పశ్చిమగోదావరి జిల్లా ఓటర్లు ఎటువైపు మొగ్గుచూపారు?


ఓట్ల పండుగ ముగిసింది. అభ్యర్ధుల భవితవ్యాలు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమయ్యాయి. ఆ బాక్సులన్నీ స్ట్రాంగ్ రూముల్లో విశ్రాంతి తీసుకుంటున్నాయి. ఇక్కడి వరకు బాగానే ఉంది. మరి పోలింగ్ ఎలా జరిగింది? ఓటర్లు ఎటువైపు మొగ్గుచూపారు? వారు ఏ పార్టీ పక్షాన నిలవబోతున్నారు? ఇప్పుడు అందరి మదిలోనూ ఇవే ప్రశ్నలు! పశ్చిమగోదావరి జిల్లాలోనూ ఇవే ప్రశ్నలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జరుగుతున్న చర్చలు ఎలా సాగుతున్నాయో ఈ కథనంలో తెలుసుకోండి.
 
    తెలుగుదేశం పార్టీకి పశ్చిమగోదావరి జిల్లా కంచుకోట. ఇప్పుడే కాదు- గతంలోనూ జిల్లాలో ఇదే ట్రెండ్‌! టీడీపీని స్థాపించిన దగ్గర నుంచి ఈ జిల్లావాసులు ఎక్కువగా ఆ పార్టీ పక్షానే నిలిచారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చిన సమయంలో కూడా పశ్చిమ ఓటర్లు టీడీపీకే వెన్నుదన్నుగా నిలిచారు. 2014 ఎన్నికలలో అయితే ఇక చెప్పనక్కరలేదు. అప్పటి మిత్రపక్షమైన బీజేపీని కలుపుకొని జిల్లాలో ఉన్న పదిహేను అసెంబ్లీ సీట్లను కూటమికే కట్టబెట్టారు. అటువంటి జిల్లాలో ఈసారి ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. రాజకీయ పార్టీలే కాదు.. ఓటర్లలో రోజురోజుకు టెన్షన్ పెరిగిపోతోంది. పోలింగ్‌కి ముందు, ఆ తర్వాత కూడా రకరకాల ఊహాగానాలు కొనసాగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం మూడో ప్రధాన పార్టీగా జనసేన బరిలో నిలవడమే. దాంతో ఓటర్ల నాడి ఎవరికీ అంతుబట్టని విధంగా తయారైంది. బయటి వర్గాల్లో టాక్ ఎలా ఉన్నా.. టీడీపీ, వైసీపీలు మాత్రం ఈసారి జిల్లాలో తామే మెజారిటీ స్థానాలు సాధిస్తామని చెప్పుకుంటున్నాయి. జనసేన వర్గాల్లో మాత్రం ఈ ఎన్నికలపై పెద్దగా ఆశలు కనిపించడం లేదనేది రాజకీయ వర్గాల టాక్!
(స్పాట్‌)
పశ్చిమగోదావరి జిల్లాలో ఈసారి కూడా పోలింగ్ భారీగానే జరిగింది. గతంతో పోలిస్తే.. స్వల్ప శాతం తగ్గినప్పటికీ, అది పెద్దగా లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదనేది రాజకీయ పండితుల విశ్లేషణ. జిల్లాలో 2014 ఎన్నికల్లో 82. 79 శాతం ఓట్లు పోలవగా, ఈసారి 82.19 శాతం పోలింగ్ నమోదయ్యింది. కేవలం పాయింట్ ఆరు సున్నా శాతం ఓట్లు మాత్రమే తక్కువ నమోదయ్యాయి. ఇది పెద్ద విషయం కాదంటారు ఎన్నికల అధికారులు. ఈ సంగతి ఎలా ఉన్నా ఇప్పుడు రాజకీయ పార్టీల్లోనే అసలు సందడంతా నెలకొన్నది. తామే ఎక్కువ సీట్లు గెలవబోతున్నామని ఒకరంటే.. కాదు కాదు మేమే ఎక్కువ సీట్లు గెలుస్తామని మరో పార్టీ నాయకులు చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా ఈ లడాయి అంతా టీడీపీ, వైసీపీ నాయకుల మధ్యే సాగుతుందనుకోండి. అంతేకాదు, ఎందుకు తాము ఎక్కువ సీట్లు సాధించబోతున్నామో ఆ పార్టీలు సొంత భాష్యాలు కూడా చెప్పుకుంటున్నాయి.
(స్పాట్‌)
అధికార తెలుగుదేశం అంచనాల విషయానికి వస్తే.. ఆ పార్టీ నాయకులు భారీగానే సీట్లు సాధిస్తామని లెక్కలు కడుతున్నారు. ఈసారి కూడా పశ్చిమగోదావరిలో 12 అసెంబ్లీ సీట్లకు తగ్గకుండా తాము గెలుస్తామనీ, అందులో డౌటే లేదనీ అంటున్నారు. అందుకు వారు చెబుతున్న కారణాలు సహేతుకంగానే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పసుపు-కుంకుమ, పెన్షన్ల పెంపు , రైతు సుఖీభవ పథకాలని వారు ఉదహరిస్తున్నారు. ఈ మూడు పథకాలతోపాటు చంద్రబాబు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమలు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, రాజధాని అమరావతి నిర్మాణాలు తమకు మరింత కలిసొచ్చే అంశాలుగా వారు చెప్పుకొస్తున్నారు. ఈ పథకాల వల్లనే మహిళలు, వృద్ధులు పెద్దసంఖ్యలో ఓటు వేశారనీ, ఈ పరిణామం తమకు అనుకూలంగానే ఉంటుందనీ టీడీపీ నాయకుల అంచనా.
(స్పాట్‌)
ఇక వైసీపీ విషయానికి వస్త ఆ పార్టీ నేతలు కూడా భారీగానే ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో పశ్చిమ గోదావరిలో ఒక్క సీటు కూడా తాము గెలవలేదనీ, ఈసారి ఎనిమిదికి తగ్గకుండా అసెంబ్లీ సీట్లు గెలుస్తామనీ ఆ పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత, అవినీతి అనే రెండు కారణాలనే వారు ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. అవి వైసీపీకి లాభం చేకూర్చి జిల్లాలో అత్యధిక స్థానాలు గెలవడానికి దోహదం చేస్తాయని వారు లెక్కలు వేసుకుంటున్నారు. మూడో ప్రధాన పార్టీగా రంగంలో ఉన్న జనసేనలో పెద్దగా అంచనాలు కనిపించడం లేదు. పోలింగ్ ముందువరకు చాలా నియోజకవర్గాల్లో ఆ పార్టీ ప్రభావం ఉంటుందని భావించినా.. పోలింగ్ జరుగుతున్న సమయంలో ఆ పరిస్థితి కనిపించలేదు. దీంతో..ఆ పార్టీ వర్గాలు కాస్తంత నిరాశలో కూరుకుపోయాయి. అయితే, జిల్లాలో కనీసం రెండు స్థానాలైనా గెలుస్తామని జనసేన నాయకులు ధీమా వ్యక్తంచేస్తున్నారు. ముఖ్యంగా పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ పోటీచేసిన భీమవరంలో గెలుపు తమదేనన్న ధీమాను ఆ పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇదిగో ఇలా పశ్చిమలో సీట్ల గెలుపుపై ప్రధాన పార్టీల నేతలు ఎవరికి వారు అంచనాలు వేసుకుంటున్నారు. మరి వీరి అంచనాలు నిజమవుతాయో లేదో తేలాలంటే కౌంటింగ్ వరకు నిరీక్షించక తప్పదు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *