నాలుగో దశలో నువ్వా నేనా!?


  • 9 రాష్ట్రాల్లోని 71 స్థానాల్లో నేడే పోలింగ్‌..
  • హోరాహోరీగా తలపడుతున్న కాంగ్రెస్‌, బీజేపీ
కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌తో యువ కెరటం కన్నయ్య కుమార్‌ ఢీ! ముఖేశ్‌ అంబానీ మద్దతు ప్రకటించిన మిలింద్‌ దేవ్‌రాపై మరోసారి పైచేయి సాధించాలని పట్టుదలతో ఉన్న శివసేన అభ్యర్థి అరవింద్‌ సావంత్‌! సాక్షి మహరాజ్‌కు ఉన్నావ్‌లో మహా కూటమి సవాల్‌! అలనాటి అందాల నటి.. గాయక కేంద్ర మంత్రి మధ్య నువ్వా నేనా అన్న పోటీతో ఆసక్తికరంగా అసన్‌సోల్‌!! వెరసి, నాలుగో దశలో తొమ్మిది లోక్‌సభ నియోజకవర్గాల్లో రసవత్తర పోరు జరుగుతోంది. తొమ్మిది రాష్ట్రాల్లో సోమవారం (ఏప్రిల్‌ 29) నాలుగో దశ ఎన్నికలు జరగనున్నాయి. బిహార్‌, జమ్మూ కశ్మీర్‌, జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఒడిసా, రాజస్థాన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలకు చెందిన కొన్ని భాగాల్లోని 71 నియోజక వర్గాల్లో పోలింగ్‌ జరగనుంది. ఈ దశలో దేశవ్యాప్తంగా ఆసక్తిని కలిగిస్తున్న 11 నియోజకవర్గాల విశేషాలు..

మొత్తం ఓటర్లు 17.75 లక్షలు ఉత్తర ముంబైలో ఊర్మిళ జోరు
బాలీవుడ్‌ నటి ఊర్మిళా మతోండ్కర్‌ రాజకీయాల్లోకి అడుగుపెడుతూనే ఉత్తర ముంబై నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో దిగారు. బీజేపీ సిటింగ్‌ ఎంపీ గోపాల్‌ షెట్టితో ఆమె తలపడుతున్నారు. బీఎస్టీ, నోట్ల రద్దు దేశ ఆర్థిక రాజధానిపై తీవ్ర ప్రభావాన్ని చూపిందని, చాలా ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చిందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారందరూ తమకు అనుకూలంగా ఓటేసే అవకాశం ఉందని కాంగ్రెస్‌ భావిస్తోంది. గోపాల్‌ షెట్టి బలమైన అభ్యర్థి అయినప్పటికీ తామే గెలుస్తామన్న ధీమాతో ఉన్నారు.
2014లో విజేత: గోపాల్‌ షెట్టి (బీజేపీ)
మొత్తం ఓటర్లు 17.78 లక్షలుబెగుసరాయ్‌.. కన్నయ్యకా సవాల్‌!
మధ్య బిహార్‌లో ఉన్న బెగుసరాయ్‌ నుంచి సీపీఐ అభ్యర్థిగా జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్నయ్య కుమార్‌ పోటీ చేస్తున్నారు. కమ్యూనిస్టులకు గట్టి పట్టున్న ఈ స్థానంలో బీజేపీ సీనియర్‌ నాయకుడు, కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ తో ఆయన తలపడుతున్నారు. దాంతో, ఈ స్థానం అందరి దృష్టిని విశేషంగా ఆకర్షిస్తోంది. ఇక్కడి నుంచి పోటీకి గిరిరాజ్‌ సింగ్‌ తొలుత ఇష్టపడలేదు. 2014లో తాను గెలుపొందిన నావడ నుంచే పోటీ చేయాలని భావించారు. కానీ, పార్టీ అధిష్ఠానం ఆదేశంతో పోటీకి సిద్ధపడ్డారు. గత ఎన్నికల్లో ఇక్కడినుంచి బీజేపీ అభ్యర్థి భోలా సింగ్‌ గెలుపొందారు. ఆయనకు 4.28 లక్షల ఓట్లు రాగా.. ఆర్జేడీ అభ్యర్థి తన్వీర్‌ హసన్‌కు 3.69 లక్షల ఓట్లు పోలయ్యాయి. సీపీఐ అభ్యర్థి రాజేంద్ర ప్రసాద్‌ సింగ్‌ 1.92 లక్షల ఓట్లు సంపాదించి తృతీయ స్థానంలో నిలిచారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆర్జేడీ అభ్యర్థిగా తన్వీర్‌ సింగ్‌ మరోసారి బరిలోకి దిగారు. దాంతో, ఇక్కడ ముక్కోణ పోటీ నెలకొంది.
2014లో విజేత: భోలాసింగ్‌ (బీజేపీ)
మొత్తం ఓటర్లు 21.64 లక్షలు ఉన్నావ్‌.. సాక్షి మహరాజ్‌కు గట్టి పోటీ
గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సాక్షి మహరాజ్‌కు 5.18 లక్షల ఓట్లు రాగా.. ఎస్పీ అభ్యర్థి అరుణ్‌ శంకర్‌ శుక్లాకు 2.08 ఓట్లు, బీఎస్పీ అభ్యర్థి బ్రజేష్‌ పాఠక్‌కు 2 లక్షల ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన అన్నూ టాండన్‌ 1.97 లక్షల ఓట్లు సాధించారు. కానీ, ఇప్పుడు ఎస్పీ-బీఎస్పీ కలిసి అరుణ్‌ శంకర్‌ శుక్లాను బరిలోకి దింపాయి. ఈ పరిణామం సిటింగ్‌ బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్‌కు సవాల్‌గా మారింది. కాంగ్రెస్‌ అభ్యర్థిగా అన్ను టాండన్‌ బరిలో ఉండడంతో ఇక్కడ త్రిముఖ పోటీ ఏర్పడింది.
2014లో విజేత: సాక్షి మహరాజ్‌ (బీజేపీ)
మొత్తం ఓటర్లు 14.01 లక్షలు చింద్వారా.. బరిలో ముఖ్యమంత్రి కొడుకు
మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ కంచుకోటగా మారిన చింద్వారాలో 1980 నుంచి బీజేపీ ఒక్కసారి కూడా గెలవలేదు. 1997-98 మధ్య కాలంలో మినహా బీజేపీ ప్రభంజనం వీచిన 2014లోనూ ఛింద్వారాలో కాంగ్రెస్‌ పట్టు చేజారలేదు. తొలిసారిగా 1980లో ఇక్కడి నుంచి గెలిచిన కమల్‌నాథ్‌ 2014 ఎన్నికతో కలుపుకొని.. మొత్తం 9 సార్లు ఇక్కడి నుంచే లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. ఈసారి కమల్‌నాథ్‌ కుమారుడు నకుల్‌నాథ్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగారు. బీజేపీ నుంచి నతన్‌ షా పోటీలో ఉన్నారు. ఇక్కడ ముఖాముఖి పోరు జరుగుతున్న.. సీటును నిలబెట్టుకోవడం కమల్‌నాథ్‌కు కీలకంగా మారింది.
2014లో విజేత: కమల్‌నాథ్‌ (కాంగ్రెస్‌)
మొత్తం ఓటర్లు 15.55 లక్షలుకేంద్రపడ.. బీజేడీ కంచుకోటపై బీజేపీ కన్ను
ఒడిసా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌కు ఒకప్పటి సన్నిహిత సహచరుడు బైజయంత్‌ పాండా ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా కేంద్రపడ నుంచి పోటీ చేస్తున్నారు. 1998 నుంచీ ఇక్కడ బీజేడీ విజయబావుటా ఎగుర వేస్తోంది. 2009 నుంచి పాండా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పుడు ఆయనపై బీజేడీ అభ్యర్థి అనుభవ్‌ మొహంతి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్‌ తరఫున ధరణీధర్‌ నాయక్‌ బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో బీజేడీ అభ్యర్థిగా పాండా 6.01 లక్షల ఓట్లు సాధించగా.. కాంగ్రెస్‌ అభ్యర్థి నాయక్‌ 3.92 లక్షల ఓట్లు; బీజేపీ అభ్యర్థి బిష్ణు ప్రసాద్‌ దాస్‌ 1.18 లక్షల ఓట్లు సాధించారు. ఇప్పుడిక్కడ బీజేపీ గెలుపుపై ఆసక్తి నెలకొంది.
2014లో విజేత: బైజయంత్‌ పాండా (బీజేడీ)
మొత్తం ఓటర్లు 14.85 లక్షలు దక్షిణ ముంబై.. ముఖేశ్‌ అంబానీ మద్దతు
ముంబై కాంగ్రెస్‌ అధ్యక్షుడు మిలింద్‌ దేవ్‌రా కాంగ్రెస్‌ అభ్యర్థిగా శివసేన అభ్యర్థి అరవింద్‌ సావంత్‌తో దక్షిణ ముంబైలో తలపడుతున్నారు. గతంలో తన తండ్రి మురళీ దేవ్‌రా ప్రాతినిధ్యం వహించిన ఈ స్థానం నుంచి 2004, 2009 ఎన్నికల్లో మిలింద్‌ గెలిచారు. గత (2014)ఎన్నికల్లో మాత్రం 1.2 లక్షలకుపైగా ఓట్ల తేడాతో ఆయనను అరవింద్‌ సావంత్‌ ఓడించారు. ఈ ఎన్నికల్లో మిలింద్‌కు కార్పొరేట్‌ దిగ్గజం ముఖేష్‌ అంబానీ బహిరంగంగా మద్దతు ప్రకటించారు. దీంతో, ఇక్కడ పైచేయి ఎవరిదనే దానిపై ఆసక్తి నెలకొంది.
2014లో విజేత: అరవింద్‌ సావంత్‌
మొత్తం ఓటర్లు 14.85 లక్షలు
అసన్‌సోల్‌.. మూన్‌మూన్‌ మళ్లీ జెయింట్‌ కిల్లరా!?
పశ్చిమ బెంగాల్లోని అసన్‌సోల్‌ నుంచి గత ఎన్నికల్లో గెలిచిన కేంద్ర మంత్రి, గాయకుడు బాబుల్‌ సుప్రియోనే బీజేపీ మళ్లీ బరిలోకి దింపింది. 2014 ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో రెండు సీట్లు గెలిచిన బీజేపీ.. ఈసారి తన పట్టును మరింత పెంచుకోవడానికి పావులు కదుపుతోంది. అయితే, అసన్‌సోల్‌ను చేజిక్కించుకోవడానికి తృణమూల్‌ కాంగ్రెస్‌ అలనాటి సినీ నటి మూన్‌ మూన్‌ సేన్‌ను ఇక్కడ నిలిపింది. గత ఎన్నికల్లో వామపక్షాల కంచుకోట బంకురాలో తొమ్మిదిసార్లు ఎంపీగా గెలిచిన బాసుదేవ్‌ ఆచార్యను ఓడించిన ఘనత మూన్‌ మూన్‌ సేన్‌ సొంతం. మరోసారి ఆమె జెయింట్‌ కిల్లర్‌గా మారతారా!? బీజేపీయే జెండా ఎగరేస్తుందా? అనే ఉత్కంఠ నెలకొంది.
2014లో విజేత: బాబుల్‌ సుప్రియో (బీజేపీ)
మొత్తం ఓటర్లు 19.4 లక్షలు
ఝలావర్‌లో దుష్యంత్‌కు పరీక్ష
హ్యాట్రిక్‌ విజయాన్ని సాధించిన రాజస్థాన్‌ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే కుమారుడు దుష్యంత్‌ సింగ్‌ ఇప్పుడు నాలుగోసారి బరిలో ఉన్నారు. మూడు దశాబ్దాలుగా తమ కుటుంబానికి కంచుకోటగా ఉన్న ఝలావర్‌-బరాన్‌ లోక్‌సభ స్థానంలో మళ్లీ విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతున్నారు. అయితే బీజేపీ నుంచి కాంగ్రె్‌సలో చేరిన ప్రమోద్‌ శర్మ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఇక్కడ జాట్ల ఓట్లే కీలకం. దీంతో ఇరు పార్టీలు వా రిని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అగ్రవర్ణాల పేదలకు 10ు రిజర్వేషన్లు కల్పించడం, రైతులకు ఏడాదికి రూ.6వేల సాయం కమలనాథులకు సానుకూలాంశాలు. గ్రామీణ ప్రాంత ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం కావడంతో ‘న్యాయ్‌’పై కాంగ్రెస్‌ ఆశలు పెట్టుకుంది.
2014లో విజేత: దుష్యంత్‌ సింగ్‌ (బీజేపీ)
మొత్తం ఓటర్లు 17.38 లక్షలు
సై అంటున్న వారసులు
గతంలో రెండు సార్లు ఎంపీగా గెలుపొందిన వారు ఒకరు.. సిటింగ్‌ ఎంపీ మరొకరు. ఇద్దరూ ప్రముఖ దివంగత నేతల కుమార్తెలే. ఉత్తర మధ్య ముంబైలో హోరాహోరీగా ఇప్పుడు తలపడుతున్నారు. వారే కేంద్ర మాజీ మంత్రి ప్రమోద్‌ మహాజన్‌ కుమార్తె పూనమ్‌ బీజేపీ తరఫున, సునీల్‌ దత్‌ తనయ ప్రియాదత్‌ కాంగ్రెస్‌ తరఫున బరిలో ఉన్నారు. కాంగ్రెస్‌కు గట్టి పట్టున్న ఈ నియోజకవర్గంలో.. మోదీ హవాతో బీజేపీ అభ్యర్థి పూనమ్‌ గత ఎన్నికల్లో 1.86 లక్షల ఓట్ల తేడాతో గెలుపొందారు. కాగా, మోదీపై వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్‌.. తాము చేపట్టిన అభివృద్ధి పనులే గెలిపిస్తాయని బీజేపీ అంచనాలు వేసుకుంటున్నాయి.
2014లో విజేత: పూనమ్‌ మహాజన్‌ (బీజేపీ)
ఏ రాష్ట్రంలో
ఎన్ని స్థానాలకు ఎన్నికలంటే..
జార్ఖండ్‌ 3; బిహార్‌ 5; మధ్యప్రదేశ్‌ 6; మహారాష్ట్ర 17; ఒడిసా 6; రాజస్థాన్‌ 13; ఉత్తరప్రదేశ్‌ 13; పశ్చిమబెంగాల్‌ 8; జమ్మూకశ్మీర్‌ 1/3 (ూ అనంతనాగ్‌)
(ూ అనంతనాగ్‌కు 3, 4, 5వ దశల్లో పోలింగ్‌)
మొత్తం ఓటర్లు 16.77 లక్షలు 
బార్మర్‌.. కాంగ్రెస్‌ నుంచి జశ్వంత్‌ తనయుడు
రాజస్థాన్‌లోని బార్మర్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య ముఖాముఖి పోరు జరుగుతోంది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలిచిన సోనారాం చౌదరిని తప్పించి కైలాశ్‌ చౌదరిని బీజేపీ బరిలోకి దింపింది. 2014 ఎన్నికల్లో బీజేపీ టికెట్‌ ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన జశ్వంత్‌ సింగ్‌ ఓడిపోయారు. బీజేపీ అభ్యర్థి సోనారాం చౌదరికి 4.88 లక్షల ఓట్లు రాగా జశ్వంత్‌కు 4.01 లక్షల ఓట్లు లభించాయి. కాంగ్రెస్‌ అభ్యర్థి హరీశ్‌ చౌదరికి 2.20 లక్షల ఓట్లు లభించాయి. 2004, 2009 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా గెలిచిన జశ్వంత్‌ తనయుడు మానవేంద్ర సింగ్‌ ఇప్పుడు కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో నిలవడంతో పోటీ రసవత్తరంగా మారింది.
2014లో విజేత: సోనారాం చౌదరి (బీజేపీ)
మొత్తం ఓటర్లు 13.93 లక్షలు అనంత్‌నాగ్‌.. మూడు దశల్లో పోలింగ్‌
మూడు దశల్లో పోలింగ్‌ జరుపుకొంటున్న దేశంలోని ఏకైక నియోజకవర్గం జమ్ము కశ్మీరులోని అనంత్‌నాగ్‌. మూడో దశలో నియోజక వర్గంలోని కొంత భాగంలో పోలింగ్‌ జరగగా.. నాలుగు, ఐదో దశల్లో కూడా ఇక్కడ పోలింగ్‌ జరగనుంది. పీడీపీ అభ్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ బరిలో నిలిచిన ఈ నియోజక వర్గంలో బీజేపీ తరఫున సోఫి యూసఫ్‌, కాంగ్రెస్‌ అభ్యర్థిగా గులాం నబీ మీర్‌, జేకేఎన్‌ అభ్యర్థిగా హస్నన్‌ మసూదీ పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ముఫ్తీ ఇక్కడి నుంచి గెలిచారు. ఇప్పుడు ఇక్కడ చతుర్ముఖ పోరు నెలకొంది.
2014లో విజేత: మెహబూబా ముఫ్తీ (పీడీపీ)
 

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *