నిరుద్యోగులకు ‘కోడ్‌’ కష్టాలు


  • ఆ 50 వేల మందికి మోక్షమెప్పుడు?
  • భృతి కోసం 2 నెలలుగా ఎదురుచూపులు
  • పోలింగ్‌ ముగిసినా ఆమోదించని ఈసీ
  • భారీగా రూ.2 వేలిస్తోంది మన రాష్ట్రమే
  • రికార్డు స్థాయిలో 4.9 లక్షల మందికి లబ్ధి
  • అక్రమాల చెక్‌కు జియోట్యాగింగ్‌ కూడా
అమరావతి, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్‌) నిరుద్యోగులతో ఆడుకుంటోంది. 50 వేల మంది నిరుద్యోగులకు సంబంధించిన భృతి దరఖాస్తులు ఎన్నికల కమిషన్‌ (ఈసీ) వద్ద ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో వచ్చిన ఈ దరఖాస్తులకు.. పోలింగ్‌ ముగిసి 17 రోజులైనా ఈసీ ఇంతవరకూ ఆమోదించలేదు. ఎప్పుడు పచ్చజెండా ఊపుతుందా అని నిరుద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో ప్రవేశపెట్టిన నిరుద్యోగ భృతి కార్యక్రమం ‘ముఖ్యమంత్రి యువనేస్తం’లో భాగంగా.. ప్రతి నెలా అర్హులైన నిరుద్యోగులు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఇది నిరంతర ప్రక్రియ. ప్రతి నెలా 25వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. ఆయా దరఖాస్తులను పరిశీలించి ఆ తదుపరి నెలలో పాత లబ్ధిదారులతో పాటు కొత్తగా అర్హత సాధించినవారికీ భృతి ఇచ్చేస్తారు. మార్చి రెండోవారంలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. దీంతో ఆ నెలలో కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారికి ఇవ్వాలా.. వద్దా.. అని ఈసీ అనుమతి కోసం పంపించారు. ఏప్రిల్‌లో కూడా కొన్ని వేల దరఖాస్తులు వచ్చాయి. వీటినీ అక్కడికే పంపించారు. మొత్తంగా ఈ 2 నెలల్లో సుమారు 50వేల దరఖాస్తులొచ్చాయి. అవన్నీ కమిషన్‌ ముందు పెండింగ్‌లో ఉన్నాయి.
 
ఈ-పోస్‌ యంత్రాలకు జియోట్యాగింగ్‌
మరోవైపు.. నిరుద్యోగ భృతికి సంబంధించి ఇటీవల కడప జిల్లాలో కొన్ని అక్రమాలు బయటకు వచ్చాయి. హైదరాబాద్‌లో ఉంటున్న వారి వద్దకు కొందరు రేషన్‌డీలర్లు ఈ-పోస్‌ యంత్రాలు తీసుకెళ్లి.. అక్కడ ఫింగర్‌ప్రింట్‌ వేయిస్తున్నారని తేలింది. ఇలా చేసినందుకు భృతి కింద వచ్చే రూ.2 వేలల్లో కొంత కమిషన్‌గా తీసుకుంటున్నారు. నిరుద్యోగ భృతి పథకం కింద లబ్ధి పొందేవారు రాష్ట్రంలో నివసించేవారై ఉండాలి. అదే సమయంలో నిరుద్యోగిగా ఉండాలి. ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న వారికి ఈ పథకం వర్తించదు. అయినా హైదరాబాద్‌లో ఉంటున్నవారితో ఈ-పోస్‌లో ఫింగర్‌ప్రింట్‌ వేయించి కొంత కమిషన్‌ తీసుకుని మిగిలింది వారికి వచ్చేలా కొందరు కుమ్మక్కయ్యారు. ఈ నేపథ్యంలో ఈ-పోస్‌ ఫింగర్‌ప్రింటింగ్‌కు జియోట్యాగింగ్‌ పద్ధతి పెట్టాలని నిర్ణయించారు. అంటే ఫింగర్‌ ప్రింట్‌ స్థానికంగా వేసిందా? లేకుంటే హైదరాబాద్‌, బెంగళూరుల్లో వేసిందా? అనేది తేలిపోతుంది. స్థానికంగా వేస్తేనే లబ్ధిదారుకు నిరుద్యోగ భృతి అందుతుంది. త్వరలోనే ఈ పద్ధతి అమల్లోకి రానుంది.
 
దేశంలోనే రికార్డు
ఏప్రిల్‌ నెలలో 4.9 లక్షల మందికి నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు అనుమతి లభించింది. ఇందులో సుమారు 4.5 లక్షల మందికి ఇప్పటికే ఖాతాల్లో జమయింది. మిగతా వారు ఈ-కేవైసీ వివరాలు ఇంకా ఇవ్వకపోవడంతో ఆ మొత్తం జమ చేయలేదు. ప్రతి నెలా నిరుద్యోగ భృతి అందుకుంటున్నవారు.. తాము నిరుద్యోగులుగానే ఉన్నామని, ఉద్యోగం రాలేదని, రాష్ట్రంలోనే ఉన్నామని.. తదితర వివరాలతో ఈ-కేవైసీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది కూడా ఆన్‌లైన్‌లో అప్పటికప్పుడు చేసేస్తారు. ప్రతి నెలా ఈ పని చేయని కొంతమందికి భృతి అందదు.
 
మరోవైపు నెలకు రూ.2 వేల చొప్పున.. ఇన్ని లక్షల మందికి నిరుద్యోగ భృతి ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశే. ఇప్పటివరకు 20 వేల మందికి మించి ఏ రాష్ట్రంలోనూ ఇవ్వలేదు. ఉత్తరప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌ లాంటి రాష్ట్రాల్లో దీన్ని అమలుచేసినా చాలా తక్కువ మందికి ఇచ్చారు. అదే సమయంలో రూ.500కి మించి ఎక్కడా ఇవ్వలేదు. ఏకంగా సుమారు 5లక్షల మందికి.. రూ.2వేల చొప్పున ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదే. పైగా ఈ పథకానికి పరిమితి లేదు. ఇంతమంది లబ్ధిదారులకే ఇవ్వాలన్న అడ్డంకీ లేదు. ప్రతి నెలా కొత్త దరఖాస్తులు చేసుకోవచ్చు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *