నెల్లూరు పెద్దారెడ్లలో టెన్షన్.. ఫలితాల్లో అటూ-ఇటూ అయితే?


నెల్లూరు పెద్దారెడ్లలో టెన్షన్ తారస్థాయికి చేరడానికి కారణమేంటి? ఎన్నికల ఫలితాల్లో అటూ-ఇటూ అయితే పరిస్థితులు ఎలా మారుతాయి? ఒకప్పుడు రాజకీయాల్లో చక్రంతిప్పిన పెద్దలు ఇప్పుడెందుకు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు? ఆసక్తికరమైన ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే ఈ కథనంలోకి వెళ్లాల్సిందే!
 
    డెబ్బై, ఎనభై ఏళ్లపాటు నెల్లూరు పెద్దారెడ్లు ఏపీ రాజకీయాల్లో చక్రం తిప్పారు. గత ఎన్నికల్లో మాత్రం వారికి కాలం అంతగా కలిసిరాలేదు. అందువల్ల ప్రస్తుత ఎన్నికలు వారి రాజకీయ భవిష్యత్తుకి కీలకంగా మారాయి. నెగ్గేది ఎవరో.. ఒగ్గేది ఎవరో.. అర్థంకాక అందరిలోనూ టెన్షన్ పతాకస్థాయికి చేరింది.
 
   నెల్లూరు పెద్దారెడ్లలో పాపులర్‌ పొలిటీషయన్లు చాలామంది ఉన్నారు. బెజవాడ, ఆనం, నల్లపరెడ్డి, నేదరుమల్లి, మాగుంట, సోమిరెడ్డి, మేకపాటి, ఆదాల కుటుంబాలు ఏపీ రాజకీయాలపై బలమైన ముద్రే వేశాయి. బెజవాడ కుటుంబీకులు క్రమక్రమంగా రాజకీయాలకి దూరమయ్యారు. ఆనమోళ్ల కుటుంబంలో ఏసీ సుబ్బారెడ్డి, వెంకటరెడ్డి, సంజీవరెడ్డి, రామనారాయణరెడ్డిలు అనేక ముఖ్య శాఖలకి మంత్రులుగా పనిచేశారు. సీఎం కావాలనే కోరిక ఒక్కటే ఆ కుటుంబానికి తీరలేదు!
 
    రాజకీయంగా వ్యూహరచనల్లో దివంగత ఆనం వివేకానందరెడ్డిది అందివేసిన చేయి. ఆయన మృతి చెందడం ఆ కుటుంబానికి తీరని లోటే. ఈ ఎన్నికల్లో రామనారాయణరెడ్డి వైసీపీ తరఫున వెంకటగిరి నుంచి పోటీచేశారు. టీడీపీ పక్షాన పొటీచేసిన కురుగుండ్ల రామకృష్ణ గతంలో రాజకీయంగా కొమ్ములు తిరిగిన మాజీమంత్రి నేదరుమల్లి రాజ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్యనాయుడులని ఢీకొని ఓడించారు. ఈసారి ఎన్నికల్లో రామనారాయణరెడ్డిని ఆయన ఓడిస్తే ఇక రామకృష్ణకి తిరిగే ఉండదంటున్నారు విశ్లేషకులు. ఆనం రామనారాయణరెడ్డి కుటుంబం, వారి అనుచరులు.. తమ గెలుపుపై ధీమా వ్యక్తంచేస్తున్నా లోలోన భయం వారిని వెంటాడుతున్న మాట వాస్తవం! ఎందుకంటే- రామనారాయణరెడ్డి ఈసారి ఓటమిపాలయ్యారా.. ఆ కుటుంబానికి రాజకీయ భవిష్యత్తు ఇప్పట్లో ఉండదనే చర్చ జిల్లాలో జోరుగా సాగుతోంది. ఒకవేళ ఎమ్మెల్యేగా ఆయన గెలిచినా, వైసీపీ అధికారంలోకి రాకపోతే ప్రయోజనం ఉండకపోవచ్చునన్న మాట కూడా బలంగా వినిపిస్తోంది.
 
   నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డిల తర్వాత ఆ కుటుంబం నుంచి ప్రసన్నకుమార్‌రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. గతంలో రాజకీయంగా వీరిని అణగదొక్కేందుకు దున్నపోతుల శాఖని ఏర్పాటుచేసి ఆ శాఖ మంత్రి పదవి వీరికిచ్చిన సంగతిని జనం ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. ప్రసన్నకుమార్‌రెడ్డి గతంలో మంత్రిగా పనిచేశారు. గత ఎన్నికల్లో కోవూరు నుంచి పోటీచేసి ఓటమిపాలయ్యారు. ఈ ఎన్నికల్లో మళ్లీ కోవూరు నుంచే బరిలోకి దిగారు. వీరి కుటుంబానికి ఈ ఎన్నికలు ఎంతో కీలకం. బహుశా ఈసారి ఓటమిపాలైతే, రాబోయే ఎన్నికల్లో ప్రసన్నకుమార్‌రెడ్డికి టిక్కెట్టు దక్కే పరిస్థితి కూడా ఉండకపోవచ్చుననే చర్చలు నెల్లూరీయుల మధ్య సాగుతున్నాయి.
 
   దివంగత మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి తన చివరిరోజుల్లో అనారోగ్యంతో బాధపడుతూ కూడా పదవులు అనుభవించారు. చట్టసభలన్నీ చుట్టొచ్చిన ఘనుడాయన. ఆయన సతీమణి రాజ్యలక్ష్మి సైతం మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆమె రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. వారి పెద్దకుమారుడు రాంకుమార్‌రెడ్డి గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున వెంకటగిరి నుంచి పోటీచేసి ఓడిపోయారు. జనార్ధన్‌రెడ్డి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి వీరవిధేయుడు. అయితే.. కాంగ్రెస్‌కి బద్ధవ్యతిరేకమైన బీజేపీలోకి వెళ్లారు రాంకుమార్‌రెడ్డి. అక్కడా ఎక్కువ కాలం ఉండలేకపోయారు. చివరాఖరికి వైసీపీ గూటికి చేరారు. అయితే.. ఈ ఎన్నికల్లో కనీసం టిక్కెట్టు కూడా పొందలేకపోయారు. ఒక్కమాటలో చెప్పాలంటే నేదురుమల్లి వారి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారడం గమనార్హం!
 
   దివంగత మాగుంట సుబ్బరామిరెడ్డి పెద్దఎత్తున సేవా కార్యక్రమాలు, దానధర్మాలు చేస్తూ రాజకీయాల్లోకి వచ్చి రాణించారు. మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారు. అనంతరం ఆయన సతీమణి పార్వతమ్మ, సోదరుడు శ్రీనివాసులరెడ్డి రాజకీయాల్లో కొనసాగారు. పార్వతమ్మ కొంతకాలంగా రాజకీయాలకి దూరమయ్యారు. గత ఎన్నికల్లో ఎంపీగా పోటీచేసి ఓటమిపాలైన శ్రీనివాసులరెడ్డి టీడీపీలో చేరగా, ఆ పార్టీ ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించింది. కానీ.. ఈ ఎన్నికలకి ముందు ఆయన వైసీపీలో చేరారు. ఒంగోలు ఎంపీగా పోటీచేశారు. ఈసారి ఫలితాలు ఏమాత్రం అటూ-ఇటూ అయితే వీరి రాజకీయ మనుగడ కష్టమే అంటున్నారు.
 
   ఏపీ వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిది రాజకీయంగా చిత్రవిచిత్రమైన పరిస్థితి. లక్ష్యం కోసం ఎన్నిసార్లు ఓటమిపాలైనా అలుపెరగక పోరాటం చేయాలనే సిద్ధాంతం ఈయనది. సర్వేపల్లి నియోజకవర్గంలో వరసగా మూడుసార్లు ఓటమి చవిచూశారు. మధ్యలో ఓసారి కోవూరు ఉపఎన్నికల్లో పోటీచేసి, అప్పుడూ పరాజయం పాలయ్యారు. ఈ దఫా ఎన్నికల్లో ఓడిపోతే జిల్లాలో వరుసగా అయిదుసార్లు ఓటమి పాలయిన చరిత్రని ఆయన మూటగట్టుకుంటారు. గత ఎన్నికల్లో సోమిరెడ్డి ఓడిపోయినా ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది తెలుగుదేశం అధిష్టానం. మంత్రి పీఠాన్ని కూడా కట్టబెట్టి గౌరవించింది. ఈ ఎన్నికల్లో పొరపాటున ఆయన ఓడిపోయారో.. ఇక అలాంటి రాచమర్యాదలు ఉండకపోవచ్చునన్న టాక్‌ వినిపిస్తోంది.
 
    మేకపాటి కుటుంబీకులు పోయినసారి ఎన్నికల్లో ఓ ఎంపీ, రెండు అసెంబ్లీ స్థానాల నుంచి వైసీపీ తరఫున పోటీచేశారు. ఈసారి ఎన్నికల్లో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డికి టిక్కెట్టు దక్కలేదు. ఆయన కుమారుడు గౌతమ్‌రెడ్డి ఆత్మకూరు నుంచి పోటీచేయగా, మాజీ ఎమ్మెల్యే బొల్లినేని కృష్ణయ్య గట్టి పోటీ ఇచ్చారు. ఉదయగిరి నుంచి గత ఎన్నికల్లో ఓటమిపాలైన ఆయన సోదరుడు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఈ ఎన్నికల్లోనూ బరిలో నిలిచారు. అయితే ఉదయగిరిలోనూ గెలుపు అంత ఈజీ కాదంటున్నారు విశ్లేషకులు. కనీసం ఒక్క సీటయినా నిలబెట్టుకుంటేనే వీరి కుటుంబానికి రాజకీయంగా మనుగడ ఉంటుంది. లేకుంటే ఉనికి కష్టాలు తప్పవనే చెప్పాలి.
 
    నెల్లూరు పార్లమెంట్ స్థానం నుంచి ప్రతి ఎన్నికల్లోనూ పెద్దారెడ్ల మీద పెద్దారెడ్లే పోటీచేస్తూ ఉండేవారు. ఈసారి వైసీపీ నుంచి మాజీమంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి పోటీచేయగా, టీడీపీ పక్షాన బీసీ వర్గాలకి చెందిన మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు రంగంలోకి దిగారు. ఇక్కడా ఆదాలకి గెలుపు అంత సులువుగా ఏమీ కనిపించడం లేదు. ఇప్పటివరకూ రాజకీయాల్లో ఆదాల ప్రభాకర్‌రెడ్డి పెద్దమనిషిగా చెలామణీ అవుతూ వచ్చారు. ఈ ఎన్నికలకి ముందు చటుక్కున పార్టీ మారాక, ఆయనపై ప్రజల్లో చిన్నచూపు ఏర్పడింది. ఆదాల ఎంపీగా గెలుపొందితే ఇబ్బంది ఉండకపోవచ్చు. ఓటమి పాలయ్యారా.. ఇక అంతే అన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా!
 
   ఏదిఏమైనా.. ప్రస్తుత ఎన్నికలు నెల్లూరు పెద్దారెడ్లకి గతంలో ఎన్నడూ లేనంత కీలకమయ్యాయి. కొందరేమో “మనం గెలుస్తాం.. కానీ ఏపీలో వైసీపీ అధికారంలోకి రాకుంటే ఎలా?” అన్న సందిగ్ధంలో కొట్టిమిట్టాడుతున్నారు. మరికొందరు పోలింగ్ రోజున చివరాఖరులో మహిళల ఓట్లు ఎవరికి పడ్డాయో అర్థంకాక జుట్టు పీక్కుంటున్నారు. లెక్కలు మీద లెక్కలు వేస్తూ ఒక్క క్షణం కూడా ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు.
 
   పెద్దారెడ్ల హైరానా ఇలా ఉంటే, మరోవైపు.. వారి అనుచరుల హడావుడి మరీ ఎక్కువగా ఉందట. ఒకసారేమో “అన్నా.. గెలుపు మనదే” అంటూ ధీమా వ్యక్తంచేస్తున్నారట! మరొకసారేమో.. “రెడ్డన్నా.. అక్కడోళ్లు మనకి ఓట్లు వేయలేదంటన్నా..” అంటూ గుబులు రేపుతున్నారట. ఈ నేపథ్యంలో నవ్వాలేక ఏడ్వాలేక పెద్దారెడ్లు సతమతమవుతున్నారట. కొందరైతే.. “ఏందయ్యా.. ఈ ఎన్నికల సంఘం! ఏపీలో ముందే ఎన్నికలు పెట్టకపోతే ఏంబోయిందా? ఇన్ని రోజులు ఈ టెన్షన్ ఎవడు పడుతాడు?” అంటూ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారట. కోట్లకి కోట్ల రూపాయల ఆస్తులు, డబ్బూ, పడవల్లాంటి కార్లు, ఏసీలు.. ఇలా ఎన్ని ఉన్నా.. ఎక్కడకి పోయినా సమయానికి భోజనం చేయలేక, కుటుంబంతో సరదాగా గడపలేక, రాత్రివేళల్లో నిద్రపట్టక.. నరకం కనిపిస్తోందట నెల్లూరు పెద్దారెడ్లకి! చూద్దాం.. ఈ ఎన్నికల ఫలితాలు ఎవరి రాజకీయ భవిష్యత్తుని ఏ మలుపు తిప్పబోతున్నాయో?!

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *