పబ్లిసిటీ స్టంట్‌ కోసమే నాపై పిటిషన్ : సాధ్వి


ముంబై: ఎన్నికల్లో పోటీ చేయకుండా తనను నిరోధించాలంటూ 2019 మాలేగావ్ పేలుళ్ల కేసులో బాధితుడి తండ్రి నిసార్ సయ్యద్ వేసిన పిటిషన్‌లో ఏమాత్రం పసలేదని భోపాల్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి, మాలేగావ్ పేలుళ్ల నిందితురాలు సాధ్వి ప్రగ్యా సింగ్ ఠాకూర్ అన్నారు. కేవలం రాజకీయ ఉద్దేశాలతో తనపై పిటిషన్‌ వేశారని, ఇదో పబ్లిసిటీ స్టంట్‌ అని ఆమె పేర్కొన్నారు. ప్రగ్యాను పోటీ చేయకుండా నిరోధించాలంటూ నిసార్ సయ్యద్ గత శుక్రవారం కోర్టును ఆశ్రయించగా, ప్రగ్యా మంగళవారంనాడు తన న్యాయవాది ద్వారా ఎన్ఐఏ కేసుల ప్రత్యేక న్యాయమూర్తి వీఎస్ పడాల్కర్‌కు తన వాదన వినిపించారు.
 
మాలేగావ్ పేలుళ్ల కేసు విచారణలో ఉన్నందున ప్రగ్యాను పోటీకి అనర్హురాలిగా చేసి కోర్టు విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశించాలని పిటిషనర్ తన అప్లికేషన్‌లో కోరారు. ఆరోగ్య కారణాల వల్ల ఆమె బెయిలుపై బయట ఉన్నారని, మండుటెండల్లో ప్రచారం చేసేందుకు తగినంత ఆరోగ్యం ప్రగ్యాకు ఉన్నందున ఆమె కోర్టును తప్పుదోవ పట్టించినట్టు అర్ధమవుతోందన్నారు. దీనిపై ప్రగ్యా ఎన్ఐఏ కోర్టుకు వివరణ ఇస్తూ, పిటిషనర్ కోర్టు సమయాన్ని వృథా చేయడంతో పాటు కోర్టు ప్రతిష్టను తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారని ఎదురుదాడి చేశారు. పిటిషనర్ కేవలం ప్రచారం కోసం, రాజకీయ అజెండాతోనే కోర్టును తప్పదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని సాధ్వి ఆరోపించారు. వెంటనే ఆ అప్లికేషన్‌ను కొట్టివేయాలని, ఏమాత్రం పసలేని పిటిషన్ వేసినందుకు ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని తన లాయర్ ద్వారా ప్రత్యేక కోర్టుకు ఆమె విజ్ఞప్తి చేశారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *