పవిత్ర సంగమం.. వెలవెల


  • కృష్ణా నదిలో పడిపోతున్న నీటి మట్టం
  • వేట బంద్‌తో జీవనోపాధికి లేక మత్స్యకార్మికుల ఇబ్బందులు
సమస్త జీవ కోటికి నీరే ప్రణాధారం. అలాంటి నీరు లేకపోతే మనుషులతో పాటు పశు పక్ష్యాదుల జీవనం దుర్భరం కావడం ఖాయం. ప్రస్తుతం కృష్ణా నదిలో నీటి మట్టం కనిష్ఠ స్థాయికి పడిపోవడంతో తాగునీటి ఇబ్బంది తలెత్తే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కృష్ణానది మీద ఆధార పడి జీవించే మత్స్యకార కుటుంబాలకు, ఇసుక లోడు చేసే కుటుంబాలకు జీవనం కష్టంగా సాగుతోంది. ఏప్రిల్‌ మూడో వారంలోనే పరిస్థితి ఇలా ఉంటే మే, జూన్‌ మాసాలు గడిచేది ఎలా అని పలువురు ఆందోళన చెందుతున్నారు. కృష్ణానదిలో ప్రమాద ఘంటిలు మోగిస్తున్న నీటి నిల్వ సామర్థ్యంపై సమగ్ర కథనం.
 
ఫెర్రీ (ఇబ్రహీంపట్నం), ఏప్రిల్‌, 19: కృష్ణా నదిలో నీటి మట్టం కనీస స్థాయి చేరడంతో తాగునీటి సమస్య తలెత్తనుంది. గతంలో మేలో ఎదురయ్యే పరిస్థితులు ఇపుడు ఏప్రిల్‌లోనే ఎదురవుతుండటంతో ఆందోళన కలిగిస్తుంది. ఇంకా అసలైన వేసవి కాలం 40 రోజులు పాటు రాజధాని ప్రాంతంలో తాగునీటి అవసరాలు తీర్చాలి. నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో నివాస ప్రాంతం పెరిగి పోవటంతో తాగునీటి వాడకం రోజురోజుకు పెరిగిపోతోంది. ఇప్పటికే తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొండపల్లి, ఇబ్రహీంపట్నం మేజర్‌ గ్రామాలతో పాటు మైలవరం నియోజకవర్గంలో 104 గ్రామాలకు తాగునీరు సరఫరా అవుతుంది. రెండు రోజుల క్రితం కలెక్టర్‌ ఇంతియాజ్‌ ఇబ్రహీంపట్నం రక్షిత మంచినీటి పథకాన్ని పరిశీలించి తాగునీటి ఎద్దడి రాకుండా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కానీ రెండో రోజు కొండపల్లిలో నీటి సరఫరాకు అంతరాయం కలిగింది. మరో వైపు కృష్ణా నది నీరు లేక వెలవెలబోతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా పవిత్ర సంగమం వద్ద, నది మధ్యలో సైతం ఇసుక మేటలు కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తుంది.
 
మత్స్యకార్మికులకు చేపల వేట బంద్‌
కృష్ణా నదిలో సరిపడ నీరు లేకపోవటంతో చేపలు కూడ మృత్యువాత పడుతున్నాయి. గత ఏడాది వర్షాకాలంలో ప్రభుత్వం మత్స్యకార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు మత్స్యశాఖ ఆధ్వర్యంలో సుమారు 40 లక్షల చేప పిల్లలను నదిలోకి వదిలిపెట్టింది. ప్రస్తుతం నీరు సరిపడా లేకపోవుటంతో చేపలు మృత్యువాత పడుతున్నాయి. మత్స్యకార్మికులు చేపల వేట కూడ బంద్‌ చేశారు. ఇబ్రహీంపట్నం ఫెర్రీ, తుమ్మలపాలెంలో సుమారు 300 కుటుంబాలు కేవలం చేపల వేట మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. గత పది రోజులుగా చేపల వేట లేకపోవటంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నట్లు వాపోతున్నారు. పడవులు అన్నీ ఒడ్డుకు చేర్చి మత్స్యకార్మికులు కాలక్షేపం చేస్తున్నారు.
 
ఇసుక రేవులు బంద్‌
నదిలో సరిపడా నీరు లేకపోవుటంతో పడవల్లో ఇసుకను ఒడ్డుకు చేర్చే అవకాశం లేక రేవులు సైతం మూసివేశారు. ఒక వైపు చేపల వేట జరగక జీవనోపాధి లేదని బాధపడుతుంటే ఇసుక లోడింగ్‌ కూడా ఆగిపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. మండల పరిధిలో ఫెర్రీ, గుంటుపల్లిలో ఇసుక రేవులు నడుస్తున్నాయి. ఒక్క ఫెర్రీ ఇసుక రేవులో 30 ఎక్స్‌కవేటర్‌ ద్వారా రోజుకు 400 లారీల ఇసుకను తరలిస్తుంటారు. ప్రత్యక్షంగా పరోక్షంగా 300 మంది కార్మికులకు ఈ రేవు ఉపాధి కల్పిస్తుంటుంది. ఇప్పుడు పనులు లేక ఇసుక రేవు కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
లాంచీల రాకపోకలకు ఇబ్బందులు
రాయపూడి నుంచి ఫెర్రీకి ప్రయాణికులను చేర వేసే లాంచీల రాకపోకలకు సైతం అంతరాయం కలుగుతుంది. లాంచీలు ఒడ్డుకు రావాలంటే సరిపడా నీరు ఉండాలి. మధ్యలో ఇసుక మేటలు బయటపడుతుండటంతో ఎక్కడ ఇరుక్కుపోతామోనని భయాందోళనలు చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితులు ఈ మధ్య కాలంలో రాలేదని స్థానికులు తెలుపుతున్నారు.
 
రేవులు నడవక పోవటం మరింత ఇబ్బంది
ఇసుక రేవులు నడవక పోవటంతో, పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. రోజూ వచ్చే ఆదాయం లేక కష్టంగా ఉంది. ఏమి చేయాలో పాలుపోవటం లేదు. ఇల్లు గడవటం అంతంత మాత్రంగా ఉంటుంది. ప్రభుత్వం ఆదుకోవాలి.
– భీమయ్య, ఫెర్రీ
 
ఇలాంటి దుస్థితి వస్తుందనుకోలేదు
కృష్ణా నదిలో నీరు లేక ఇలాంటి దుస్థితి వస్తుందనుకోలేదు. చేపల వేటకు వెళ్లినా ఉపయోగం లేకుండా పోతోంది. రోజుకు వంద రుపాయలు కూడా సంపాదించలేకపోతున్నాం.
– అంకరాజు, మత్స్యకార్మికుడు, ఫెర్రీ
 
పడవ వేయటం లేదు
చేపలు కూడా లేవు. పడవ వేసినా ఉపయోగం లేదు. మామూలుగా అయితే పడవ వేస్తే రోజుకు 5 లేక 600 వందలు సంపాదిస్తాము. కాని ఇపుడు ఆ పరిస్థితులు లేవు. చాలా ఇబ్బందిగా ఉంది. మాకు వేరే పనులు తెలియవు.
– వెంకటేశ్వరరావు, మత్స్యకార్మికుడు, ఫెర్రీ

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *