నాదే తప్పు… : మోదీ


కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా మండిపడ్డారు. ప్రజల నమ్మకాన్ని ఆమె తుంగలో తొక్కి, ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. దక్షిణ దీనాజ్‌పూర్‌లోని బునియాద్‌పూర్‌లో శనివారం జరిగిన బీజేపీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ మమత బెనర్జీ రాష్ట్రాభివృద్ధికి స్పీడ్ బ్రేకర్ అని పునరుద్ఘాటించారు.
 
‘‘మీరు మీ స్పీడ్ బ్రేకర్ దీదీ (మమత బెనర్జీ)ని నమ్మారు. కానీ ఆమె మిమ్మల్ని మోసం చేశారు. ఇది మీ తప్పు కాదు. నేను ప్రధాన మంత్రి పదవిని చేపట్టడానికి ముందు నేను కూడా ఆమె నిరాడంబరతకు నిలువుటద్దమని అనుకున్నాను. అయితే నేను ప్రధాన మంత్రి పదవిని చేపట్టిన తర్వాత ఆమె గురించి ఎక్కువగా తెలుసుకున్నాను. బెంగాల్‌లో ఆమె ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారు. నేడు సిగ్గుతో తల దించుకుంటున్నాను. నాదే తప్పు, నేను పొరపాటు చేశాను’’ అని మోదీ అన్నారు.
 
బుజ్జగింపుల రాజకీయాలను మమత బెనర్జీ చాలా తీవ్ర స్థాయికి తీసుకెళ్ళారని మోదీ ఆరోపించారు. ఆమె పార్టీ (టీఎంసీ) నేతలు ప్రచారం కోసం బంగ్లాదేశ్ నటులను తీసుకొస్తున్నారన్నారు.
 
లోక్‌సభ ఎన్నికల్లో ఇప్పటి వరకు జరిగిన రెండు దశల పోలింగ్ నేపథ్యంలో మమత బెనర్జీకి నిద్ర పట్టడం లేదని ఎద్దేవా చేశారు. మే 23 (ఓట్ల లెక్కింపు) తర్వాత బెంగాల్‌లో అద్భుతం జరగబోతోందన్నారు. మోదీకి బెంగాల్ మరింత బలం ఇస్తుందన్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *