నాకున్నది ఒకటే ఓటర్ ఐడీ : గౌతమ్ గంభీర్


న్యూఢిల్లీ: రాజకీయాల్లోకి అడుగుపెట్టగానే వరుస చిక్కులు ఎదుర్కొంటున్న మాజీ క్రికెటర్, ఈస్ట్ ఢిల్లీ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి గౌతమ్ గంభీర్ తన ఓటర్ ఐడీ విషయంలో స్పష్టత ఇచ్చారు. తనకు రెండు ఓటర్ ఐడీలు లేవని, ఢిల్లీలోని రాజేంద్ర నగర్ నుంచి మాత్రమే తనకు సింగిల్ ఓటర్ ఐడీ ఉందని మంగళవారంనాడు తెలిపారు. రెండు ఓటర్ ఐడీలున్న గౌతమ్ గంభీర్‌పై అనర్హత వేటు వేయాలంటూ ఈస్ట్ ఢిల్లీ ఆప్ అభ్యర్థి అతిషి వేసిన పిటిషన్‌పై మే 1న కోర్టు తొలి విచారణ జరుగనున్న నేపథ్యంలో గౌతమ్ తాజా వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది.
 
అతిషి ఆరోపణలను రెండ్రోజుల క్రితం కూడా గౌతమ్ గంభీర్ తోసిపుచ్చారు. అయితే, ఇంత సూటిగా ఆయన స్పందించలేదు. సరైన దిశానిర్దేశం లేకనే ఆమ్ ఆద్మీ పార్టీ ‘ప్రతికూల రాజకీయాల’కు పాల్పడుతోందని ఆయన విమర్శించారు. ఆ పార్టీకి సరైన విజన్ లేదని, గత నాలుగైదేళ్లుగా ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. ఎన్నికల కమిషనే ఈ విషయంలో (ఓటర్ ఐడీలు) నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. అయితే, తమకు సరైన విజన్ లేదంటూ గౌతమ్ గంభీర్ చేసిన వ్యాఖ్యలపై అతిషి మరింత ఘాటుగా స్పందించారు. ఈస్ట్ ఢిల్లీకి నాలుగైదేళ్లుగా మీరేం చేశారని మీకు బీజేపీ టిక్కెట్ ఇచ్చిందో చెప్పాలన్నారు. ఆప్‌కు ఉన్న విజన్‌పై చర్చకు రావాలంటూ సవాలు చేశారు. దీనికి గౌతమ్ స్పందిస్తూ, డిబేట్లపై తనకు నమ్మకం లేదన్నారు. ఆయన స్పందనను అతిషి మరోసారి విమర్శిస్తూ ‘డిబేట్లపై నమ్మకం లేనివాళ్లు రాజకీయాల్లోకి ఎలా వచ్చారు?’ అంటూ గౌతమ్‌ను నిలదీశారు.
 
పత్రికా ప్రకటనలో గౌతమ్.. కస్సుమన్న ఈసీ
కాగా, గౌతమ్ గంభీర్ మంగళవారంనాడు సైతం మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఓ జాతీయ దినపత్రికలో ప్రచురించిన ప్రకటనలో గౌతమ్ కనిపించడంపై ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమేనంటూ గౌతమ్ గంభీర్‌కు నోటీసు ఇచ్చారు. క్రికెట్ గేమ్ అప్లికేషన్ – క్రిక్ ప్లేకు సంబంధించిన యాడ్ ఈనెల 26న ప్రచురితమైంది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *