పశ్చిమలో పవన్ ఎఫెక్ట్.. ఆ అయిదు స్థానాల్లో..


ఏపీలో ప్రధాన రాజకీయ పార్టీలకు ఇప్పుడు ఒకటే సంకటం. ముఖ్యంగా టీడీపీ, వైసీపీలకి అయితే నిద్రపట్టడం లేదు. జనసేన పార్టీ ప్రభావం ఈ ఎన్నికల్లో ఎంత ఉంటుందో వారి అంచనాలకు అందడం లేదు. పశ్చిమగోదావరి జిల్లాలోనూ ఈ అంశంపైనే చర్చోపచర్చలు సాగుతున్నాయి! జనసేనకు కాపుకాసిన ఒక సామాజికవర్గం ఓట్ల ప్రభావం ఎవరి విజయావకాశాలను దెబ్బతీస్తుందో అని రకరకాల విశ్లేషణలు సాగుతున్నాయి. ఆ సంగతులేంటో ఈ కథనంలో తెలుసుకోండి.
    
     గతంలో మెగాస్టార్‌ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం ఉమ్మడి ఏపీలో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. 2009 ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో ఆ పార్టీ ఒకే ఒక అసెంబ్లీ సీటు సాధించగలిగింది. ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే.. నాటి పీఆర్పీ అధ్యక్షుడు చిరంజీవి పాలకొల్లు అసెంబ్లీ స్థానంలో పోటీచేసి పరాజయం పాలవడం. ఆ తర్వాత ఆ పార్టీ కాంగ్రెస్‌లోకి విలీనమైన సంగతి తెలిసిందే!
 
   ఇక తాజా విషయంలోకి వస్తే.. చిరంజీవి సోదరుడు పవన్‌కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ ప్రస్తుత ఎన్నికల్లో తన సత్తా నిరూపించుకోనుంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లోనూ ఆ పార్టీ అభ్యర్థులు బరిలో నిలిచారు. పోలింగ్‌ సరళిని పరిశీలిస్తే జనసేన ప్రభావం జిల్లాలో ఎంతో కొంత ఉంటుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. పశ్చిమలోని అయిదు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఇతర పార్టీల అభ్యర్ధుల భవితవ్యాన్ని జనసేన నిర్దేశించే అవకాశముందట. ఆయాచోట్ల కాపు ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉండటంతో పాటు పవన్ అభిమానులు కూడా అధిక సంఖ్యలో ఉండటం గమనార్హం!
 
   పవన్‌కల్యాణ్ పార్టీకి మొదటినుంచి ఒక వర్గం కాపుల మద్దతు ఉంది. ముఖ్యంగా కాపు యువత ఫాలోయింగ్‌ బాగా ఉంది. దీనికి తోడు ఆయన ఫ్యాన్స్‌ ఫ్యాక్టర్‌ కూడా పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో పశ్చిమలో పోలింగ్‌ తీరుతెన్నులను నిశితంగా గమనిస్తే అయిదు నియోజకవర్గాల్లో జనసేన ప్రభావం బాగా కనిపించినట్టుగా పరిశీలకులు చెబుతున్నారు. ఆ అయిదు స్థానాల్లోనే టీడీపీ, వైసీపీ, జనసేనల మధ్య ముక్కోణపు పోటీ బలంగా కొనసాగిందట. జిల్లాలో మిగిలిన పది అసెంబ్లీ స్థానాల్లోనూ ఆ పార్టీ ప్రభావం అంతంత మాత్రమే అంటున్నారు.
 
   పశ్చిమ గోదావరిలో ముక్కోణపు పోటీ ఉన్న అయిదు నియోజకవర్గాల్లో.. ఒకటి రెండుచోట్ల జనసేన గెలిచే అవకాశం ఉందట. భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, ఏలూరులలో ఆ పార్టీ ప్రభావం కొంత ఎక్కువగా ఉందన్నది రాజకీయ పండితుల అభిప్రాయం. భీమవరంలో జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ పోటీచేయడంతో అక్కడ వేవ్‌ గట్టిగానే ఉందట. అక్కడ పవన్‌కి ఉన్న అభిమానుల సంఖ్య కూడా ఎక్కువే. వారి ఓట్లు పవన్‌కు పడినా.. కాపుల ఓట్లు మాత్రం చీలిపోతాయట. ఈ పరిణామంలో నియోజకవర్గంలోని టీడీపీ, వైసీపీ, జనసేన అభ్యర్ధుల విజయావకాశాలను సంక్లిష్టంగా మారుస్తుందని కొందరు విశ్లేషకులు అంటున్నారు.
 
    పాలకొల్లులో జనసేన ఒకింత గట్టి అభ్యర్ధినే బరిలో నిలిపింది. వైసీపీ అభ్యర్థిత్వం దక్కకపోవడంతో ఆఖరి నిముషంలో జనసేనలోకి జంప్‌చేసి టిక్కెట్ సాధించిన గుణ్ణం నాగబాబుకు క్యాడర్ బలంగానే ఉందట. దీనికి తోడు కాపు సామాజికవర్గంలోనూ ఆయనకు కొంత ఇమేజ్ ఉందట. ఈ పరిణామం ప్రధాన పార్టీల అభ్యర్ధుల ఓటుబ్యాంక్‌పై ప్రభావం చూపే అవకాశం ఉందనేది కొందరి వాదన. ఇక నరసాపురం విషయానికి వస్తే.. ఇక్కడ డిసైడింగ్ ఓటుబ్యాంక్‌గా ఉన్న ఒక బీసీ సామాజికవర్గానికి చెందిన నాయకుడికి జనసేన టిక్కెట్ ఇచ్చింది. ఆయనకు గెలుపు అవకాశాలు అంతంత మాత్రం అయినా.. ఆయన సామాజికవర్గానికి చెందిన ఓట్లు చీలిపోయే ప్రమాదం ఉందంటున్నారు పరిశీలకులు. ఈ పరిస్థితి టీడీపీకి నష్టం చేస్తుందా? లేక వైసీపీకి నష్టం చేస్తుందా? అనేది ఇప్పుడే చెప్పలేమంటారు రాజకీయ విశ్లేషకులు.
 
   ఇక.. తాడేపల్లిగూడెం విషయానికి వస్తే.. ఇక్కడ కూడా భీమవరం మాదిరిగానే ఉందంట పరిస్థితి. జనసేన తరఫున పోటీకి దిగిన బొలిశెట్టి శ్రీనివాస్‌కు నియోజకవర్గంలో మంచి పట్టు ఉందట. దీనికితోడు కాపు సామాజికవర్గంలోనూ ఫాలోయింగ్‌ ఉందట. దీంతో ఇక్కడ పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఎవరు గెలుస్తారు? అనే విషయాలు అంచనా వేయలేకపోతున్నాం అంటున్నారు రాజకీయ పెద్దలు. ఇతర నియోజకవర్గాలతో పోలిస్తే.. ఏలూరులో జనసేన అభ్యర్థి కాస్త గట్టిగానే ఫైట్ ఇచ్చినా.. ఇప్పుడు ఆయనకు ఎన్ని ఓట్లు వస్తాయనేదే తాజా ప్రశ్న. ఎందుకంటే ఆయనకు వచ్చే ఓట్లే ప్రధాన పార్టీల విజయావకాశాలను నిర్దేశిస్తాయట. ఫలితంగా అక్కడ ప్రధాన పార్టీలు బాగా టెన్షన్ పడుతున్నాయట. ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరిలో జనసేనకు ఎన్ని ఓట్లు పడ్డాయి? ఏ మేరకు కాపు ఓట్లు చీల్చింది? వంటి విషయాలపై క్లారిటీ రావాలంటే కౌంటింగ్ వరకు ఆగక తప్పదు!

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *