నిప్పులగుండం


  • ఒక్కసారిగా పెరిగిన ఉష్ణోగ్రతలు..
  • 21 చోట్ల 45 డిగ్రీలు దాటిన వేడి..
  • 93 ప్రాంతాల్లో 42 డిగ్రీలపైనే.. మరో 3రోజులు ఇంతే
(ఆంధ్రజ్యోతి, న్యూస్‌ నెట్‌వర్క్‌): రాష్ట్రం నిప్పులగుండంలా మండిపోతోంది. మే మొదట్లోనే మంటలు రేగుతున్నాయి. రోహిణి రాకముందే రోళ్లు పగిలే ఎండలు కాస్తున్నాయి. ఉదయం, సాయంత్రం అని లేకుండా ఈడ్చికొడుతున్న వడగాడ్పులకు ఇళ్లలో జనాలు నిలవలేకపోతున్నారు. వేడి వాతావరణానికి ఫ్యాన్‌, ఏసీ గాలులూ సెగలు కక్కుతుండటంతో, రోజంతా ఉడికిపోతున్నారు. వెళ్తూ వెళ్తూ ఫణి తుఫాను మిగిల్చిన పొడి వాతావరణం శనివారం రాష్ట్రాన్ని ఉడికిస్తోంది. సాధారణంగా వాతావరణం చల్లబడే సాయంత్రం నాలుగు గంటల సమయంలోనూ, అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవడం కలవరపరుస్తోంది. ఆ సమయంలో గుంటూరు జిల్లా మంగళగిరిలో 45.64 డిగ్రీల మేర ఎండ కాసింది. రాజమహేంద్రవరంలో శనివారం అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆ తరువాత పోలవరంలో 45.89 డిగ్రీల ఎండ నమోదైంది. ఉత్తరాంధ్ర మినహా కోస్తా, రాయలసీమల్లో భారీ ఉష్ణోగ్రతలు కొనసాగాయి. ఉదయం నుంచే మొదలైన ఎండలు సాయంత్రం ఆరు గంటల వరకూ ప్రభావం చూపాయి. పెరిగిన ఉష్ణోగ్రతలకు అనుగుణంగా వడగాడ్పులూ పెరిగాయి. గురువారం వరకు ఎండలు కాసినా వడగాడ్పులు లేకపోవడంతో పెద్దగా ప్రభావం కనిపించలేదు. కానీ తుఫాను వెళ్లిన వెంటనే మొదలైన గాలుల్లో సెగ పెరిగి ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేసేసింది.
 
ఈ ప్రభావంతో రాష్ట్రంలోని 21 ప్రాంతాల్లో 45 డిగ్రీలు దాటి ఎండలు కాశాయి. రెండు గంటల సమయంలో పశ్చిమగోదావరి చింతలపూడిలో 45.77, కొవ్వూరులో 45.63 డిగ్రీలు నమోదయ్యాయి. బెజవాడసహా 100 ప్రాంతాల్లో 43, 93 ప్రాంతాల్లో 42, 120 ప్రాంతాల్లో 41, 129 ప్రాంతాల్లో 40 డిగ్రీలు దాటి ఎండలు కాశాయి. పడమర, వాయువ్య దిశ నుంచి వేడిగాలులు వీయడంతో కోస్తాలోని అనేక ప్రాంతాల్లో భూమి వేడెక్కింది. నెల్లూరు నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు ఎండ, గాడ్పులు ఎక్కువగా ఉన్నా, ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లా నుంచి నెల్లూరు వరకు తీవ్రగాడ్పులు వీచాయి. కాగా, కోస్తా, రాయలసీమల్లో మరో మూడు రోజులు వడగాడ్పులు ఇలాగే కొనసాగనున్నాయి. సముద్రం నుంచి తిరిగి కోస్తాపైకి తేమగాలులు వచ్చేంత వరకు వేడిగాడ్పులు ఉంటాయని వాతావరణ అధికారి ఒకరు తెలిపారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తీవ్ర వడగాడ్పులు, విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాలు, రాయలసీమలోని కర్నూలు, కడప, చిత్తూరులో ఒక మాదిరి గాడ్పులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
 
మరో వారం ఇంతే..
ఆదివారం ఎండలు మరింత పెరుగుతాయని ఆర్టీజీఎస్‌ హెచ్చరించింది. ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించింది. 210 మండలాల్లో తీవ్రస్థాయిలో ఎండలు కాసే అవకాశం ఉందని అంచనా వేసింది. తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 46డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదుకావొచ్చని తెలిపింది. ఈ స్థాయి ఎండలు ఈనెల 10 వరకూ కొనసాగుతాయని పేర్కొంది. అధిక ఉష్ణోగ్రతలకు అవకాశం ఉన్న మండలాలను గుర్తించింది. అవి..తూర్పుగోదావరి- రామచంద్రపురం, సీతానగరం, కూనవరం, దేవీపట్నం. పశ్చిమగోదావరి- దెందులూరు, దేవరపల్లి, ఏలూరు, గోపాలపురం, పోలవరం, తాళ్లపూడి. కృష్ణా- బాపులపాడు, గుడివాడ, నందివాడ, పెదపారుపూడి. గుంటూరు- వేమూరు, తాడేపల్లి, పెదకాకాని, మంగళగిరి, గురజాల, దాచేపల్లి, రెంటచింతల. ప్రకాశం- మద్దిపాడు, కందుకూరు, పొన్నలూరు, టంగుటూరు, నూతలపాడు, కొండేపి, జరుగుమిల్లి. నెల్లూరు- కావలి, కొండాపురం, వరికుంటపాడు.
 
ఇలా చేయండి..
తప్పనిసరిగా గొడుగు వాడాలి. తెలుపురంగు, పలుచని కాటన్‌ వస్ర్తాలు ధరించాలి. తలకు టోపీ లేదా రుమాలు పెట్టుకోవాలి. మజ్జిగ లేదా గ్లూకోజు నీరు తరచూ తాగితే మంచిది. మంచినీరు ఎక్కువగా తీసుకోవాలి. ఇంటినుంచి బయటకు వెళ్లేముందు ఒక గ్లాసు నీరు తాగాలి.
 
ఇలా చేయొద్దు..
నలుపు, మందంగా ఉండే దుస్తులు ధరించకూడదు. పగటిపూట ఆరుబయట శారీరక శ్రమ ఉండే పనులు చేయకూడదు. బయటినుంచి వచ్చిన వెంటనే తీపి పదార్థాలు, తేనె తీసుకోకూడదు. శీతలపానీయాలు, ఐస్‌ ముక్కలు తీసుకుంటే గొంతుకు సంబంధించిన సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
 
బెజవాడ 43.6 డిగ్రీలు
బెజవాడ భగభగలాడింది. శుక్రవారం 42 డిగ్రీల ఎండలు కాయగా, అది శనివారం మరో డిగ్రీకి పెరిగి 43.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. 2016 మేలో 47 డిగ్రీల ఉష్ణోగ్రత బెజవాడలో నమోదయింది. ఇదే సెగ కొనసాగితే, ఈ సీజన్‌ ముగిసేలోగా ఆ రికార్డును దాటిపోవడం ఖాయమనిపిస్తోంది. సాధారణంగా చల్లగాలుల ఊరట లభించే రాత్రి ఎనిమిది గంటల వేళా, వేడిగాడ్పులు వీస్తూనే ఉన్నాయి. ఫ్యాన్‌, ఏసీ గదుల్లోనే ఉంటున్నా, సెగలను తట్టుకోలేక జనం ఉక్కిరి బిక్కిరి అయ్యారు. రోజంతా రహదారులు నిర్మానుష్యంగా మారాయి. రోహిణి కార్తి రాకముందే ఇంతలా ప్రతాపం చూపిస్తుండటంతో, చల్లని పానియాలు, కొబ్బరిబొండాల దుకాణాల వద్దనే జనం ఎక్కువసేపు గడుపుతున్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *