"నోటు ఇస్తేనే ఇక్కడినుంచి కదులుతాం'' అంటూ రచ్చ ఎక్కడ జరిగింది?


ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికలు ఎందుకు అబాసుపాలవుతున్నాయి? నోటు కోసం ఓటర్లు అభ్యర్థుల ఇళ్ళపైకి వెళ్ళి నిలదీసే పరిస్థితి ఎందుకొచ్చింది? నోటు ఇస్తేనే ఓటు వేస్తామంటూ అర్థరాత్రి వేళల్లో ఆందోళనకు దిగింది ఎవరు? ఈసారి పోలింగ్‌ సమయంలో దళారీ నేతలపై ఎలాంటి ఆరోపణలొచ్చాయి? రాజమహేంద్రవరంలో నెలకొన్న తాజా పరిణామాలపై ఆసక్తికర కథనం మీకోసం!
 
    పోలింగ్‌ సందర్భంగా రాజమహేంద్రవరంలో చిత్రవిచిత్ర పరిణామాలు చోటుచేసుకున్నాయి. అధికార, విపక్షాలు సహా ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులు పోటీపడి మరీ ఎన్నికల ప్రచారం సాగించారు. ప్రచారపర్వం ముగిశాక.. ఆయా పార్టీల అభ్యర్థుల పక్షాన పలువురు వ్యక్తులు రంగప్రవేశం చేశారు. ప్రలోభాలకు దిగారు. ఓటుకు నోటు పంపకాల్లో బిజీ అయ్యారు. అయితే ఇక్కడే గడబిడలు చోటుచేసుకున్నాయి. ముందస్తు ప్రణాళిక ప్రకారం పోలింగ్‌కు మూడు రోజుల ముందే అభ్యర్ధులు తమ అనుచరుల వద్దకు అవసరమైన సొమ్ములు చేరవేశారట. అయితే అభ్యర్థులు వద్ద తీసుకున్న నగదును కొంతమంది మధ్యవర్తులు ఓటర్లకు పంపిణీ చేయకుండా కాజేశారట. పోలీసు తనిఖీల సాకు చెప్పి మరికొందరు నేతలు నగదు పంపిణీ చేయకుండా కామ్‌గా నొక్కేశారట!
 
    తమకి అందాల్సిన పైకం చేతిలో పడకపోవడంతో రాజమహేంద్రవరంలో కొందరు ఓటర్లు రోడ్డెక్కడం తాజా కోణం. కొద్దిమందికే నోట్ల పంపిణీ జరగడంతో మిగతా వర్గాల వారు ఆగ్రహించారు. ఈ విషయంతో ప్రమేయమున్న దళారీ నేతల ఇళ్లకు వెళ్లి గట్టిగా ప్రశ్నించారు. వారి ఇళ్లముందు ఆందోళనలకి దిగారు. అయినా ఫలితం కనిపించకపోవడంతో అర్థరాత్రిపూట ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్ధుల ఇళ్లకు వెళ్లి జరిగిన విషయాన్ని వారికి పూసగుచ్చారట. ఈ సంగతి రచ్చకెక్కితే పరిస్థితి నెగటివ్‌గా మారుతుందని ఆయా అభ్యర్థులు బెంగటిల్లారట. ఈ నేపథ్యంలో ఆందోళన చేస్తున్నవారికి అప్పటికప్పుడు రహస్యంగా నగదు ఏర్పాటుచేసి చల్లబరిచారట!
 
   “నోటు ఇస్తేనే ఇక్కడినుంచి కదులుతాం” అంటూ ఒక పార్టీ అభ్యర్థి ఇంటిముందు కొందరు ఓటర్లు భీష్మించిన సంఘటన కూడా రాజమహేంద్రవరంలో చోటుచేసుకుంది. పరిస్థితి చేయిదాటిపోవడంతో.. సదరు అభ్యర్థి ఇంటికి పోలీసులు వెళ్లి ఆందోళన చేస్తున్నవారికి నచ్చచెప్పి పంపించేశారట. పోలింగ్ రోజున సైతం కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి సన్నివేశాలే కనిపించాయి. నోటు అందని కొందరు ఓటర్లు పోలింగ్ బూత్‌కి వెళ్లకుండా ఇళ్ళవద్దే ఉండిపోయారు. నాయకులు వచ్చి తమకు న్యాయం చేస్తేనే ఓటు వేస్తామని మొండికేశారు. దీంతో ఆయా పార్టీల నాయకులు అప్రమత్తమయ్యారట. తమదైన శైలిలో వారిని చల్లబరిచి పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లిలా చేశారట!
 
    పోలింగ్‌ ముగిసినప్పటికీ అభ్యర్థుల గుండెల్లో మాత్రం రైళ్లు పరిగెడుతున్నాయి. తమ దగ్గర డబ్బులు తీసుకున్న ఓటర్లు తమకే ఓటేశారా? లేక వేరే పార్టీకి వేశారా? అన్న డైలామా వారిని నిద్రపోనివ్వడం లేదు. రాజమండ్రి అర్బన్ నియోజకవర్గం పరిధిలో రెండు లక్షల 40 వేలమంది ఓటర్లున్నారు. వీరిలో లక్షా 20 వేల మందికి నగదు పంపిణీ చేయడానికి అభ్యర్థులు ఏర్పాట్లు చేసినట్టుగా వినికిడి! ఈ మేరకు ఆయా వార్డుల్లోని నాయకుల వద్దకు మూడు రోజుల ముందే నగదు మూటలు చేరాయట! అయితే చోటామోటా నాయకులు చేతివాటం చూపారట. కేవలం 50 వేలమందికి మాత్రమే నగదు పంపిణీ చేసి.. మిగతా సొమ్మును కాజేశారట! ఈ విషయం ఆ నోటా ఈ నోటా బయటికి పొక్కడంతో కొందరికి కడుపు మండిందట! ఆయా నేతల ఇళ్లకు వెళ్లి నిలదీశారట.
 
   పోలింగ్‌ సందర్భంగా రాజమహేంద్రవరంలో నెలకొన్న పరిస్థితులే అభ్యర్థుల టెన్షన్‌కి కారణం. ఓటర్లకు చేరాల్సిన డబ్బులు మధ్యలో కొందరు స్వాహా చేయడం, ఈ సంగతి తెలిసి ఓటర్లు ఆందోళనలు చేయడం అనేది వారిని కలవరపెడుతోంది. అందుకే ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతున్నదీ అన్న సందేహం వారిని పీడిస్తోంది. తమ నుంచి నగదు వెళ్లినా.. అది చేరాల్సిన వారికి పూర్తిస్థాయిలో చేరలేదని వారికి అర్థమైంది. సొంత పార్టీ నేతలే తమ కొంప ముంచేలా ఉన్నారని వారు ఇప్పుడు తెగ ఫీలవుతున్నారు. దీనికి తోడు ఓటర్లు కూడా తమకు పైకం అందకపోతే ఊరుకోలేదు. అభ్యర్థుల ఇళ్లకే వెళ్లి డిమాండ్‌ చేశారు. ఈ పరిణామం కూడా ఆయా పార్టీల అభ్యర్థులను కలవరపెడుతోంది. ఇకపై ఎన్నికల రాజకీయాల్లో కొనసాగాలంటే డబ్బు ఒక అనివార్య అంశంగా మారిందని కొందరు నేతలు ఆందోళన చెందుతున్నారు కూడా!
 
   అంతర్గతంగా చోటుచేసుకున్న పరిస్థితులు బయటికి పొక్కడంతో.. రాజమహేంద్రవరంలో అభ్యర్థులు అప్రమత్తమయ్యారట. ఎక్కడెక్కడ డబ్బులు సరిగా పంపిణీ కాలేదో ఆరాతీసి… సదరు బాధ్యులను ప్రశ్నిస్తున్నారట. తాము ఇచ్చిన పైకాన్ని తిరిగి ఇవ్వమని ఒత్తిడి తెస్తున్నారట. ఈ తరుణంలో అభ్యర్థుల దగ్గర నగదు తీసుకున్న దళారీ నేతలు తప్పించుకు తిరుగుతున్నారట! ఇదిలా ఉంటే.. రాజమండ్రి రూరల్‌ అభ్యర్థులను మరో టెన్షన్‌ కూడా వెంటాడుతోంది. తమకు డబ్బులు అందలేదని అందోళన చేసిన కొందరు ఓటర్లు కసితో పోలింగ్‌బూత్‌లకు వచ్చి ఓట్లు వేశారట. ఈ పరిణామం వారికి మింగుడుపడటం లేదు. నోటు అందనివారు బాహాటంగా కొన్ని హెచ్చరికలు కూడా చేస్తున్నారట. వచ్చే ఎన్నికల్లో మళ్లీ తమ ఇళ్లకు ఆయా నేతలు ఎలా వస్తారో చూస్తాం అంటున్నారట!
 
   ఇదండీ పోలింగ్‌ సందర్భంగా రాజమహేంద్రవరంలో నెలకొన్న వింత పరిస్థితి! ఒకపక్క కోట్లు కుమ్మరించామని అభ్యర్థులు గోల పెడుతుంటే.. మరోపక్క తమకు నోటు అందలేదని ఓటర్లు గగ్గోలు పెట్టడం విచిత్రం కాక మరేంటి చెప్పండి! చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా అని పెద్దలు చెప్తుంటారు. ఓటర్లకు నోట్లు అలవాటు చేసిన రాజకీయ నాయకులకు ఈ మాట ఇప్పుడు అతికినట్టు సరిపోతుంది!

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *