నేను బతికే ఉన్నాను: మణిశంకర్ అయ్యర్


న్యూఢిల్లీ: బాలాకోట్ దాడుల్లో తాను చనిపోయినట్టు సోషల్ మీడియాలో కొందరు చేస్తున్న దుష్ప్రచారాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ తిప్పికొట్టారు. తాను బతికే ఉన్నానని, లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బిజీగా తిరుగుతున్నానని చెప్పారు.
 
తరచు వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియా పతాక శీర్షికల్లో కనిపించే మణిశంకర్ అయ్యర్ లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి ఉద్దేశపూర్వకంగానే దూరంగా ఉన్నారని భావిస్తున్న ఆయన విమర్శకులు, ఏకంగా అయ్యర్ మరణించారంటూ మెసేజ్‌లు సర్క్యులేట్ చేశారు. ఈ విషయం తన దృష్టికి కూడా వచ్చిందని అయ్యర్ తెలిపారు. ఫిబ్రవరి 26న పాకిస్థాన్‌లోని బాలాకోట్ ఉగ్రస్థావరాలపై భారత వైమానికి దళం జరిపిన దాడుల్లో మణిశంకర్ అయ్యార్ చనిపోయారంటూ కొందరు ప్రచారం సాగించడం గమనించానని చెప్పారు. ‘నేను చనిపోయానని ఆశలు పెట్టుకున్న వారికి నేను నిక్షేపంగా బతికే ఉన్నానని చెప్పడానికి చింతిస్తున్నాను’ అంటూ మణిశంకర్ అయ్యర్ చురకలు వేశారు.
 
పార్టీ తరఫున తాను దక్షిణాదిన ప్రచారం చేస్తున్నానని, బీజేపీకి తమిళం అర్ధం కాదని కూడా ఆయన ఎద్దేవా చేశారు. ప్రస్తుతం తాను ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్, లక్నోకు వెళ్తున్నట్టు చెప్పారు. అయితే పార్టీ తనకు ఎలాంటి అధికార ఎన్నికల బాధ్యతలు అప్పగించలేదని మణిశంకర్ అయ్యర్ వివరణ ఇచ్చారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *