నా వ్యాఖ్యలు వక్రీకరించారు: శ్యామ్ పిట్రోడా


న్యూఢిల్లీ: 1984 సిక్కుల ఊచకోత ఘటనపై తాను చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతుండటంపై కాంగ్రెస్ ఓవర్సీస్ చీఫ్ శ్యాం పిట్రోడా స్పందించారు. తన వాఖ్యలను పూర్తిగా వక్రీకరించినట్టు ఆయన మీడియాకు చెప్పారు. తన హిందీ అంతగా బాగుండదని, జరిగిన చెడు ఏదో జరిగిందని (జో హువా వో బురా హువా) చెప్పడం తన ఉద్దేశమైతే, ‘బురా’ (చెడు) అనే పదం అనువాదం తనకు స్ఫురించలేదని చెప్పారు.
 
‘జరిగిందేదో జరిగింది…అయితే ఏంటి?’ అంటూ సిక్కు అల్లర్లపై పిట్రోడా గురువారం వ్యాఖ్యానించడం వివాదమైంది. ప్రధాని నరేంద్ర మోదీతో సహా పలువురు బీజేపీ నేతలు పిట్రోడా వ్యాఖ్యలను తప్పుపట్టారు. కాంగ్రెస్‌కు ఎంత మంది ప్రాణాలు పోయినా లెక్కలేదంటూ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ సైతం నష్టనివారణ చర్యలు చేపట్టింది. హింస, అల్లర్లకు సమాజంలో తావు లేదని, క్షమించరానివని కాంగ్రెస్ ఓ ప్రకటనలో పేర్కొంది. 1984 సిక్కు అల్లర్లతో పాటు, 2002లో గుజరాత్‌లో జరిగిన అల్లర్లకు కారణమైన వారికి శిక్షపడి, బాధితులకు న్యాయం జరిగేంత వరకూ తాము పోరాడుతూనే ఉంటామని తెలిపింది. బాధితులకు తమ మద్దతు ఉంటుందని అంటూనే, ఈ విషయంపై పిట్రోడా సహా ఏ నాయకుడు మాట్లాడినా అది కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం ఎంతమాత్రం కాదని తెగేసి చెప్పింది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *