నా కుమార్తె ఫెయిల్‌ అవడానికి కాంగ్రెస్‌ నేతలే కారణం: బీజేపీ నేత


బెంగళూరు: కలబుర్గి జిల్లా చించోళిలో వింత రాజకీయ చర్చలు చెలరేగుతున్నాయి. కలబుర్గి లోక్‌సభ బీజేపీ అభ్యర్థి ఉమేష్‌ జాదవ్‌ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ నేతలపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. నా కుమార్తె పీయూసీలో ఫెయిల్‌ అయ్యేందుకు కాంగ్రెస్‌ నేతలే కారణమన్నారు. కాంగ్రెస్‌ నుంచి బీజేపీలోకి రాజకీయ భవిష్యత్‌ కోసం మారానని, అయితే పార్టీ ఫిరాయించినందుకు భారీగా నగదు పొందానని కాంగ్రెస్‌ నేతలు ఆరోపించడం తగదన్నారు. తన కుమార్తె మానసికంగా ఇబ్బంది పడిందని, కళాశాలలో తోటి మిత్రులు అదోరకంగా చూశారని, చివరకు పరీక్షలు సక్రమంగా రాయలేదని వాపోయారు.
 
ఈ సంఘటన తన కుమార్తె విద్యాభవిష్యత్‌పై ప్రభావం చూపిందని మండిపడ్డారు. అవాస్తవాలు ప్రచారం చేసి తన కుమార్తె మానసికంగా ఇబ్బంది పడడానికి కాంగ్రెస్‌ నేతలు కారకులయ్యారన్నారు. ఇదే విషయంపై మంత్రి ప్రియాంక ఖర్గ్గే తీవ్రంగా స్పందించారు. రాజకీయాలకు కుటుంబీకులను తీసుకురావడం సిగ్గు చేటు అన్నారు. నా తండ్రి మల్లిఖార్జున ఖర్గేను శ్రీమంత దళితుడనే వ్యాఖ్యలు చేసినప్పుడు నా కుటుంబీకులు మానసికంగా ఇబ్బంది పడలేదా? అని ప్రశ్నించారు. ఉమేష్‌ జాదవ్‌ కాంగ్రె్‌సను వీడేందుకు స్పష్టమైన కారణం లేదని, కనుక తప్పును సరిదిద్దుకునేందుకు నోటికొచ్చినట్టు ఆరోపిస్తున్నారని అన్నారు. ఇదిలావుండగా ఉమేష్‌ జాదవ్‌ కుమారుడు డాక్టర్‌ అవినాష్‌ జాదవ్‌ చించోళి శాసనసభ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో ఉండి ఎండి పరీక్షల్లో బుధవారం పాల్గొన్నారు.
 
కలబుర్గిలోని మహదేవప్ప రాంపుర మెడికల్‌ కళాశాలలో జరిగిన పరీక్షలకు హాజరయ్యారు. మొత్తం నాలుగు పరీక్షల్లో పాల్గొనాల్సి ఉండగా తొలిరోజున పరీక్షలకు హాజరయ్యారు. అనంతరం అవినాష్‌ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ప్రచారాలకు మరో తొమ్మిది రోజులు మాత్రమే గడువు ఉండడంతో అన్నింటినీ రాయలేనని, మరో మూడు పరీక్షలు ఎన్నికలు ముగిశాక పూర్తి చేస్తానని అన్నారు. నా చెల్లిపై కాంగ్రెస్‌ నేతల ఆరోపణల ప్రభావం పడిందని, అందుకే పీయూలో ఫెయిల్‌ అయిందని అన్నారు. అయితే ఇప్పటికే ఎంబీబీఎస్‌ పూర్తి చేసినందున నేను వారి ఆరోపణలను పెద్దగా పట్టించుకోలేదన్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *