'పప్పూ' ఎవరో, 'జుమ్లా' ఎవరో తేలిపోయింది: శత్రుఘ్నసిన్హా


వడోదర: ప్రధాని నరేంద్ర మోదీపై నటుడు, కాంగ్రెస్ నేత శత్రుఘ్నసిన్హా మరోసారి విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీపై కాంగ్రెస్ ఘనవిజయం తర్వాత ఎవరు ‘పప్పూ’నో, ఎవరు ‘అబద్ధాలకోరో’ తేలిపోయిందన్నారు. ‘ఇప్పుడు చెప్పండి ఎవరు పప్పూ…ఎవరు ఫేకూ (తప్పుడు హామీలు ఇచ్చేవారు)?. మూడు రాష్ట్రాల్లో నెగ్గిందెవరు?’ అని ఆయన ప్రశ్నించారు. రాహుల్ గాంధీని బీజేపీ తరచు ‘పప్పూ’ అని విమర్శించడం, పీఎం ‘అబద్ధాల కోరు’ అంటూ కాంగ్రెస్ విమర్శిచండం చాలాకాలంగా పరిపాటిగా వస్తోంది.
 
తప్పుడు వాగ్దానాలు ఇవ్వడంలో మోదీకి మోదీనే సాటి అని, 2022, 2024, 2029లో కూడా మోదీ అబద్ధాలు ఆడుతునే ఉంటారని, అప్పుడు కూడా ఆయన ప్రధాని కాబోవడం లేదని శత్రుఘ్నసిన్హా తాజా విమర్శలు సంధించారు. వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ)తో లక్షలాది మంది యువకులు ఉద్యోగాలు కోల్పోయారని, చిన్న, మధ్యతరహా వ్యాపారులు కుదేలయ్యారని, ఫ్యాక్టరీల ఉత్పత్తి 50 శాతానికి పడిపోయిందని ఆయన అన్నారు. ‘రాఫెల్ ఒప్పందం, పెద్దనోట్ల రద్దు నిర్ణయం, జీఎస్‌టీ అంశాల్లో నేను మోదీకి ప్రధాన విమర్శకుడిని. ఈ అంశాల్లో పార్టీ సీనియర్ నేతలను కానీ, క్యాబినెట్ మంత్రులను కానీ ప్రధాని ఏనాడూ సంప్రదించలేదు. ఆ కారణంగానే నేను ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరాను’ అని శత్రుఘ్నసిన్హా చెప్పారు. ఇటీవలే ఆయన కాంగ్రెస్‌లో చేరుతూ రాహుల్ గాంధీని ‘డేషింగ్, డేరింగ్, ఛార్మింగ్’ నేత అని కొనియాడారు. 2019 ఎన్నికల్లో మోదీ గెలవడం అసంభమమని షాట్‌గన్ ఢంకా బజాయిస్తున్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *