నీ తల్లి రుణం సరే.. నా ఒంటెలేం కావాలి?


  • కరీంనగర్‌ వాసిపై అరబ్‌ యజమాని నిర్దయ.. తల్లి కడచూపునకు వెళ్లేందుకు నిరాకరణ
(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి)
పొట్ట కూటి కోసం ఎడారి దేశం వెళ్లిన ఆ అభాగ్యుడికి.. తాను కాపలా కాసేఒంటెలతో మంచి అనుబంధం ఏర్పడింది. నలుగురు చేసే పనిని అతనొక్కడే సునాయసంగా చేసేయడంతో యజమాని వద్ద మంచి గుర్తింపు లభించింది. అతను పాడే తెలంగాణ జానపద పాటలకు ఒంటెలు పులకరించిపోయి పుష్కలంగా పాలిస్తాయి. ఇప్పుడదే అతని పాలిట శాపంగా మారింది. కన్న తల్లి మరణిస్తే స్వదేశానికి వెళ్లడానికి వీలులేకుండా చేసింది. ‘‘నువ్వు స్వదేశానికి వెళ్తే నా ఒంటెల పాలు ఎవరు పితుకుతారు’’ అంటూ.. ఆ యజమాని సెలవు ఇచ్చేందుకు నిరాకరించాడు. దీంతో పారిపోయి అయినా భారత్‌కు వచ్చేందుకు ప్రయత్నించడంతో.. అతని వద్ద నుంచి ఫోన్‌ లాక్కొని నిర్బంధించారు. దీంతో తన తల్లి రుణం తీర్చుకునేందుకు అవకాశం కల్పించాలంటూ ఎడారి దేశంలో ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ ఎదురుచూస్తున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలం మకతాపల్లికి చెందిన పాలేటి వీరయ్య రెండేళ్లుగా సౌదీ అరేబియా-జోర్డాన్‌ సరిహద్దులోని ఓ ఒంటెల క్షేత్రంలో కాపరిగా పనిచేస్తున్నాడు.
 
అక్కడ 100కు పైగా ఒంటెలుండగా.. ఇటీవల 30 ఒంటెలు ఈనాయి. ఆ ఒంటెల పాలు పిండకపోతే.. వాటి ఆరోగ్యం దెబ్బతింటుంది. నిజానికి ఒంటెల పాలు పిండటం అందరికీ సాధ్యం కాదు. ఆ క్షేత్రంలో చాలామంది భారతీయులు పనిచేస్తున్నటికీ వీరయ్య మాత్రమే ఒంటె పాలు పిండగలడు. వీరయ్య జానపద పాటలు పాడుతుంటే ఒంటెలు పులకించి పోయి పాలిస్తుంటాయి. ఇదే ఆ అరబ్బు యజమాని వద్ద వీరయ్యకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఇటీవల వీరయ్య తల్లి అనారోగ్యంతో మృతిచెందింది. ఆమెకు తలకొరివి పెట్టి, రుణం తీర్చుకునేందుకు స్వదేశానికి పంపించాలని వీరయ్య తన యజమానిని ప్రాధేయపడ్డాడు. అందుకు ఆ యజమాని నిరాకరించాడు. ‘‘నీ తల్లి రుణం సరే.. నువ్వు లేకపోతే నా ఒంటెల పాలు ఎవరు పితుకుతారు’’ అంటూ ఎదురు ప్రశ్నించాడు. సూడాన్‌ నుంచి కొత్త కాపరి వచ్చే వరకు సెలవు ఇచ్చేది లేదని తేల్చిచెప్పాడు.
 
వీరయ్య సమస్యను అతని కుటుంబీకులు ట్విటర్‌ ద్వారా కేంద్రమంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. కానీ వారి నుంచి ఎలాంటి బదులు రాలేదు. దీంతో ఎలాగైనా తన తల్లిని కడచూపు చూడాలని భావించిన వీరయ్య పారిపోయి భారత్‌కు వచ్చేందుకు ప్రయత్నించాడు. పోలీసులకు చిక్కడంతో వారు తిరిగి యజమానికి అప్పగించారు. వీరయ్య ఫోన్‌ లాక్కొన్న ఆ యజమాని.. అతడిని ఒంటెల క్షేత్రంలో నిర్బంధిండంతో బాహ్యప్రపంచంతో వీరయ్యకు సంబంధాలు తెగిపోయాయి. ఆ ఒంటెల క్షేత్రంలోనే బిక్కుబిక్కుమంటున్న వీరయ్య.. తన తల్లి రుణం తీర్చుకునేందుకు అవకాశం కల్పించాలని తోటి భారతీయులను దీనంగా వేడుకుంటున్నాడు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *