నాట్యవేదం.. విశ్వనాథం..


నాట్యమే జీవంగా.. జీవన వేదంగా.., అంగభంగిమలు.. హావభావాలే ఉచ్ఛ్వాసనిశ్వాసాలుగా ఆయన వేసే ప్రతి అడుగూ ఆధునికతకు అద్దం పడుతుంది. కూచిపూడి, భరతనాట్యంలోనే కాకుండా జానపదంలో జ్ఞానపథాన్ని చూపిస్తూ.. మువ్వల మోహరింపులో మెలకువలను నేర్పిస్తూ సాగే ప్రతి భంగిమ ప్రేక్షకులను పరవశింపజేస్తుంది. పిన్న వయసు నుంచే అనేక వేదికలపైప్రదర్శనలిచ్చి ప్రశంసలందుకుంటున్న నగరానికి చెందిన విశ్వనాథ్‌ శాస్త్రీయ నాట్యంపై పరిశోధనా గ్రంథం రాయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఒకవైపు నాట్య ప్రదర్శనలిస్తూనే, మరోవైపు చిన్నారులకు శిక్షణ ఇస్తూ, ఇంకోవైపు లఘుచిత్రాలు నిర్మిస్తున్న విశ్వనాథ్‌ కృషి అభినందనీయం.. అనన్యసామాన్యం.
 
విజయవాడ కల్చరల్: తాను చదువుకున్న విద్యకు మించిన ఉద్యోగం వచ్చినా పక్కనపెట్టి, కళపై ఆసక్తి, ఆరాధనతో నాట్యానికే అంకితమయ్యారు నగరానికి చెందిన ముగడా వెంకటేశ్‌ విశ్వనాథ్‌. తల్లి గాయత్రి సూచన మేరకు చిన్న వయసు నుంచే నాట్యం నేర్చుకోవడం ప్రారంభించి ప్రస్తుతం బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతున్నా.. కళపై ఆసక్తిని మాత్రం తగ్గించుకోలేదు. భరతనాట్యంలో ఎంఏ, ఆ తరువాత పీహెచ్‌డీ చేయాలనేది ఆయన కోరిక. కూచిపూడి, భరతనాట్యంలో సర్టిఫికెట్‌, డిప్లొమా కోర్సులు పూర్తిచేసిన విశ్వనాథ్‌కు ఎంఏ చేయాలంటే డిగ్రీ కావాల్సి ఉండటంతో డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌లో బీఏ కూడా చదువుతున్నారు. ప్రముఖ నాట్యాచార్యుడు భాగవతుల వెంకటరామశర్మ వద్ద 2014లో భరతనాట్యంలో డిప్లొమా, 2016లో కూచిపూడిలో డిప్లొమా పూర్తిచేశారు విశ్వనాథ్‌. తల్లి గాయత్రి చిన్నతనంలో భాగవతుల వెంకటరామశర్మ తండ్రి అయిన యజ్ఞ నారాయణశర్మ వద్ద భరతనాట్యంలో ఏడేళ్ల శిక్షణ తీసుకున్నారు. వివాహం తరువాత ఆమె నాట్యానికి స్వస్తి చెప్పాల్సి వచ్చింది. తనకు ప్రాణమైన నాట్యాన్ని కుమారుడు విశ్వనాథ్‌కు నేర్పించడమే కాదు.. ప్రస్తుతం ఆమె కూడా నాట్యంలో డిప్లొమా చేస్తుండటం విశేషం. నాట్యం నేర్చుకునే సమయంలో పేదరికం కారణంగా డిప్లొమా కోర్సు మధ్యలోనే ఆపేయగా, అప్పటి సంగీత కళాశాల ప్రిన్సిపాల్‌ సి.మునికుమార్‌ ఆర్థిక సాయం అందజేసి ఆకట్టుకున్నారు.
 

తల్లితో కలిసి..
తల్లి గాయత్రి, కుమారుడు విశ్వనాథ్‌ ఇద్దరూ కలిసి నాలుగేళ్ల పాటు నాట్యం నేర్చుకున్నారు. అంతేకాదు.. ఇద్దరూ కలిసి పలు నాట్య ప్రదర్శనలు కూడా ఇచ్చారు. ఇప్పటివరకు దాదాపు 700కుపైగా ప్రదర్శనలు ఇచ్చారు. భాగవతుల వెంకటరామశర్మ శిష్య బృందంలో ఒకరిగా ఉంటూ, ఒకవైపు సోలో డ్యాన్స్‌, మరోవైపు నృత్య రూపకాల్లో పలు పాత్రలు పోషిస్తూ మంచి నర్తకుడిగా రాణించారు. ఆముక్తమాల్యదలో శివుడి పాత్ర, వాయువు, అగ్ని, విష్ణుమూర్తి, అసురుడు, ముని.. ఇలా 13 నృత్య రూపకాల్లో అనేక పాత్రలు పోషించారు. జానపదంలో లంబాడి, పల్లె బృంద నృత్యాలు నర్తించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్నారు.
 
నాట్య శిక్షణతో పాటు లఘుచిత్రాల రూపకల్పన
పాఠశాలల్లో కూచిపూడి, భరతనాట్యం, జానపదం నేర్పించడమే కాకుండా తాను స్వయంగా విశ్వనాథ అకాడమీ పేరిట సంస్థను ప్రారంభించి చిన్నారులకు నాట్యంలో శిక్షణ, ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు విశ్వనాథ్‌. దాదాపు 300 మంది విద్యార్థులు విశ్వనాథ్‌ వద్ద శిక్షణ తీసుకుంటున్నారు. మరోవైపు తండ్రి కనకాచారి నేర్పించిన ఫొటోగ్రఫీ, వీడియో మిక్సింగ్‌లను వదిలిపెట్టకుండా సామాజిక సమస్యలపై చక్కటి లఘుచిత్రాలను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం విశ్వనాథ అకాడమీ బ్యానర్‌పై ‘మిస్టర్‌’ – వ్యక్తి స్వేచ్ఛను, వ్యక్తిత్వాన్ని తెలియజేస్తూ రూపొందించిన లఘుచిత్రాన్ని యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశారు. అంతకుముందు ‘అన్నదాత’ పేరిట రైతులు పడుతున్న కష్టాలను కళ్లకు కడుతూ మరో లఘుచిత్రం తీసి యూట్యూబ్‌లో పెట్టారు. ప్రస్తుతం ‘ఓ సైనికా..’ పేరిట మరో లఘుచిత్రాన్ని తీస్తున్నారు. కథ, మాటలు రాస్తూ, దర్శకత్వం వహిస్తూ ఈ లఘుచిత్రాలను నిర్మిస్తుండటం విశేషం.
 

అబ్రాడ్‌లో నాట్య శిక్షణ ఇస్తా..
బీటెక్‌ పూర్తి చేసిన తరువాత ఎంటెక్‌ చేస్తూ నాట్యంలో ఎంఏ పూర్తిచేయాలని ఉంది. అబ్రాడ్‌లో కొలువు సంపాదించి అక్కడే నాట్య శిక్షణ కేంద్రం కూడా ఏర్పాటు చేయాలనేది నా లక్ష్యం.
– ముగడా వెంకటేశ్‌ విశ్వనాథ్‌

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *