నెలాఖరున టెండర్లు!


  • పీఐబీ కోర్టులో ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ ప్రతిపాదన
  • తుది అనుమతులు లేకున్నా.. టెండర్లకు అవకాశం
  • వారం రోజుల్లో తేలనున్న భవితవ్యం!
  • అంతా సానుకూలమేనంటున్న ఏఏఐ అధికారులు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): అంతర్జాతీయ విమానాశ్రయ బ్రాండ్‌ ఇమేజ్‌ను చాటేలా నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌కు ఈ నెలాఖరున టెండర్లు పిలవనున్నట్టు తెలుస్తోంది. టెర్మినల్‌ బిల్డింగ్‌కు తుది అనుమతులు రాకపోయినా.. ఎన్నికల ముందు కేంద్రప్రభుత్వం హడావిడిగా భూమిపూజ చేసింది. ప్రస్తుతం ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌కు సంబంధించి పబ్లిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బోర్డు (పీఐబీ) ముందు ప్రతిపాదన ఉంది. పీఐబీ అనుమతులు లాంఛనమేనని తెలుస్తోంది. ఎన్నికల కోడ్‌ కారణంగా ఇప్పటివరకు పీఐబీ నుంచి తగిన స్పష్టత రాలేదని తెలుస్తోంది. నోటిఫికేషన్‌కు ముందుగానే భూమిపూజ పూర్తిచేసినందున అనుమతులకు కోడ్‌ అడ్డంకి కాదన్నది పీఐబీ నిర్ణయంగా తెలుస్తోంది. వారం రోజుల్లో పీఐబీ తన నిర్ణయాన్ని వెల్లడించనుంది. పీఐబీ నుంచి గ్రీన్‌సిగ్నల్‌ వచ్చిన వెంటనే టెండర్ల ప్రక్రియ ప్రారంభించేందుకు సంసిద్ధంగా ఉండాలని ఏఏఐ భావిస్తోంది. ఈ మేరకు ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ ప్రాజెక్టుకు మేనేజ్‌మెంట్‌ కన్సల్టెన్సీ (పీఎంసీ)గా ఉన్న ‘స్టుప్‌’ను అప్రమత్తం చేసింది. పీబీఐ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రాగానే.. టెండర్లు పిలవాలని భావిస్తోంది.
 
ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌కు విజయవాడ విమానాశ్రయ అధికారులు రూ. 740 కోట్ల వ్యయంతో ప్రతిపాదనలు రూపొందించారు. కేంద్రం ఈ ప్రతిపాదనలను పరిశీలించాక దానిని రూ. 611 కోట్లకు కుదించింది. దీంతోపాటు ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ కమిటీ (పీఎంసీ)గా స్టుప్‌ సంస్థను కూడా కేంద్రప్రభుత్వమే ఎంపికచేసింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అడుగుపెట్టేవారికి ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ బ్రాండ్‌ ఇమేజ్‌గా కనిపించటానికి వీలుగా స్టుప్‌ సంస్థ డిజైన్లను రూపొందించింది. ఈ డిజైన్లను ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడకముందు ముఖ్యమంత్రి ఎన్‌.చంద్రబాబునాయుడుకు విమానాశ్రయ అధికారులు చూపించారు. డిజైన్లను పరిశీలించిన మీదట ఆయన కొన్ని మార్పులు, చేర్పులకు సూచించారు. ఆ మేరకు స్టుప్‌ సంస్థ మళ్ళీ డిజైన్లను మార్చింది. రాష్ట్రప్రభుత్వం ఫైనల్‌ డి జైన్లను ఆమోదించింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌కు భూమిపూజ చేసింది. నవ్యాంధ్రప్రదేశ్‌కు తలమానికంగా నిలుస్తున్న విజయవాడ విమానాశ్రయం విదేశీయులు సైతం అచ్చెరువొందించేలా చేయటానికి పూర్తిగా టెర్మినల్‌ను గ్లాస్‌, స్టీల్‌ స్ట్రక్చర్‌లో నిర్మించాలని నిర్ణయించారు. ప్రయాణికుల కోసం ఆధునిక వసతులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
 
ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌లో ఆధునిక బ్యాగేజీ హ్యాండ్లింగ్‌ సిస్టమ్‌, అరైవల్‌ బ్యాగేజ్‌ క్లెయిమ్‌ క్లారోసెల్స్‌, సెంట్రల్‌ ఎయిర్‌ కండిషనింగ్‌, పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టమ్‌, ఫైర్‌ అలారం సిస్టమ్‌, ఫ్లైట్‌ ఇన్ఫర్మేషన్‌ డిస్‌ప్లే సిస్టమ్‌, సీసీటీవీ సర్వీయిలెన్స్‌, చెక్‌ ఇన్‌ కౌంటర్‌, కామన్‌ యూజ్‌ టెర్మినల్‌ ఎక్విప్‌మెంట్‌ వంటి వసతులను కల్పించాలని ఆ మేరకు డిజైన్‌లో పొందు పరిచారు. విజయవాడ నగరంతోపాటు, గ్రామీణ సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా ఈ టెర్మినల్‌ బిల్డింగ్‌లో అంతర్గతంగా ఇంటీరియర్‌ చేయాలని ఆమేరకు డిజైన్లు రూపొందించారు. కృష్ణా జిల్లా, అమరావతిలను దృష్టిలో ఉంచుకుని కొండపల్లి బొమ్మలు, కూచిపూడి నృత్యం, మల్లెపూలు, అమరావతి స్తూపం, కృష్ణానదీ పాయల ఆకారాలను డిజైన్స్‌లో పొందు పరిచారు. ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ను మొత్తం 1200మంది హ్యాండ్లింగ్‌ కెపాసిటీతో తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ఈ 1200 మందిలో 800 మంది డొమిస్టిక్‌, 400 మంది అంతర్జాతీయ ప్రయాణికులు ఉంటారు.
 
గన్నవరంలోని ప్రస్తుత విమానాశ్ర యంలో నూతనంగా నిర్మించిన ఇంటీరియం టెర్మినల్‌ బిల్డింగ్‌కు పక్కనే 35 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ను నిర్మించనున్నారు. మొత్తం 24 చెక్‌ ఇన్‌ కౌంటర్స్‌, ఒక బ్యాగేజ్‌ కన్వేయర్‌, 5 బ్యాగేజ్‌ క్లెయిమ్‌ క్లారోసెల్స్‌, ఇమ్మిగ్రేషన్‌ కౌంటర్లు – 14 (డిపార్చర్‌ -4, అరైవల్‌ – 10) కస్టమ్‌ కౌంటర్స్‌ -4 (డిపార్చర్‌ -1, అరైవల్‌ – 3) చొప్పున ఏర్పాటు చేయాలని డిజైన్స్‌ రూపొందించారు. ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ను జీఆర్‌ఐహెచ్‌ఏ 4 స్టార్‌ సదుపాయాలతో కూడిన వసతులను కల్పించాలన్న ఉద్దేశంతో ఎల్‌ఈడీ లైట్లు, లో వీఓసీ పెయింట్‌ / వొలాటైల్‌ ఆర్గానిక్‌ కాంపౌండ్‌, తక్కువ హీట్‌ గెయిన్‌ గ్లేజింగ్‌, ఎనర్షీ ఎఫిషియంట్‌ ఎయిర్‌ కండిషనింగ్‌, నీటి శుద్ధిప్లాంట్‌, డబుల్‌ ఇన్సులేటెడ్‌ పై కప్పులు, మొత్తం 1000 కార్లు, 200 టాక్సీలు సామర్థ్యం ఉన్న కారు / టాక్సీ పార్కింగ్‌ కల్పించాలని నిర్ణయించారు. దీంతోపాటు నూతన ఆఫ్రాన్‌ ముందు ఏరో బ్రిడ్జిలను ఏర్పాటు చేయాలని కూడా డిజైన్లు రూపొందించారు. మొత్తం 3 కోడ్‌ ఈ విమానాలు, ఆరు కోడ్‌ సీ విమానాలు పార్కింగ్‌ చేయటానికి వీలుగా ఆఫ్రాన్‌ను విస్తరించాలన్న ప్రణాళికలు కూడా సిద్ధమయ్యాయి. భూమిపూజ ప్రారంభం కాగానే టెండర్లు పిలవటమే ఆలస్యం అనుకుంటే.. పీఐబీ దగ్గర నుంచి క్లియరెన్స్‌ వచ్చేసరికే .. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చింది. సార్వత్రిక ఎన్నికలు దేశవ్యాప్తంగా జరుగుతున్న నేపథ్యంలో, పీఐబీ గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వటానికి ఆసక్తి చూపించలేదు. ప్రస్తుతం ఇబ్బందులు లేవని గుర్తించిన నేపథ్యంలో, వారం రోజులలో తీపికబురు వస్తుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *