పవర్‌ ఫుల్‌.. నిపుణులు నిల్‌


  • పేరుకే పెద్దాసుపత్రి.. ఫ్యూజు పోతే వేసే దిక్కులేదు
  • కరెంటు పోతే రోగులకు చీకట్లోనే వైద్యసేవలు
  • విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో దుస్థితి
ఒకవైపు ఔట్‌పేషెంట్‌ (ఓపీ) విభాగం.. మధ్యలో అత్యవసర వైద్యసేవల (క్యాజువాలిటీ) విభాగం.. మరోవైపు వైద్య పరీక్షల (డయాగ్నొస్టిక్స్‌) విభాగం.. ఇలా మూడు అతి పెద్ద బ్లాకులు.. వెయ్యికి పైగా పడకలు.. పది ఆపరేషన్‌ థియేటర్లు.. పదిహేనుకు పైగా వెంటిలేటర్లు.. ఆక్సిజన్‌ ప్లాంట్లు.. రూ. కోట్ల విలువ చేసే అత్యాధునిక వైద్య పరికరాలు.. నిపుణులైన వైద్యులు.. సుశిక్షితులైన వైద్య సిబ్బందితో రాష్ట్ర రాజధాని నగరంలో పేదలకు పెద్దదిక్కుగా ఉన్న విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ు మెరుగైన వైద్యసేవల సంగతి పక్కనబెడితే.. ఇంత పెద్దాసుపత్రిలో విద్యుత్‌ సరఫరా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. ఫ్యూజు పోతే వెంటనే వేసి విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించే దిక్కు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆసుపత్రిలో కనీస స్థాయిలో ఎలక్ట్రీషియన్స్‌ లేకపోవడమే కారణం. రాష్ట్ర రాజధాని నగరంలో అతిపెద్ద బోధనాసుపత్రికి ఈ దుస్థితి ఏంటనే ప్రశ్నకు ఆసుపత్రి అధికారులు సైతం సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు.
 
విజయవాడ ఆంధ్రజ్యోతి: నవ్యాంధ్రలో విజయవాడ ప్రభుత్వాసుపత్రి ప్రాధాన్యం పెరిగింది. రాజధాని నగరంలో ఉన్న ఏకైక పెద్దాసుపత్రి కావడంతో ప్రభుత్వం దీని అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. అంతకుముందు 415 పడకలతో ఉండే ఆసుపత్రిని వెయ్యికి పైగా బెడ్లతో స్థాయిని పెంచింది. దశలవారీగా వైద్యులు, సిబ్బందిని నియమిస్తూ ఆధునిక వైద్య పరికరాలు సమకూరుస్తోంది. ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య పెరుగు తోంది. రోజూ రెండు వేలకు పైగా ఔట్‌ పేషెంట్లు వచ్చి ఇక్కడ వైద్యసేవలు పొందుతున్నారు. ఒక ట్రాన్స్‌ఫార్మర్‌, జనరేటర్‌ మాత్రమే ఉండే ప్రభుత్వ ఆసుపపత్రిలో మూడేళ్ల క్రితం కృష్ణా పుష్కరాల సమయంలో 11 కె.వి. సబ్‌స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. దీనికి అనుబంధంగా మూడు 315 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్లు, వాటి నుంచి విద్యుత్‌ సరఫరా నిమిత్తం ప్రధాన పవర్‌ రూంలో డిస్ట్రిబ్యూషన్‌ ప్యానల్స్‌ రెడీ చేశారు. వాటి నుంచి వివిధ విభాగాలకు అండర్‌గ్రౌండ్‌ కేబుల్స్‌ ద్వారా విద్యుత్‌ సరఫరాకు ఏర్పాటు చేశారు. మూడు బ్లాకుల్లో ఎక్కడికక్కడ లోకల్‌ డిస్ట్రిబ్యూషన్‌ ప్యానల్స్‌ ఉన్నాయి. విద్యుత్‌ సరఫరాలో సమస్యలు ఏర్పడినప్పుడు ఆసుపత్రిలో రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా ఒక 250 కె.వి. జనరేటర్‌, రెండు 125 కె.వి. జనరేటర్లను ఏర్పాటు చేశారు. ఇవి కాకుండా పెరుగుతున్న అవసరాల మేరకు డయాగ్నొస్టిక్స్‌ బ్లాక్‌ వద్ద మరొక ట్రాన్స్‌ఫార్మర్‌, జనరేటర్‌ను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలున్నాయి.
 
నిర్వహణ సిబ్బంది కొరత
ప్రభుత్వ ఆసుపత్రిలో అవసరాలకను గుణంగా విద్యుత్‌ వ్యవస్థ విస్తరిస్తున్నా దాని ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌కు అవసరమైన సాంకేతిక నిపుణుల (ఎలక్ట్రీషియన్స్‌)ను నియమించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆసుపత్రిలో పవర్‌ సిస్టమ్‌ సక్రమంగా ఉండాలంటే 11 కె.వి.సబ్‌స్టేషన్‌, ట్రాన్స్‌ఫార్మర్లు, హైటెన్షన్‌ (హెచ్‌టీ), లో టెన్షన్‌ (ఎల్‌టీ) స్విచ్‌ గేర్లు, జనరేటర్లు, డిస్ట్రిబ్యూషన్‌ ప్యానల్స్‌, ఎర్త్‌పిట్స్‌, కేబుల్స్‌ నిర్వహణపై సాంకేతిక నిపుణుల పర్యవేక్షణ షిఫ్టుల వారీగా నిరంతరం ఉండాలి. విద్యుత్‌ సరఫరాలో సమస్యలు గుర్తించి పరిష్కరించడానికి అవసరమైన సహాయక సిబ్బంది అందుబాటులో ఉండాలి. డిస్ట్రిబ్యూషన్‌ ప్యానల్స్‌ వద్ద 24 గంటలూ సిబ్బంది పర్యవేక్షణ ఉండాలి. పీరియాడికల్‌ సర్వీసింగ్‌లో భాగంగా విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లలో ఆయిల్‌ మార్చడం, జనరేటర్లను శుభ్రపరచడం చేయాలి. విస్తృతస్థాయిలో ఉన్న ఆసుపత్రి పవర్‌ సిస్టమ్‌కు సంబంధించిన రికార్డులు, లాగ్‌ బుక్స్‌, రిజిస్టర్లు పక్కాగా ఉండాలి. ఈ పనులన్నింటినీ చేసేందుకు అవసరమైన సిబ్బందిని నియమించకపోవడంతో పైన పేర్కొన్న వాటిలో ఏ పనీ సక్రమంగా జరగడం లేదు. కనీసం ఫ్యూజు పోతే వేసే దిక్కులేని పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయి.
 
కనీసం 15 మంది ఎలక్ట్రీషియన్స్‌ అందుబాటులో ఉంటే తప్ప ఆసుపత్రిలో విద్యుత్తు వ్యవస్థను పర్యవేక్షించడం, సమస్యలను త్వరితగతిన పరిష్కరించడం సాధ్యం కాదు.
 

పవర్‌ సిస్టమ్‌ మెయింటెనెన్స్‌కు టెండర్లు
ప్రభుత్వాసుపత్రిలో ఎలక్ట్రీషియన్స్‌ కొరత ఉన్నందున హాస్పిటల్‌ సూపరింటెం డెంట్‌ కోరిక మేరకు 11 కె.వి.సబ్‌స్టేషన్‌, ట్రాన్స్‌ఫార్మర్లు, హెచ్‌టీ, ఎల్‌టీ స్విచ్‌గేర్లు, జనరేటర్లు, డిస్ట్రిబ్యూషన్‌ ప్యానల్స్‌, ఎర్త్‌పిట్స్‌, కేబుల్స్‌.. ఇలా మొత్తం పవర్‌ సిస్టమ్‌ మెరుగ్గా పనిచేసేందుకు వీలుగా రౌండ్‌ ది క్లాస్‌ ఆపరేషన్స్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ కోసం 2016-17లోనే ప్రైవేటు సంస్థల నుంచి టెండర్లు ఆహ్వానించాం. అప్పట్లో ఎవరూ ముందుకు రాలేదు. మళ్లీ కొత్తగా టెండర్లు పిలిచేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
 
– ప్రవీణ్‌రాజ్‌, ఈఈ, ఏపీఎంఎస్‌ఐడీసీ
 

విధుల్లో ఒకరు, ఇద్దరే..
ప్రభుత్వాసుపత్రిలోని విద్యుత్‌ వ్యవస్థ మొత్తాన్ని పర్యవేక్షించేందుకు ప్రస్తుతం ఐదుగురు ఎలక్ట్రీషియన్స్‌ మాత్రమే ఉన్నారు. వీరు మూడు షిఫ్టుల్లో విధులు నిర్వహిస్తున్నారు. రోజూ ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇద్దరు ఎలక్ట్రీషియన్స్‌ విధుల్లో ఉంటున్నారు. మఽధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 గంటల వరకు ఒకరు, రాత్రి 8 నుంచి ఉదయం 8 వరకు ఒకరు చొప్పున విధుల్లో ఉంటారు. ఈ ఐదుగురిలో ఒకరు వారాంతపు సెలవులో ఉంటారు. ఎవరైనా అనారోగ్య కారణాలతోనో, అత్యవసర పరిస్థితుల్లోనో సెలవు పెట్టాల్సి వస్తే.. మిగిలిన సిబ్బందే సర్దుబాటు చేసుకుని ఓవర్‌టైమ్‌ డ్యూటీలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. రాత్రి పూట ఏదైనా సాంకేతికపరమైన కారణాలతోనో.. లేదా ఒక్కసారిగా వచ్చే గాలి దుమారం వంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగానో కరెంటు పోతే.. విధుల్లో ఉన్న ఎలక్ట్రీషియన్‌ ఒక్కడే సమస్య ఎక్కడ ఉందో తెలుసుకోవడం కష్టమవుతోంది. సమస్యను పక్కనబెట్టి రాత్రిపూట ఆసుపత్రి ఆవరణలో దూరంగా ఉన్న జనరేటర్లను ఆన్‌ చేయడం కూడా ఒక్కడితో సాధ్యమయ్యే పనికాదని, రాత్రిపూట హెల్పర్లు కూడా అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఎలక్ట్రీషియన్స్‌ వాపోతున్నారు. కొత్త ప్రభుత్వాసుపత్రితోపాటు.. హనుమాన్‌పేటలో ఉన్న పాత ఆసుపత్రిలోనూ కరెంటు కష్టాలు ఇలాగే ఉన్నాయి.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *