నంబర్‌వన్‌ కూలీ చంద్రబాబు


మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు
టీడీపీ ఆధ్వర్యంలో మేడే వేడుకలు
 
విజయవాడ (విద్యాధరపురం) : రాష్ట్రంలో నంబర్‌వన్‌ కూలీ చంద్రబాబు అని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కొనియాడారు. టీడీపీ అనుబంధ సంస్థ టీఎన్‌టీయూసీ అర్బన్‌ అధ్యక్షుడు రఘురామరాజు ఆధ్వర్యంలో బుధవారం ఎంజీ రోడ్డులోని అమరావతి ఫంక్షన్‌ హాలులో మేడే వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఉమా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కార్మికుల కోసం చంద్రన్న బీమా పథకం అమలుచేస్తున్నారని, దీనిపై దేశంలో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడుతున్నారని తెలిపారు. చంద్రన్న బీమా పథకం ద్వారా కార్మికులకు సుమారు రూ. 2,400 కోట్లు పైగా అందించినట్లు చెప్పారు. ఎమ్మెల్సీ, టీడీపీ అర్బన్‌ అధ్యక్షుడు బుద్దా వెంకన్న మాట్లాడుతున్న పేదల హృదయాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టనున్నట్లు చెప్పారు.
 
ఎమ్మెల్సీ, జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు మాట్లాడుతూ కార్మికుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. కనీస వేతనాల బోర్డు చైర్మన్‌ రామ్మోహన్‌ మాట్లాడుతూ అప్పులలో ఉన్న అనేక పరిశ్రమలను ఆదుకుని, కార్మికులకు జీవనోపాధి కల్పించిన కార్మికనేత చంద్రబాబు అని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలో కార్మికులకు ఏమి చేయలేదని, ఎన్టీఆర్‌ నుంచి టీడీపీ కార్మికులకు అండగా ఉంటోందని తెలిపారు. కార్మిక సంక్షేమ మండలిని ఏర్పాటుచేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనన్నారు. తొలుత ముఖ్యఅతిథి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు ఆటో డ్రైవర్లను సన్మానించారు. కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి కార్మికుల సమక్షంలో కేక్‌ కట్‌ చేశారు. టీడీపీ రాష్ట్ర నేత వర్ల రామయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఏపీ పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కె.నాగుల్‌మీరా, నగర మేయరు కోనేరు శ్రీధర్‌, డిప్యూటీ మేయర్‌ రమణారావు, దుర్గగుడి కమిటీ చైర్మన్‌ యలమంచిలి గౌరంగబాబు, నేతలు గన్నె ప్రసాద్‌, కాట్రగడ్డ మల్లేశ్వరరావు, పలువురు కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *