పకడ్బందీగా రీపోలింగ్‌


  • ఒక్క దుస్సంఘటనాజరగడానికి వీల్లేదు
  • ఏజెంట్‌ లేదా అభ్యర్థి ఎవరో ఒకరినే బూత్‌లోకి అనుమతించాలి
  • రౌడీషీటర్లు, ఎన్నికల నిందితులను బైండోవర్‌ చేయండి
  • ఐదు రీ పోలింగ్‌ కేంద్రాలకు పటిష్ఠ బందోబస్తు
  • నాలుగు జిల్లాల ఎస్పీలతో డీజీపీ సమీక్ష
గుంటూరు, ఏప్రిల్‌ 18 : రీ పోలింగ్‌ జరుగనున్న కేంద్రాల్లో ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని డీజీపీ ఆర్‌పీ ఠాకూర్‌ ఆదేశించారు. రేంజ్‌ పరిధిలోని గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఐదు బూత్‌ల్లో రీ పోలింగ్‌ జరగనున్న నేపథ్యంలో గురువారం గుంటూరులోని పోలీసు కార్యాలయంలో నాలుగు జిల్లాల ఎస్పీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా రీ పోలింగ్‌కు దారితీసిన కారణాలను అడిగి తెలుసుకున్నారు. కేవలం ఎన్నికల అధికారుల లోటుపాట్ల వల్లే రీ పోలింగ్‌కు దారి తీసినట్లు ఎస్పీలు వివరించారు. గుంటూరు నగరంలోని నల్లచెరువు 25వ లైన్‌లో గల 244వ పోలింగ్‌ బూత్‌లో పోలింగ్‌ అధికారి (పీవో) ముందుగానే స్లిప్‌లు జారీ చేయడంతో గంద రగోళం నెలకొని వివాదం చోటు చేసుకుందని, దీంతో రిటర్నింగ్‌ అధికారి పోలింగ్‌ను నిలిపివేశారని అర్బన్‌ ఎస్పీ విజయరావు తెలిపారు. నరసరావుపేట పరిధిలోని కేశా నుపల్లిలో గల 94వ నెంబరు పోలింగ్‌ బూత్‌లో మాక్‌పోలింగ్‌ నిర్వహించిన అనంతరం ఈవీఎంను రీఫ్రెష్‌ చేయకుండా అధికారి అదేవిధంగా కొనసాగించడంతో సమస్య వచ్చిందని రూరల్‌ ఎస్పీ రాజ శేఖర్‌బాబు వివరించారు. ప్రకాశం జిల్లాలో ఒక పోలింగ్‌ బూత్‌లో ఆలస్యం కారణంగా, నెల్లూరు జిల్లాలో మాక్‌పోలింగ్‌ విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వంటి కారణాల వల్లే రీపోలింగ్‌ అనివార్య మయ్యిందని ఆయా జిల్లాల ఎస్పీలు సిద్దార్థ కౌసిగి, ఐశ్వర్యరస్తోగి డీజీపీకి వివరించారు.
 
డీజీపీ ఠాకూర్‌ మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో ఒక బూత్‌లోనే రీ పోలింగ్‌ జరుగు తున్న నేపథ్యంలో ఆయా అభ్యర్ధులంతా బూత్‌లోకి వస్తారని, మరో వైపు ఏజెంట్లు కూడా ఉంటారని, దీంతో పోలింగ్‌ బూత్‌ రద్దీగా మారుతుందన్నారు. గుంటూరు వెస్ట్‌లో ఏకంగా 34 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్న నేపథ్యంలో రీ పోలింగ్‌ సందర్భంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో అభ్యర్థి లేదంటే ఏజెంట్‌ల్లో ఒకరిని మాత్రమే బూత్‌లోకి అనుమతించాలన్నారు. లేదంటే కలెక్టర్‌తో చర్చించి వారు వచ్చి వెళ్ళేందుకు ఏదో ఒక సమయం తీసుకుని ఆ సమయంలోనే మాత్రమే అనుమతించేలా చూడాలన్నారు. అంతేకాక ఆయా పోలింగ్‌ బూత్‌ల పరిధిలోని రౌడీషీటర్లను బైండోవర్‌ చేయాలన్నారు. ఆ బూత్‌ పరిధిలోని ప్రాంతంలో స్థానిక ఓటర్లను తప్ప బయట వారిని అనుమతించవద్దన్నారు. తనిఖీలు నిర్వహించే సమయంలో వీడియోతో పాటు రెవెన్యూ అధికారులను కూడా తీసు కెళ్లాలన్నారు. కేవలం పోలీసులు మాత్రమే తనిఖీలు నిర్వహిస్తే ఆరోపణలు వచ్చే అవకాశం ఉందన్నారు. బైండోవర్‌ చేసిన తరువాత కూడా ఎన్నికల నేరాల్లో పాల్గొన్న వారు ఉంటే గుర్తించాలన్నారు. వారిపై తహసీల్దార్లకు నివేదిక పంపాలన్నారు. సమావేశంలో ఎల్‌అండ్‌వో అదనపు డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌, రేంజ్‌ ఐజీ ఆర్‌కె మీనా, అదనపు ఎస్పీలు, డీఎస్పీలు పాల్గొన్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *