నియంత్రణ రేఖ వెంబడి వ్యాపార సంబంధాలు నిలిపివేత


న్యూఢిల్లీ : నియంత్రణ రేఖ వెంబడి జరిగే అన్ని రకాల వ్యాపారాలను భారత దేశం నిలిపివేసింది. ఈ మార్గాన్ని పాకిస్థాన్ నుంచి ఆయుధాలు, మాదక ద్రవ్యాలు, నకిలీ కరెన్సీ వంటివాటిని అక్రమంగా భారతదేశానికి తరలించేందుకు ఉపయోగించుకుంటున్నందువల్ల ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో ఈ వివరాలను వెల్లడించారు.
 
ఏప్రిల్ 19 నుంచి నియంత్రణ రేఖ వెంబడి జమ్మూ-కశ్మీరులో వాణిజ్య కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశించినట్లు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. నియంత్రణ రేఖ వెంబడి మార్గాలను పాకిస్థాన్‌లోని శక్తులు దుర్వినియోగం చేస్తున్నట్లు భారత ప్రభుత్వానికి నివేదికలు అందాయని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. అక్రమ ఆయుధాలు, మాదక ద్రవ్యాలు, నకిలీ కరెన్సీ వంటివాటిని అక్రమంగా భారతదేశానికి తరలించేందుకు ఈ మార్గాలను ఉపయోగిస్తున్నట్లు నివేదికలు అందాయని వివరించింది.
 
నియంత్రణ రేఖ వెంబడి రెండు చోట్ల నుంచి వాణిజ్య కార్యకలాపాలను అనుమతించేవారు. బారాముల్లా జిల్లాలోని సలామాబాద్, పూంచ్ జిల్లాలోని చక్కన్-దా-బాగ్‌ల నుంచి వారానికి నాలుగు రోజులపాటు వ్యాపారం జరిగేది. వస్తు మార్పిడి పద్ధతిలో, ఎటువంటి సుంకాల వసూలు లేకుండా వస్తువులు, ఆహార ఉత్పత్తులను ఇచ్చి, పుచ్చుకునేవారు.
 
ఈ మార్గాలను విస్తృతంగా అక్రమ కార్యకలాపాలకు వాడుకుంటున్నట్లు చాలా నివేదికలు వెల్లడించాయి. ఇతర ప్రాంతాలతోపాటు విదేశాల నుంచి కూడా మాదక ద్రవ్యాలు, ఆయుధాలు, హవాలా సొమ్ము ఈ మార్గాల ద్వారా భారత దేశానికి తరలిస్తున్నట్లు పేర్కొన్నాయి.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *