ప్రజలు వాపోతున్నారు.
 
నగరంలోని రెండు లక్షల తొమ్మిదివేల నివాసాల నుంచి విడుదలవుతోన్న చెత్త, వ్యర్థాలన్నీ అంతర్గత రోడ్లలోని సైడు కాల్వల గుండా ప్రధాన రహదారుల్లోని ఓపెన్‌ డ్రెయిన్లలో కలిసి ప్రధాన డ్రెయిన్లకు చేరుతుంటాయి. ఈ క్రమంలో సైడు కాల్వలన్నీ ఓపెన్‌గా ఉండటంతో కాల్వల పూడిక తీతకు పారిశుధ్య సిబ్బందికి వీలుం టుంది. కానీ ప్రధాన కాల్వల్లో పేరుకుపోయే చెత్త తొలగింపులకు చప్టాలను ఏర్పాటు చేస్తారు. అవసరమైనపుడు చప్టాలను తొలగించి కాల్వల్లో పూడికలను తీస్తుంటారు. కానీ ఆయా చప్టాలకు ఆవలి వైపున నిర్మించే బడా వ్యాపార నిర్మాణాల్లోకి రాకపోకల నిమిత్తం ఈ ఫుట్‌పాత్‌లు ఆక్రమణకు గురవుతున్నాయి. చప్టాలు కనిపించకుండా రోడ్లపై వరకు ర్యాంపులు, మెట్లు నిర్మించేస్తున్నారు. తద్వారా కొన్నిచోట్ల రోడ్లు కూడా కుచించుకుపోయి ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతున్నాయి. బడా వ్యాపారస్తులే చేయగా లేనిది తామేం తక్కువ తిన్నామా? అని బడ్డీ కొట్లు, కిరాణా కొట్ల నిర్వాహకులు కూడా రోడ్లపైకి, కాల్వలపైకి వచ్చి దుకాణాలు పెట్టుకుంటున్నారు. రాజధాని దృష్ట్యా రోడ్ల విస్తరణ కోసం కార్పొరేషన్‌ వేల కోట్లు వెచ్చించి పనులు చేస్తుండగా మరో వైపు ఈ ఆక్రమణలు ప్రభుత్వ ఆలోచనలను వెక్కిరి స్తున్నాయి. ఎండ్‌ టూ ఎండ్‌ రోడ్డు నిర్మాణా ల్లోనూ ఈ ఆక్రమణలు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న వేళ కార్పొరేషన్‌ కిమ్మన కుండటం గమనార్హం.
 
పైసా వసూల్‌
ఫుట్‌పాత్‌లపై నిర్మాణాలు చేపట్టిన ప్రాంతాల్లో పనిచేసే ప్రతీ వీఎంసీ ఉద్యోగికి ఈ ఫుట్‌పాత్‌ ఆక్రమణలు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. నెల నెల వసూళ్లకు పాల్ప డుతూ అనధికారిక ఆమోదాలు పలుకు తున్నారు. ఆయా నిర్మాణాలపై జె.నివాస్‌ కమిషనర్‌గా ఉండగా బందరు రోడ్డులోని వాటర్‌ ట్యాంకు రోడ్డు వద్ద గల ఓ ప్రముఖ వస్త్ర దుకాణం ఎదురుగా ఉన్న ఫుట్‌పాత్‌ను ఆక్రమించి ర్యాంపు నిర్మించారు. దీనిపై స్పందించిన ఆయన తక్షణమే చర్యలు తీసుకుని పరిష్కరించారు. ప్రస్తుత నేపథ్యం లో సమస్యలపై స్పందన అటుంచితే ఫిర్యాదుల్ని కూడా పట్టించుకోలేని అధికా రులు ఎన్నికల కోడ్‌ మాటున దోబూచులా డుతున్నారు. ఈ క్రమంలో ఫుట్‌పాత్‌ ఆక్రమణలను సమస్యల స్రవంతిలో కలిపే యడమే తప్ప పరిష్కరించే తీరిక అధికారు లకు లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *